logo

ఆరోగ్యదారుల్లో ఆనంద సవారీ

ఉరుకులు పరుగుల జీవితంలో జీవన శైలి యాంత్రికంగా మారింది. కాలంతో పోటీపడే క్రమంలో మానసిక ఒత్తిళ్లు, శారీరక రుగ్మతలు వెంటాడుతున్నాయి.

Published : 03 Jun 2023 04:23 IST

ప్రపంచ సైకిల్‌ దినోత్సవం నేడు
ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, కంబాలచెరువు

ఉరుకులు పరుగుల జీవితంలో జీవన శైలి యాంత్రికంగా మారింది. కాలంతో పోటీపడే క్రమంలో మానసిక ఒత్తిళ్లు, శారీరక రుగ్మతలు వెంటాడుతున్నాయి. నడక, పరుగు, యోగా, ధ్యానం వంటివి తప్పనిసరైన నేటి పరిస్థితుల్లో.. వీటికి ప్రత్యామ్నాయంగా కొందరు పిల్లలు, యువత, పెద్దలు సైకిలింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం సైకిల్‌ సవారీతో ఆరోగ్యం పొందడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

గర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ సాధారణమైంది. ఎక్కడికక్కడ శబ్ద, వాయు కాలుష్యం విసిగిస్తోంది. ఇంధన ఖర్చులు అమాంతం పెరగడం వాహన చోదకులకు భారంగా మారింది. పరిమిత దూరానికి వెళ్లాలంటే సైకిలే మేలనే భావన పలువురిలో కలుగుతోంది. కాలుష్య రహిత సైకిళ్లతో పర్యావరణ హితమని భావిస్తున్న మరికొందరు ప్రత్యేక సంఘాలుగా ఏర్పడి సైకిల్‌ వినియోగంపై ఇతరులనూ చైతన్యపరుస్తున్నారు.

పునర్వైభవం

సైకిల్‌కు పునర్వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో వీటి వినియోగం పెరిగింది. మూడు జిల్లాలో 300 వరకు విక్రయశాలలున్నాయి. మూడేళ్ల పిల్లల నుంచి.. పెద్దల వరకు వివిధ ఆకృతులు, ఆకట్టుకునే రంగులతో సైకిళ్లు మార్కెట్‌ మెట్లెక్కుతున్నాయి. కొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తుంటే.. అధిక శాతం దుకాణాల్లో కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. డబుల్‌ డిస్క్‌, డిస్క్‌ బ్రేక్‌, ఎలైన్‌ రిమ్‌లు, నైలాన్‌ టైర్లు, ఎలక్ట్రానిక్‌, బ్యాటరీ ఇలా కొత్త హంగులతో ఇవి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ రోడ్డెక్కుతున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలలో కొందరు సైకిలింగ్‌ ప్రియులు రూ.60 వేలు నుంచి రూ.3 లక్షల విలువైన సైకిళ్లను సైతం వినియోగిస్తున్నారు.

రైడర్స్‌ జోష్‌..

రాజమహేంద్రవరం నగరంలోని స్ట్రామ్‌ రైడర్స్‌ బృందం సైక్లింగ్‌ ప్రయోజనాలను వివరిస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నగరానికి చెందిన పలువురు వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు తదితర 90 మంది సభ్యులు స్ట్రామ్‌ రైడర్స్‌ బృందంగా ఏర్పడి సైక్లింగ్‌ చేస్తున్నారు. మూడేళ్ల కిందట నుంచి అంతా కలిసి రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేయడం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం చేస్తూ ఆదివారం, సెలవు సమయాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల మేర వెళ్లి సైక్లింగ్‌ వల్ల కలిగే ఆరోగ్య మేలును వివరిస్తున్నారు. ఊబకాయం, మహిళల్లో పీసీవోడీ తదితర ఇబ్బందులను సైక్లింగ్‌తో ఏవిధంగా నియంత్రణలోకి వస్తాయో వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సైకిల్‌ యాత్ర చేపట్టి అందరికీ ఆరోగ్య అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేస్తున్నామని బృంద సభ్యురాలు డాక్టర్‌ తంగెళ్ల పద్మజ పేర్కొన్నారు.


ఆకర్షణీయ నగరిలో సై..

కాకినాడ నగర పాలక సంస్థ, కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నగరంలో సైకిలింగ్‌కు ఊతమిచ్చే చర్యలు చేపట్టింది. నగరంలోని వివేకానంద పార్కు-వాటర్‌ వర్క్స్‌-మూడు లాంతర్ల కూడలి- దేవాదాయ శాఖ కార్యాలయం వరకు రూ.1.10 కోట్లతో సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. రూ.40 లక్షలు-రూ.50 లక్షలు చొప్పున వెచ్చించి నాగమల్లితోట కూడలి నుంచి కలెక్టర్‌ బంగ్లా వైపు.. నాగమల్లి తోట నుంచి రవాణాశాఖ కార్యాలయాల వైపు సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు.


విక్రయాలు పెరిగాయి

- వి.సి.హెచ్‌.అన్నపురాజు, అన్నపూర్ణ సైకిల్‌ స్టోర్స్‌, కాకినాడ

అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో గతంతో పోలిస్తే సైకిల్‌ అమ్మకాలు పెరిగాయి. రెండేళ్ల క్రితం నిల్వల కోసం నిరీక్షించే పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ధరలు కూడా తగ్గాయి. ఆయిల్‌ ఖర్చులేదు. కాలుష్యం ఉండదు.


నిత్యం 50 కిలోమీటర్ల ప్రయాణం

- వై.ప్రకాశరావు, కార్యదర్శి, గోదావరి సైకిలింగ్‌ క్లబ్‌, కాకినాడ

రోజూ ఉదయాన్నే ఆహ్లాదకర వాతావరణంలో సైకిల్‌ తొక్కడం వల్ల మనసు ప్రశాంతంగా, రోజంతా ఉత్సాహంగా ఉంటోంది. ఈ వ్యాయామం వల్ల రక్తపోటు, చక్కెర వ్యాధి, ఊబకాయం లాంటివి దగ్గరకు రావు. అయిదేళ్ల క్రితం గోదావరి సైకిలింగ్‌ క్లబ్‌ ఏర్పాటుచేశాం. రోజూ 100 మందికిపైగా సైకిళ్లపై కనీసం 50 కి.మీ దూరం వెళ్తుంటాం. సైకిల్‌ తొక్కితే ఆరోగ్యం బాగుంటుందని అవగాహన కల్పించడమే కాకుండా.. క్లబ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని