logo

ఉద్యోగులు.. ఓటేయకూడదని..

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గందరగోళంగా మారింది. ఆర్‌వోల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులకు కనీసం తాగునీరు, నీడనిచ్చేందుకు షామియాలు ఏర్పాటు చేయలేకపోయారు.

Updated : 06 May 2024 06:57 IST

ఏర్పాట్లలో చేతులెత్తేసిన అధికారులు
పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు కరవు
జాబితాలో గల్లంతైన పలువురి పేర్లు
ఆర్‌వోల వైఫల్యంపై  విమర్శల వెల్లువ

పద్మావతి వర్సిటీలోని కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

అనుకున్నదే అయ్యింది. ఉద్యోగుల వ్యతిరేకతను వారి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం అడుగడుగునా కళ్లకు కట్టింది. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహణ తీరుపై పెద్దఎత్తున           విమర్శలు వ్యక్తమయ్యాయి. సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటు వేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగానే కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దరఖాస్తులు సమర్పించినా కొందరి పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. అష్టకష్టాలు పడి వస్తే ఓటు లేకుండా చేశారంటూ పలువురు ఉద్యోగులు మండిపడ్డారు.

 ఈనాడు డిజిటల్‌, తిరుపతి

తిరుపతిలో పోలీసులతో ఓటర్ల వాగ్వాదం

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గందరగోళంగా మారింది. ఆర్‌వోల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులకు కనీసం తాగునీరు, నీడనిచ్చేందుకు షామియాలు ఏర్పాటు చేయలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను తమ ఓటుతో ఎండగట్టేందుకు ఉద్యోగులు ఆదివారం ఉదయమే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రధానంగా సహాయ కేంద్రాల్లోని సిబ్బంది ఓటర్ల సందేహాలు నివృత్తి చేయలేకపోయారు. కనీస అవగాహన లేనివారిని అందులో నియమించారని పలువురు అధికారులను నిలదీశారు.

కనీస వసతులు లేక..

చంద్రగిరి నియోజకవర్గంలోని ఓటర్లు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద ఉదయం ఎనిమిది గంటలకే బారులు తీరారు. ఎన్నికల అధికారులు ఎలాంటి నిబంధనలు వెల్లడించకపోవడంతో ఉద్యోగినులు హ్యాండ్‌ బ్యాగులు, చరవాణులతో లైన్లలో నిలుచున్నారు. తీరా దగ్గరకు వెళ్లాక వాటిని లోపలికి అనుమతించమని పోలీసులు చెప్పడంతో లైను మధ్యలోంచే వెళ్లిపోయారు.  ఎండలో నిలబడి ఓపిక నశించి బారికేడ్ల వద్దకు దూసుకెళ్లగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. లోపల ఆరు కేంద్రాలు ఉండగా రెండు క్యూలైన్లలో మాత్రమే లోపలికి పంపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఎంపీ, ఎమ్మెల్యేలకు చెందిన రెండు స్లిప్పులు ఒకేసారి ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. చీకటి పడినా శ్రీపద్మావతి విశ్వవిద్యాలయంలో పోలింగ్‌ కొనసాగగా కనీసం విద్యుత్తు ఏర్పాటు చేయకపోవడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.

పులివర్తి నాని ఆగ్రహం

కేంద్రానికి చేరుకున్న చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తినాని ఆర్‌వో, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కనీస అవసరాలు కల్పించకపోవడంపై నిరసనకు దిగా రు. ఉద్యోగినులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఆర్వో పనితీరు గందరగోళంగా ఉందని విమర్శించారు.  ఉద్యోగులు విసుగొచ్చి వెనుదిరిగి వెళ్లేలా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

గంట ఆలస్యం

సత్యవేడులోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉదయం తొమ్మిదికల్లా ఓటర్లు చేరుకున్నా గమ్‌ బాటిళ్లు, బ్యాలెట్‌ కాగితాలు లేక గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభించారు. ఆర్వో నర్సింహులు నిర్వహణ లోపాలను ఓటర్లు తూర్పారబట్టారు. పలువురు పోలింగ్‌ కేంద్రంలోపలే ఆర్వో డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.


వెంకటగిరిలో గంట ఆలస్యంగా..

తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణతో ఎస్సై సుధాకర్‌రెడ్డి వాగ్వాదం

వెంకటగిరి, న్యూస్‌టుడే:  వెంకటగిరిలో విశ్వోదయ డిగ్రీ కళాశాల ప్రాంగణానికి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు ఆలస్యంగా రావడంతో 10 గంటలకు ప్రారంభమైంది. ఎండలు మండుతున్నా ఇక్కడ షామియానా, తాగునీటి వసతులు లేకపోవడంతో ఉదోయగులు ఇబ్బంది పడ్డారు. ్య పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యంపై తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో చెబుతుండగా.. ఎస్సై సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. డీఎస్పీ పైడేశ్వరరావు సర్దిచెప్పారు. వైకాపా నాయకులు పలువురు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపై కురుగొండ్ల రామకృష్ణ ఆర్వోను ప్రశ్నించారు.

సూళ్లూరుపేటలో ఆరు తర్వాత కొనసాగింపు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట వీఎస్‌ఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం ఆరు దాటినా ఉద్యోగులు క్యూలైన్లలో వేచి ఉండటంతో పూర్తయ్యే వరకు కొనసాగించారు.

సీఐ పేరు గల్లంతు

పద్మావతి వర్సిటీలోని హెల్ప్‌ డెస్క్‌ వద్ద తమ పేర్లు లేవని తెలిసి వివరాలు ఆరాతీస్తున్న ఉద్యోగులు, ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.

సరంజామా లేకుండానే..

శ్రీకాళహస్తిలోని స్కిట్‌ కళాశాల కేంద్రం వద్దకు ఉదాయాన్నే 300 మందిపైగా ఉద్యోగులు చేరుకున్నారు. గంటపాటు ఎండలోనే నిలబడ్డారు. కేంద్రం వద్దకు వచ్చిన తెదేపా అనుచరులను బెదిరించి పంపించిన పోలీసులు వైకాపా నాయకులతో ముచ్చట్లాడారు. ఇక్కడ ఎండకు అల్లాడిన ఓటర్లకు మంచినీటి సౌకర్యం కల్పించలేదు.

వివాదాస్పదంగా ఆర్వో వ్యవహారం..

చంద్రగిరి నియోజకవర్గ ఆర్వో నిశాంత్‌రెడ్డి తనో బాధ్యతగల అధికారినని మరిచిపోయినట్లు కనిపించింది. పోలింగ్‌ కేంద్రంలోని సమస్యలపై ప్రశ్నించిన పులివర్తి నానికి సరైన సమాధానం ఇవ్వకుండా మొండిగా వ్యవహరించారు. పోలింగ్‌ నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి సూచనలు ఇవ్వకుండా, ఉద్యోగులు ఆగ్రహానికి లోనైనప్పుడు చేతులెత్తేశారు.
పేర్లు గల్లంతు: తిరుపతిలోని న్యూబాలాజీ కాలనీలోని ఎస్వీ క్యాంపస్‌ హైస్కూల్‌లో ఉన్న కేంద్రానికి వచ్చిన పలువురు ఓటరు లిస్టులో తమ పేరులేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఆర్వోను కలవగా తిరిగి దరఖాస్తు చేసుకోమనడంతో వెనుదిరిగారు.

పోలింగ్‌ కేంద్రంలో లోటుపాట్లపై ఆర్‌వోతో మాట్లాడుతున్న పులివర్తి నాని


అడిగితే 144 సెక్షన్‌ అంటున్నారు

ఉద్యోగులకు  సరైన సౌకర్యాలు కల్పించలేదు. ముందుకు దూసుకుపోతుంటే 144 సెక్షన్‌ అమలులో ఉంది లాఠీఛార్జీ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎలా ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకుంటారు.

పద్మారెడ్డి, పోలింగ్‌ ఏజెంట్‌


స్పందన కరవు

ఓటు వేయడానికి చాలా సమ యం పడుతోంది. హెల్ప్‌లైన్‌లో సరిగ్గా స్పందించడంలేదు. అసలే ఎండలు. కనీస సౌకర్యాలు కల్పించడంలో సిబ్బంది విఫలమయ్యారు. మహిళలైతే వెనుదిరుగుతున్నారు.

కపిలేశ్వర్‌, ఓటరు


గందరగోళం  

ఎంపీ, ఎమ్మెల్యేలకు వెంటవెంటనే ఓటు వేయాల్సి రావడంతో గందరగోళానికి గుర య్యాం. ముందస్తు నియమాలు వివరించడంలో అధికారులు విఫలమయ్యారు. రెండు క్యూలైన్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ఎండలకు అల్లాడాల్సి వచ్చింది. 

రామిరెడ్డి, ఓటరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని