logo

ఆరోగ్యశ్రీ సేవలపై సందిగ్ధం

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఏడాది నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.

Published : 23 May 2024 04:39 IST

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఏడాది నుంచి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వాటిని వెనక్కి పంపేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు సేవలు అందించలేమని, శస్త్రచికిత్సలు చేసే పరిస్థితి లేదని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించడం.. బుధవారం మధ్యాహ్నం నుంచే సేవలు యథావిధిగా అందుతున్నాయని అధికారులు చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. జిల్లాలోని 37 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేసినా సాయంత్రానికి కేసులు తీసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కొంత సొమ్ము విడుదలవుతుందని పేర్కొంటున్నారు. ఒకటి, రెండు మినహా మిగిలినవన్నీ యథావిధిగా సేవలందిస్తున్నాయని చెబుతున్నారు. అప్పుచేసి ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులు నడుపుతున్నామని, ఏడాది నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో కనీసం సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయా యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం సేవలు అందించే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని