logo

వేలిముద్ర పడకున్నా.. లబ్ధిదారుకి సాంత్వన

ప్రభుత్వం అందించే రేషన్‌ సరకులు తీసుకునేందుకు పేదలు ఇప్పటివరకు చేతి వేలిముద్రతో ఈ-పోస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ వేయాల్సివచ్చేది.

Published : 02 Jun 2023 04:54 IST

న్యూస్‌టుడే, అల్లవరం

అల్లవరంలో ఐరిస్‌ ద్వారా రేషన్‌ సరకుల పంపిణీ

ప్రభుత్వం అందించే రేషన్‌ సరకులు తీసుకునేందుకు పేదలు ఇప్పటివరకు చేతి వేలిముద్రతో ఈ-పోస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ వేయాల్సివచ్చేది. పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాల వద్ద వేలిముద్ర వేయడం ద్వారా నిత్యావసరాలను లబ్ధిదారులు తీసుకునేవారు. చాలా మంది వృద్ధాప్యం, చేతివృత్తులు చేసేవారి వేలిముద్రలు పడక తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారికి మరో విధానం ద్వారా నిత్యావసరాలు అందించే మార్గంలేక అధికారులు, సిబ్బంది నిస్సహాయ స్థితిలో ఉండేవారు. దీంతో లబ్ధిదారులు ఒక్కోసారి సరకులు పొందలేకపోయేవారు.

ఐరిస్‌తో  సులభతరం..

ఈ పరిస్థితిని అధిగమించేందుకు కనుపాపల నమోదు పరికరాలను ఎండీయూ వాహనాల్లో ఉండే ఈ-పోస్‌ యంత్రాలకు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీటి ద్వారా బుధవారం నుంచే నిత్యావసరాల పంపిణీ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రతి ఎండీయూ ఆపరేటర్‌కు వీటిని అందించారు. దీంతో వారి పరిధిలో వేలిముద్రలు పడక ఇబ్బందిపడుతున్న వారికి ఐరిస్‌ పరికరం ద్వారా వివరాలు నమోదు చేసి రేషన్‌ సరకులు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విధానం అమలు చేయడంతో వేలిముద్రలు అరిగిపోయిన వారికి సాంత్వన చేకూరనుంది.

గతంలో  ప్రారంభించినా..

ఐరిస్‌ నమోదు ద్వారా నిత్యావసరాలు ఇవ్వడమనేది పాత విధానమే. గతంలో చౌక దుకాణాల్లో వేలిముద్రలు పడనివారికి దీని ద్వారానే రేషన్‌ సరఫరా చేసేవారు. ప్రజా సాధికార సర్వే సమయంలో గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే చేయడంకోసం మున్సిపల్‌, ఇరత శాఖల సిబ్బంది వీటిని వినియోగించారు. వీటిలో ఎక్కువ శాతం పరికరాలు పాడయ్యాయి. మరికొన్ని కనిపించకుండా పోయాయి.

వృద్ధుల  యాతన..

వయోభారంతో ఇబ్బందిపడుతున్న వృద్ధుల చేతి వేళ్లు వంకర్లుపోవడం, రేఖలు అరిగిపోయి ముద్ర నూరుశాతం పడకపోవడంతో ఈ-పోస్‌ యంత్రాలు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వారికి ఎండీయూ ఆపరేటర్లు సరకులు ఇవ్వలేమని చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రస్తుతం కొత్త ఐరిస్‌ పరికరాలను ఎండీయూ ఆపరేటర్లకు ఆందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరం ఉన్న ఐరిస్‌ పరికరాలను విజన్‌టెక్‌ సంస్థ ప్రభుత్వానికి సమకూర్చింది. ఒక్కొక్కటి రూ.7 వేల విలువచేసే వీటిని ఎండీయూ ఆపరేటర్లకు ఉచితంగానే అందిస్తున్నారు.

వాలంటీర్లపై  ఆధారపడకుండా..

వేలిముద్రలు పడని లబ్ధిదారులందరికీ ఇప్పటివరకు వారి పరిధిలోని వాలంటీర్ల బయోమెట్రిక్‌ ద్వారా రేషన్‌ సరకులు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కోసారి వీరు అందుబాటులో లేకపోవడంతో వృద్థులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందడం లేదు. ఒక్కో నెల పూర్తిగా సరకులకు దూరమవుతున్నారు. దీనిపై పౌరసరఫరాల అధికారులు, స్థానిక రెవెన్యూ, కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఐరిస్‌ పరికరాల ద్వారా రేషన్‌ సరకులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

సిబ్బందికి శిక్షణ పూర్తి

ఐరిస్‌ పరికరాల వినియోగంపై విజన్‌టెక్‌ సిబ్బంది మూడు రోజులుగా డివిజన్లవారీగా శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. ఐరిస్‌ వినియోగంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు మండలానికి ఒక కోఆర్డినేటర్‌ను విజన్‌టెక్‌ సంస్థ నియమించింది.

ప్రతినెలా వెయ్యికిపైగా ఫిర్యాదులు

బయోమెట్రిక్‌ విధానం ద్వారా ప్రతి నెలా రేషన్‌ సరకుల పంపిణీలో వెయ్యికిపైగా ఫిర్యాదులు అందేవని అధికారులు తెలిపారు. ఇకపై ఆ అవసరం ఉండదని పౌరసరఫరాల అధికారులు అంటున్నారు. ఐరిస్‌ పరికరాల వినియోగం ద్వారా కుష్ఠు వ్యాధిగ్రస్థులు, రజక వృత్తి చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితరులకూ ఉపశమనం కలగనుంది.

సులభంగా రేషన్‌ పంపిణీ

ఐరిస్‌ పరికరాల వినియోగంతో వేలిముద్రలు పడనివారికి కూడా ఇకపై సులభంగా రేషన్‌ సరకులు పంపిణీ చేసే వీలు కలగనుంది. జిల్లావ్యాప్తంగా 5,39,150 కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేయాల్సిన 355 మంది ఎండీయూ ఆపరేటర్లకు వీటిని అందజేశాం. వారికి శిక్షణ కూడా పూర్తి చేశాం. ఈ నెల నుంచి జిల్లాలో వీటి ద్వారా వృద్ధులు, వేలిముద్రలు పడని వెయ్యినుంచి 1100 మందికి రేషన్‌ సరకులు సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.

పాపారావు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని