logo

జగన్‌.. భూ భస్మాసుర అస్ర్తం

భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు..

Updated : 06 May 2024 06:54 IST

టైటిలింగ్‌ చట్టంతో కొత్త ఇబ్బందులు
వైకాపా ప్రభుత్వ నిర్వాకం
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు

భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు.. రైతును ఉద్ధరించడంలో తానే గొప్పోడినని చెప్పుకొనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారి భూములను నొక్కేసే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని(భూ యాజమాన్య హక్కు చట్టం) తీసుకొచ్చారు.. అతడి అడుగులకు మడుగులొత్తే కొందరు తొత్తుల్లాంటి అధికారులతో చాపకింద నీరులా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. వారు భూమికి హక్కుదారులుగా ఏ పేరు రికార్డుల్లో రాస్తే వారికే చెందుతుంది.. భూ సమస్య తలెత్తితే సివిల్‌ కోర్టుల్లో సవాలు చేసి న్యాయం పొందే అవకాశం ఇప్పటి వరకు ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన పిడుగు లాంటి చట్టంతో సివిల్‌ కోర్టుల్లో ఈ భూ వివాదాలు పరిష్కరించుకునే వీల్లేదు.. ఇలా ప్రజలపై జగన్‌ తన తుది అస్త్రాన్ని ప్రయోగించాడని భిన్నవర్గాలు పేర్కొంటున్నాయి.

ఈనాడు, చిత్తూరు; న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు), కుప్పం

హైకోర్టు వరకు రైతులు వెళ్లగలరా?

చిత్తూరు జిల్లాలో 90శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. అరెకరం నుంచి రెండెకరాల వరకు పొలం ఉన్నవారే. భూమిని నమ్ముకుని జీవించే వీరు పంటలో నష్టం వచ్చినప్పటికీ పొలాన్ని బీడుగా చూసి ఉండలేక భూ మాతను నమ్ముకుని అప్పోసొప్పో చేసి పంటలు వేసి తద్వారా అందిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు తమ భూములు రక్షించుకునేందుకు హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితి ఉందా..? పోరాడే జవసత్వాలు బక్క రైతులకు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఈ చట్టం అమలైతే సొంత భూమిని వదులుకుని కూలి బతుకులు బతకడానికి రైతన్నలు సిద్ధం కావాల్సిందే మరి. కొత్త చట్టం అమలైతే అందరూ నష్టపోతారని, సొంత భూములను రైతు వదులుకోవాల్సిందేనని మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నష్టమే.. ప్రయోజనం లేదు..

భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల రైతులు, భూ యజమానులకు నష్టం తప్ప ప్రయోజనం లేదు. చాలామంది రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫై చేశాక ప్రజల వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాలు టీఆర్‌వోకి చూపాలి. టీఆర్‌వో సంతృప్తి మేరకు టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదు చేస్తారు. అప్పుడే యాజమాన్య హక్కులు వస్తాయి. ఒకవేళ టీఆర్‌వో ఇతర వ్యక్తుల పేరు నమోదు చేస్తే అసలైన యజమాని.. సదరు భూమి తనదేనని రుజువు చేసుకోవాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. స్థానిక సివిల్‌ కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. సామాన్యులు, చిన్న, సన్నకారు రైతులు  నష్టపోతారు.

ప్రభాకర్‌నాయుడు, విశ్రాంత తహసీల్దారు, చిత్తూరు

అధికారికంగా కాజేసే యత్నం

శాంతిపురం మండలం సాతు రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అనాధీనం పేరుతో అధికార పార్టీ నేతలు కాజేసేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ముందుగా ఈ భూములను అధికారికంగా స్వాధీనం చేసుకోవాలని ఆరు నెలల కిందట కొందరు వైకాపా నేతలు చక్రం తిప్పారు. పట్టాదారులు స్థానికేతరులని కారణం చూపి.. రెవెన్యూ అధికారులతో పట్టాలు రద్దు చేసి అనాధీనంగా నమోదు చేయించారు. డీకేటీ పట్టాలు తీసుకోవడానికి నాయకులు ప్రయత్నించగా.. స్థానికులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు.

వలస వెళ్లి చూసుకోలేదా ఇక అంతే..

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఊళ్లలోని భూములు బీడుగా మారాయి. అరకొర భూమి రికార్డులు మా పేరిటే ఉన్నాయి కదా? అని నిరక్షరాస్యులు, పేదలు వాటి గురించి ఆరా తీసే అవకాశం లేదు. భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఇవి అధికార బలమున్న వ్యక్తులు చేజిక్కించుకోవడం మంచినీళ్లు తాగినంత సులువు. వలస వెళ్లిన రైతుల స్థలం తనదని రెవెన్యూ అధికారులకు అర్జీ ఇస్తే దాన్ని డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో చేరుస్తారు. తర్వాత వివాదం ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌ (ఎల్‌టీఏవో) చెంతకు చేరుతుంది. సదరు అధికారిని ప్రభుత్వమే నియమిస్తున్నందున ఆయన/ ఆమె అధికార పార్టీ నేతకు అనుకూలంగా వ్యవహరించడం ఖాయం. రెండేళ్లపాటు దీనిపై ఎవరూ అప్పీలు చేయకుంటే పేదల భూమి పెత్తందారుల పరమవుతుంది.

కుప్పం మండలం పొన్నాంగూరు రెవెన్యూ సర్వే నంబరు 104/3లో గ్రామానికి చెందిన అంధుడు కన్‌మణికి చెందిన 34 సెంట్ల భూమిని వైకాపా మండల నాయకుడు కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కొంతకాలానికి మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు న్యాయం చేయాలంటూ ఆర్డీవో శ్రీనివాసులుకు మొర పెట్టుకున్నారు. ఇదే పరిస్థితి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలోకి వచ్చి బాధితుడికి రెండేళ్లపాటు నిజం తెలియకుంటే వైకాపా నేత కుమారుడికే భూమి దక్కుతుంది. అంధుడైన కన్‌మణి న్యాయం కోసం అమరావతిలోని హైకోర్టుకు వెళ్లాల్సిందే.

చిత్తూరు నగరంలోని 5.02 ఎకరాల భూమిని 1981లో మీనాక్షమ్మ, మరో ముగ్గురు వ్యక్తులు వెంకటాచలపతికి విక్రయించారు. తనకు తెలియకుండా కొందరు కరుణాకరరెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారని వెంకటాచలపతి కుమారుడు దినేష్‌ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వివాదంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో నగరంలోని భూ యజమానులు తమ ఆస్తి భద్రమేనా? అని పరిశీలించుకోవాల్సి వచ్చింది.  


భూమిపై హక్కులు కోల్పోతారు..

భూ యాజమాన్య చట్టంతో భూములపై రైతులు, భూ యజమానులు తమ హక్కులు కోల్పోతారు.  భూములను ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. ప్రజలతో పాటు రైతులకు నష్టం జరుగుతుంది. భూములపై రాజకీయ జోక్యం పెరిగి రక్షణ ఉండదు. సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి.    

విజయచంద్రనాయుడు, విశ్రాంత ఏవో, చిత్తూరు


రైతులకు ఇబ్బందులే..

కొత్త చట్టం ద్వారా రైతులకు ఇబ్బందులే. భూ యాజమాన్య హక్కు చట్టం అమలు చేయాలంటే భూ సర్వే పక్కాగా జరగాలి. ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే లోపభూయిష్టంగా ఉంది. సమగ్రంగా చేపట్టలేదు. రైతులు భూమిపై హక్కులు కోల్పోతారు. న్యాయం కోసం సివిల్‌ కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండదు. హైకోర్టుకు వెళ్లాలి. పేద రైతులకు ఇది సాధ్యమేనా.? అన్ని విధాలా రైతులు, ప్రజలకు ఈ చట్టం ఎంతో ప్రమాదకరం.

రమేష్‌, విశ్రాంత తహసీల్దారు, వడ్డేపల్లి, పూతలపట్టు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని