logo

దిగొచ్చిన దేవదాయ శాఖ

పిఠాపురం పాదగయ క్షేత్రంలో పూజాధికాల రుసుముల పెంపుపై హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. భక్తులను దేవాలయానికి దూరం చేసే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం నిరసన తెలిపారు.

Published : 16 Apr 2024 03:50 IST

రుసుముల పెంపు ప్రతిపాదన ఉపసంహరణ

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం పాదగయ క్షేత్రంలో పూజాధికాల రుసుముల పెంపుపై హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. భక్తులను దేవాలయానికి దూరం చేసే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం నిరసన తెలిపారు. విశ్వ హిందూ పరిషత్తు, భజరంగ్‌ దళ్‌, బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, జనసేన, భాజపా నాయకులు ఈవో పులి నారాయణ మూర్తిని నిలదీశారు. పిండ ప్రదానాలు చేసుకునే ఈ ఆలయంలో సౌకర్యాలు మెరుగుపరచాలి తప్ప... భక్తులపై భారం మోపొద్దని ఆరోపించారు. పిండ ప్రదానాలు చేసుకునేందుకు సరైన స్థలం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రాక తగ్గిపోతే బ్రాహ్మణులు ఎలా బతకాలని నిలదీశారు. భక్తులు, అర్చకుల సలహాలు తీసుకోకుండా ధరల పెంపునకు ప్రతిపాదనలు కోరడంతోపాటు, అభ్యంతరాలు ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు.

సర్వత్రా నిరసనలతో... పాదగయ క్షేత్రంలో రుసుముల పెంపుపై ‘ఈనాడు’లో సోమవారం ‘మీకో దండం..ఎలా పిండ ప్రదానం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. మరోవైపు భక్తులు, హిందూ సంఘాలు కూడా వ్యతిరేకించడంతో ఈవో పులి నారాయణమూర్తి ధరల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2015 నుంచి ధరలు పెంచనందువల్ల, ఆదాయం పెరిగితే ఆలయం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు సూచన మేరకు ధరల పెంపునకు అభ్యంతరాలు కోరినట్లు పేర్కొన్నారు. ఏదేమైనా అందరూ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ‘ఈనాడు’ కథనంపై దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ కూడా ఆరా తీశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ ఈవోను నివేదిక కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని