logo

జగనన్న కాలనీ ఇళ్లకు సీనరేజ్‌ దెబ్బ..!

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలిచ్చారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు సిద్ధమయ్యారు.

Published : 26 May 2023 04:05 IST

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

వరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలిచ్చారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో యూనిట్‌ విలువ రూ.2.50 లక్షలు కాగా, ఇప్పుడు రూ.1.80 లక్షలుగా నిర్ణయించారు. అప్పు చేసి సొంతగూడు కోసం కొందరు పేదలు నిర్మాణాలను ప్రారంభించారు. కొన్ని పునాదుల దశలో ఉండగా, మరికొన్ని ఆపై దశకు చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీ లబ్ధిదారులపై సీనరేజ్‌ పేరుతో అదనపు భారం మోపింది. భవన నిర్మాణ సామగ్రిపై సీనరేజ్‌ విధిస్తూ ఈ నెల్లో ఉత్తర్వులు జారీ చేసింది.

అదనపు భారం..

ఇళ్ల నిర్మాణాలకు వినియోగించే కంకరపై సీనరేజ్‌ వసూలు చేస్తున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంపై సీనరేజ్‌ భారం పడింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు అదనపు భారం సీనరేజ్‌ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్న కంకర ఆయా ప్రాంతాల నుంచి తరలించే క్రమంలో సీనరేజ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే రాయితీ చాలక అప్పులు చేసి ఇళ్లు కట్టుకుంటున్న పేదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనరేజ్‌ భారంతో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.

భారం ఇలా..

జగనన్న కాలనీలో ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 6 యూనిట్ల వరకు కంకర(బ్లాక్‌ చిప్స్‌) వినియోగిస్తున్నారు. పునాదులు నింపటానికి రెండు లారీల వరకు ఇది అవసరం. 6 యూనిట్ల కంకరకు రూ.3,900, గ్రావెల్‌ రెండు లారీలకు రూ.3వేల వరకు సీనరేజ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీని కోసం ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో ఈ సామగ్రి కొనుగోలు చేసి రవాణా చేయడం పేదలకు భారంగా మారింది. దీనికితోడు సీనరేజ్‌ ఛార్జీలు మరింత కుంగదీస్తున్నాయి. ఈ ఛార్జీల నేపథ్యంలో సిమెంట్‌ ఇటుకల ఛార్జీలను అమాంతంగా పెంచేశారు. ఒక్కో ఇటుక ఇప్పటి వరకు రూ.18 ఉండగా, ఇప్పుడు రూ.21కు పెంచేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్ఠంగా 2వేల ఇటుకల వరకు వినియోగిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తోంది. 480 కేజీల ఇనుము, 90 బస్తాల సిమెంట్‌ సరఫరా చేస్తున్నా.. యూనిట్‌ విలువలో దీన్ని మినహాయిస్తున్నారు. ఒక్కో ఇంటిపైనా రూ.10వేల నుంచి రూ.15వేల వరకు అదనపు భారం పడటంతో వాతావరణం అనుకూలంగా ఉన్నా.. నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.

ఇప్పటికి 15,690 ఇళ్లే..

కాకినాడ జిల్లాలోని 20 మండలాలు, ఏడు పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వీటిలో 70,792 ఇళ్లను మంజూరు చేయగా, 66,345 గృహాలకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికి కేవలం 15,690 ఇళ్లు మాత్రమే నూరుశాతం పూర్తయ్యాయి. 38,249 ఇళ్లకు శంకుస్థాపనలు జరిగినా, పనులు ప్రారంభించలేదు. 9,696 ఇళ్లు పునాది దశ దాటాయి. 1,567 ఇళ్లు గోడల దశలో ఉండగా, 1,143 ఇళ్లు మిద్దెస్థాయికి చేరాయి. ఇప్పటికి రూ.390కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. కేవలం 42 శాతం ఇళ్లు పునాది, ఆ పై దశలో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ విలువ చాలక.. లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోగా.. ఇళ్లు కడుతున్న పేదలపై సీనరేజ్‌ ఛార్జీల రూపంలో ప్రభుత్వం పరోక్షంగా భారం మోపడంపై పెదవి విరుస్తున్నారు.

పట్టణాల్లో పరిస్థితి దయనీయం..

కాకినాడ నగరంతో పాటు పెద్దాపురం, పిఠాపురం పట్టణాల్లో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను గుత్తేదారులకు అప్పగించారు. కాకినాడ నగరంలో పేదలకు కొమరగిరి, పండూరు, ఏపీ త్రయం గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గుత్తేదారులతో నిర్మాణాలు ప్రారంభించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.60 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.80 లక్షలు రాయితీ ఇవ్వగా, బ్యాంకు నుంచి ఒక్కో ఇంటికి రూ.35వేలు రుణం ఇప్పిస్తున్నారు. మిగతా సొమ్ము లబ్ధిదారులు భరించాల్సి వస్తోంది. ఇప్పుడు నిర్మాణ సామగ్రిపై సీనరేజ్‌ ఛార్జీలు వసూలు చేయడంతో గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. కాకినాడ నగరానికి సంబంధించి 6వేల ఇళ్ల వరకు గ్రౌండింగ్‌ అయ్యాయి. వీటిలో 75 శాతం పునాదుల దశలోనే ఉన్నాయి. వీటికి అవసరమైన మట్టి, కంకర తెచ్చేందుకు సీనరేజ్‌ ఛార్జీలు భారంగా మారాయి.


కొంత ఇబ్బందైనా.. తప్పదు

-బి.సుధాకరపట్నాయక్‌, జిల్లా గృహ నిర్మాణాధికారి, కాకినాడ జిల్లా

జిల్లాలో  జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు వేగవంతానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చి, లబ్ధిదారుల ఖాతాలకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. సీనరేజ్‌ ఛార్జీలు కొంత ఇబ్బందైనా.. తప్పదు మరి. ఇంటి నిర్మాణంలో ఇది పెద్ద భారం కాదని భావిస్తున్నాం. సిమెంట్‌, ఇసుక, ఇనుము ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని