logo

Super Star Krishna: గోదారి తీరంలో.. కృష్ణయ్య పరవళ్లు

ఆకాశంలో ఒక తార.. నా కోసమొచ్చింది ఈవేళ అని నాయికతో స్టెప్పులేసినా.. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం.. అని కార్మికుల్లో చైతన్యం రగిలిస్తూ గర్జించినా.. పనిచేసే రైతన్నా..

Updated : 16 Nov 2022 09:25 IST

రాజమహేంద్రవరం సాంస్కృతికం: ఆకాశంలో ఒక తార.. నా కోసమొచ్చింది ఈవేళ అని నాయికతో స్టెప్పులేసినా.. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం.. అని కార్మికుల్లో చైతన్యం రగిలిస్తూ గర్జించినా.. పనిచేసే రైతన్నా.. పాటుపడే కూలన్నా.. రండోయ్‌ రారండోయ్‌ అని రైతులకు సందేశమిచ్చినా.. తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా అని దేశభక్తి నింపినా.. నటశేఖరుడికే సాధ్యం. తొలి రోజుల్లో ఆయన నటించిన చిత్రాలకు గోదావరి తీరం ప్రాణం పోసింది. తూర్పుగోదావరి జిల్లాతో నటశేఖరుడి అనుబంధమిది.

కోనసీమతో ‘కృష్ణా’నుబంధం

పి.గన్నవరం: మన ఊరికథ, గౌరి, పచ్చని సంసారం, పచ్చనికాపురం, కిరాయి కోటిగాడు... కోనసీమ అందాల మధ్య అపురూపంగా రూపుదిద్దుకున్నాయి. ‘మన ఊరికథ’ మానేపల్లి, పెదపట్నంలో నెలరోజులు చిత్రీకరణతో తెరకెక్కింది. 1965లో ‘తేనె మనసులు’ కోనసీమ, రాజమహేంద్రవరంలో చిత్రీకరణ జరుపుకొంది.

అల్లూరి కీర్తికి అడుగులిక్కడే!

తుని, కోటనందూరు: తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’ను... అన్నవరం, కేడీపేట, చింతపల్లి పరిసరాల్లో నెల రోజులకుపైగా చిత్రీకరించారు. అప్పట్లో హోటళ్లు, లాడ్జీలు లేకపోవడంతో ఎక్కడికక్కడే షెడ్డులు, గుడారాలు వేసి చిత్రీకరణ జరిపారు. చిత్రీకరణ మధ్యలోనే దర్శకుడు రామచంద్రరావు మృతి చెందడంతో హీరో కృష్ణ, దాస్‌ ఆ బాధ్యతలు తీసుకుని పూర్తి చేశారు. ‘తెలుగువీర లేవరా...’ పాటను అన్నవరం దేవస్థానంలో చిత్రీకరించారు.

మరువలేని జ్ఞాపకం

మండపేట: మండపేట.. పరిసరాల్లో కృష్ణ హీరోగా చిత్రీకరించిన 5 సినిమాలూ సూపర్‌ హిట్‌. 1975లో పాడిపంటలు, 1981లో ఊరికి మొనగాడు, భోగి మంటలు, 1982లో ఈనాడు, 1983లో ఊరంతా సంక్రాంతి రూపుదిద్దుకున్నాయి. ఊరికి మొనగాడు.. సత్యశ్రీ థియేటరు నిర్మాణంలో ఉండగా చిత్రీకరించారు. రాశి మూవీస్‌ అధినేత ఎం.నరసింహారావుది మండపేట. కృష్ణ కుటుంబంతో వీరిది 40 ఏళ్లపైగా అనుబంధం. ఆయనతో హిట్‌ సినిమాలు తీసి శతదినోత్సవాలు జరిపారు.

పేరుపేరునా పలకరింపు

కడియం: కడియం పరిసరాల్లో చిత్రీకరించిన ‘పాడిపంటలు’ కృష్ణ కెరీర్‌లో చక్కటి మైలురాయి. రైతుల సాధకబాధకాల ఇతివృత్తం నేపథ్యంలో ఇక్కడి రైతులు, భూస్వాములతో ఆయన స్నేహాన్ని కొనసాగించారు. కడియంలో శ్రీవెంకట సూర్య సినిమాహాలు ప్రారంభానికి వచ్చిన కృష్ణ, విజయనిర్మల ఇక్కడి వారిని పేర్లతో పిలవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది.

పులిదిండి.. ప్రేమ దండి

ఆత్రేయపురం: కృష్ణకు.. పులిదిండి గ్రామానికి విడదీయరాని అనుబంధం. 1967లో సాక్షి సినిమా షూటింగ్‌ వేళ నెలరోజులు ఉన్నారు. కృష్ణ.. విజయ నిర్మల జంటగా బాపు సన్నివేశాలు తెరకెక్కించారు. ’’అమ్మకడుపు చల్లగా.. అత్తకడుపు చల్లగా..’’ పాటను మీసాల వేణుగోపాలుడి కోవెలలో చిత్రీకరించారు. వధూవరులుగా ఉన్న వీరిని చూసి హాస్యనటుడు రాజబాబు.. వేణుగోపాలుడు మహిమాన్వితుడు.. ఇక్కడ ఘటనలు నిజజీవితంలోనూ జరుగుతాయి.. మరి మీ విషయంలో ఏమవునో అని జోక్‌ వేశారట. అయితే యాదృచ్ఛికంగా వీరి మధ్య ప్రేమ చిగురించి ఒకటయ్యారు. తర్వాత మళ్లీ గ్రామానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. లొల్ల లాకుల వద్ద ‘పాడిపంటలు’ సినిమాలోని ‘అట్ల తద్దె.. ఆరట్లోయి.’ పాట తీశారు.

ఇరుసు లేని బండి.. మెరిసెనండి

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు పరిసరాల్లో పాడి పంటలు సినిమాలో ఎక్కువ భాగం కుమారదేవం, చిడిపి, లంక భూముల్లో చిత్రీకరించారు. ఆ సినిమాలో ‘ఇరుసు లేని బండి.. ఈశ్వరుని బండి’ పాటను గోదావరి గట్టున ఎడ్ల బండి నేపథ్యంలో తీశారు.

చెన్నై నుంచి రైల్లో నీరొచ్చేది

అన్నవరం: ‘నాయుడుగారబ్బాయి’ చిత్రంలో సన్నివేశాలు అన్నవరం కొండపై వారం రోజులు చిత్రీకరించారు. ఆయనకు చెన్నై నుంచి రైల్లో నీరు వచ్చేది. కలవడానికి వెళ్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. పంపా నది కనిపించేలా చిత్రీకరించారు.

-జగన్నాథరావు, విశ్రాంత డిప్యూటీ ఈవో

రామచంద్రపురానికి చుట్టాలబ్బాయి

రామచంద్రపురం: రామచంద్రపురానికి సూపర్‌స్టార్‌ చుట్టాలబ్బాయి కావడంతో ఇక్కడ పాడి పంటలు, భోగి మంటలు, ఊరికి మొనగాడు సినిమాలు చిత్రీకరణకు నోచుకున్నాయి. జయసుధ, విజయనిర్మల, రామచంద్రపురంవాసి డాక్టర్‌ స్టాలిన్‌ సతీమణి దివంగత డాక్టర్‌ రేణుకాదేవి.. ముగ్గురూ అన్నదమ్ముల పిల్లలు కావడంతో వీరు తరచూ రామచంద్రపురం వచ్చేవారు. 1995లో కృష్ణ దంపతులు.. రేణుకాదేవి గృహప్రవేశానికి హాజరయ్యారు. ‘ఇదిగో తెల్లచీర.. ఇదిగో మల్లెపూలు.. అని కుర్రకారును ఉర్రూతలూగించిన’ పాటను రామచంద్రపురం రాజావారి కోటలో చిత్రీకరించారు. భోగిమంటలు.. సినిమాను రామచంద్రపురం కోట పరిసరాల్లోనే చిత్రీకరించారు.

రాజమహేంద్రితో అనుబంధం

రాజమహేంద్రవరం సాంస్కృతికం: 1976లో ‘పాడిపంటలు’ ధవళేశ్వరం బ్యారేజీ, వేమగిరి, గోదావరి పాయల్లో చిత్రీకరణ జరుపుకొంది. అచ్చతెనుగు రైతులా పంచెకట్టుతో చక్కటి హావభావాలతో ఆయన నటించిన పాడిపంటలు చిత్రసీమలో అద్భుత విజయాన్ని సాధించింది. రాజమహేంద్రవరం నగరంలో కొన్ని వేడుకలకు ఆయన హాజరయ్యారు.

స్నేహశీలి కృష్ణ..

కృష్ణ కుటుంబంతో నాకు చక్కటి స్నేహం ఉంది. నరేష్‌ మిత్రుడు కావడంతో ఆయన ద్వారా కృష్ణ, విజయనిర్మలతో బంధం పెరిగింది. ఎప్పుడు హైదరాబాద్‌ వెళ్లినా వారింటికి ఆహ్వానం ఉండేది. అదే స్నేహంతో రాజమహేంద్రవరంలో 1998లో నా కుమార్తె పెళ్లికి వచ్చి ఆశీస్సులు అందించారు. ఏటా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రతిభా వైజయంతి పురస్కారాలు ఇచ్చేవాడిని. ఓ ఏడాది కృష్ణ, విజయనిర్మల విచ్చేశారు.

- పట్టపగలు వెంకటరావు, సమాజ సేవకుడు, రాజమహేంద్రవరం

మా మండువాలోనే షూటింగ్‌

పామర్రు: కృష్ణది... మంచి మనసు, స్నేహశీలి. 1980 ఆగస్టులో ఊరికి మొనగాడు సినిమా కోసం అందంగా ఉండే మా మండువాను షూటింగ్‌కు వినియోగించారు. నెల రోజులు కృష్ణ, జయప్రద జంటగా షూటింగ్‌ తీయడంతో కృష్ణతో స్నేహబంధం పెరిగింది. కొన్నాళ్లకు భోగిమంటలు సినిమా చిత్రీకరణకు వచ్చారు.

-చిట్టూరి వెంకట్రాయుడు, కూళ్ల వాసి

వెన్నుతట్టి ప్రోత్సహించారు..

నేను మల్లికార్జున మూవీస్‌ పతాకంపై హర హర శంభోశంకర, కార్తికమాసం సినిమాలు తీశా. హీరో కృష్ణకు వీరాభిమానిని. ఈ రెండు సినిమాలను కృష్ణ క్లాప్‌ కొట్టించి ప్రారంభించారు. కార్తికమాసం సినిమాలో శివుడి పాత్రను కృష్ణ చేయాల్సి ఉన్నా అనారోగ్యంతో చేయలేదు. ఎప్పుడు వెళ్లినా ఆప్యాయంగా పలకరించి భోజనం పెట్టి పంపేవారు.

-అనపర్తి శివరామకృష్ణ (శివుడు), కొవ్వూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని