logo

కార్తికేయ..ఇదేం మాయ?

అమాయకుల ఆశే వారికి పెట్టుబడి... ఆకర్షణీయ ప్రచారాలతో వల వేసి, అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టడం కొన్ని సంస్థలకు సాధారణమైంది.

Updated : 04 Jul 2023 06:32 IST

పొదుపరులను నమ్మించి రూ.21.58 కోట్లు మింగేసిన వైనం
సొసైటీ అక్రమాలపై 51 విచారణ పూర్తి

అమాయకుల ఆశే వారికి పెట్టుబడి... ఆకర్షణీయ ప్రచారాలతో వల వేసి, అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టడం కొన్ని సంస్థలకు సాధారణమైంది. నట్టేట ముంచేస్తూ ఆనక బోర్డు తిప్పేస్తున్నారు. ఆ మధ్య రూ.450 కోట్లు జయలక్ష్మి పాలక వర్గం మింగేస్తే.. అదే దారిలో కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ది కార్తికేయ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌’ నడిచింది.. దాచుకున్న సొమ్ముకు వడ్డీలు కలిస్తే కుటుంబాలకు ఉపయోగపడతాయని ఎదురుచూస్తున్నవారు మోసాలకు గురై రోడ్డున పడ్డారు. అక్రమార్కులు రాజకీయ దన్నుతో చర్యల నుంచి తప్పించుకునే వ్యూహాల్లో నిమగ్నమవుతుంటే.. ఇంత నిగ్గుతేలినా విచారణల పేరుతో కాలయాపనే తప్ప, మింగేసిన సొమ్ము రాబట్టి.. బాధితులకు అప్పగించే చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బాధ్యులుగా పేర్కొని..

ది కార్తికేయ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌లో రూ.21.58 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు సహకార శాఖ సెక్షన్‌ 51 విచారణలో తేల్చింది. సొసైటీ అప్పటి అధ్యక్షుడు కె.వి.వి.సత్యనారాయణ,  డైరెక్టర్లు కె.పద్మావతి (అధ్యక్షుడి భార్య), కె.వెంకటేష్‌, కె.శంకర్‌ (అధ్యక్షుడి కుమారులు)తోపాటు.. సీహెచ్‌ గంగరాజు, బి.విజయకుమార్‌, జి.వీరేంద్ర, టి.టి.పుష్పరాజ్యం, అంజుమ్‌ సల్తానా, డి.సింహాద్రిరావు, ఐ.పార్వతి, ఎం.సాంబశివరావు, మేనేజర్‌ ఎం.ఎ.హుస్సేన్‌లను అక్రమాలకు బాధ్యులుగా పేర్కొన్నారు. కార్తికేయ సొసైటీ పాలకవర్గం తప్పులను కె.కనకమహాలక్ష్మి ప్రోత్సహించినట్లు తేల్చారు.

క్రిమినల్‌ కేసు నమోదు..

దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఏపీసీఎస్‌ చట్టం- 1964 సెక్షన్‌ 60 (1) ప్రకారం సర్‌ఛార్జి విచారణ చేపట్టాలని.. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్‌ చేయాలని నిర్ణయించారు. బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. విచారణ అధికారి సీజ్‌ చేసిన దస్త్రాల జాబితాను అందించారు. దీనిపై పోలీసులు 158/2023.. సెక్షన్‌ 120బి, 420, 406, 408, 109 ఐపీసీ కింద కేసు నమోదుచేశారు.

కాకినాడ కేంద్రంగా 2003లో ఏర్పాటైన కార్తికేయ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఉమ్మడి జిల్లాలో వందల మంది నుంచి గృహ రుణాల కోసం డిపాజిట్ల సేకరణ, గృహావసర రుణాల మంజూరు కార్యకలాపాలు సాగిస్తోంది. కొవిడ్‌ ముందు వరకు సొసైటీ కార్యకలాపాలు సాఫీగా సాగినా.. తర్వాత పరిస్థితి పట్టాలు తప్పింది. డిపాజిట్ల కాలపరిమితి ముగిసినా సొమ్ము చెల్లించని కేసులు బయటకు వచ్చాయి. సహకార శాఖ అధికారులకు విచారణలో సహకరించకపోవడం.. నగదు చిట్టా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లెడ్జర్‌, లోన్‌ లెడ్జర్‌, మినిట్స్‌ బుక్‌ తదితరమైనవి ఇవ్వకపోవడం.. డిపాజిటర్ల సొమ్ముకు భరోసా ఇవ్వకపోవడంతో వ్యవహారం జఠిలమైంది. రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్‌/ రిజిస్ట్రార్‌ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశాలతో జిల్లా సహకార శాఖ అధికారి బి.కె.దుర్గాప్రసాద్‌ కార్తికేయ సొసైటీ వ్యవహారంపై సెక్షన్‌ 51 విచారణ ద్వారా అక్రమాల నిగ్గుతేల్చారు.

నాడు ఆస్తుల అటాచ్‌.. ఇప్పుడు కేసులు..

కాకినాడలోని కార్తికేయ సొసైటీ భవనంతోపాటు.. కీలకమైన ఆస్తులు గతంలోనే అటాచ్‌ చేశారు. సూర్యారావుపేటలోని 132.5 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు ఫ్లోర్ల సొసైటీ భవనం.. ప్రతాప్‌నగర్‌లోని 250 చదరపు గజాల భవనం.. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడిలోని 1,419 చ.గ ఖాళీ స్థలాన్ని అటాచ్‌మెంట్‌లో చూపించారు. వీటి క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పొందుపరచాలని రిజిస్ట్రేషన్‌ శాఖకు సర్వే నంబర్లు, హద్దులతో సహా వివరాలందించారు. తాజాగా క్రిమినల్‌ చర్యలకు విచారణ అధికారి సిఫార్సు చేయడంతో.. సొసైటీ అక్రమాలపై జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్‌ పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ రెండో పట్టణ సీఐ నాగేశ్వర్‌నాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయలక్ష్మి సొసైటీ కుంభకోణం తరహాలోనే ఈ కేసునూ సీఐడీకి అప్పగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.


బాధ్యుల నుంచి రికవరీకి చర్యలు

కార్తికేయ సొసైటీలో అక్రమాలపై సెక్షన్‌ 51 విచారణ పూర్తయింది. సొసైటీలో అక్రమాలు జరిగినప్పటి ఛైర్మన్‌, డైరెక్టర్లు, మేనేజర్‌, అకౌంటెంట్‌పై విచారణ జరిపి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. రికవరీ కోసం సర్‌ఛార్జి నోటీసులు ఇచ్చాం. ఈనెల 12న ప్రక్రియ మొదలవుతుంది.
దుర్గాప్రసాద్‌, జిల్లా సహకార అధికారి, కాకినాడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు