logo

ఇదేంది జగన్‌.. ఇలా తిప్పుతున్నావ్‌..!

పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది.

Published : 05 May 2024 03:03 IST

న్యూస్‌టుడే, పెనుమూరు, పూతలపట్టు

పూతలపట్టు బ్యాంకు వద్ద పింఛన్ల కోసం వేచిఉన్న వృద్ధులు

పూతలపట్టు మండలం కొత్తకోటకు చెందిన ఓ వృద్ధుడికి బ్యాంకు ఖాతా ఉంది. ఆయనకు వచ్చే పింఛను బ్యాంకులో జమ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన రెండ్రోజులుగా బ్యాంకు వెళ్లినా ఇంకా జమ కాలేదనే సమాధానం వస్తోంది. ఎప్పుడు జమ అవుతుందో తెలియక, దానిపై సరైన సమాచారం లేక ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.

వెదురుకుప్పం మండలంలో సాంకేతిక కారణాలతో 77 మందికి బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు ఇప్పటికీ జమ కాలేదు. మూడ్రోజులుగా వారు ఇటు బ్యాంకులు, అటు సచివాలయాల వద్దకు కాళ్లరిగేలా తిరిగారు. పింఛను నగదు అసలు తమకు వస్తుందో.. రాదోనని ఆందోళన చెందారు. చివరకు అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి అందించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన తప్పినట్లయింది.

రాష్ట్ర ప్రభుత్వం మూడ్రోజులుగా వృద్ధులతో చెలగాటమాడుతోంది.. పింఛనుదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని కోరినా పట్టించుకోలే.. ప్రభుత్వం, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దే అందించవచ్చని ప్రతిపక్షాలు సూచించినా అవేవీ పట్టించుకోకుండా బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి జమ చేయడం, మిగిలిన వారికి ఇళ్లే వద్దే ఇచ్చేలా నిర్ణయించి కష్టాల పాల్జేసింది.. బ్యాంకు ఖాతాలు ఉన్న లబ్ధిదారులకు కొంత మందికి సాంకేతిక కారణాలతో నగదు జమకాకపోండంతో ఎక్కడ ఇస్తారనే విషయం తెలియక ఆందోళన చెందారు.


నేండ్రగుంటకు వెళ్లి తీసుకోవాలన్నారు..

మా సొంతూరు పాకాల మండలం గాదంకి. రెండేళ్లుగా సాతంబాకం గ్రామంలో ఉంటున్నా. అప్పటి నుంచి ఇక్కడే పింఛను తీసుకుంటున్నా. గతనెల కూడా ఇక్కడే నగదు తీసుకున్నా. ఈసారి మూడ్రోజులుగా తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు నీ పింఛను నగదు నేండ్రగుంట బ్యాంకులో జమ అయిందని చెప్పారు. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు కూడా చేతిలో డబ్బులు లేవు. ఏంచేయాలో పాలుపోవట్లేదు.

ముత్యాలమ్మ, సాతంబాకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని