logo

సిద్ధమైతేనే చెత్తశుద్ధా!

రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీల నుంచి అధికారులు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందిని, చెత్త తరలింపు వాహనాలను కాతేరు గ్రామానికి తరలించారు.

Updated : 16 Apr 2024 05:29 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం: రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీల నుంచి అధికారులు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందిని, చెత్త తరలింపు వాహనాలను కాతేరు గ్రామానికి తరలించారు. గామన్‌ వంతెన వద్ద నుంచి మల్లయ్యపేట వరకు ప్రధాన రహదారి వెంబడి పేరుకుపోయిన చెత్త తరలించేందుకు చర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో జేసీబీలను తీసుకొచ్చారు. డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడిక, చెత్త తొలగించడంతో పాటు కూలీలను పెట్టి రహదారి ఇరువైపులా పెరిగిపోయిన పనికిరాని మొక్కలను తొలగిస్తుండటంతో పాటు రహదారులు ఎప్పటికప్పుడు తుడిచేస్తూ శుభ్రం చేస్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ఇన్నాళ్లు లేని పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు ఇప్పుడెందుకింత శ్రద్ధ అనుకుంటున్నారా.. ‘మేమంతా సిద్ధం’ సీఎం బస్సుయాత్ర ఈ నెల 18న గ్రామం మీదుగా సాగుతుందనే సమాచారంతో భారీగా పంచాయతీ నిధులు వెచ్చించి మరీ పారిశుద్ధ్య పనులు చేపట్టేస్తున్నారు. ప్రధాన రహదారిని రెండుపూటలా అద్ధంగా శుభ్రం చేసేస్తున్నారు. మరోపక్క మల్లయ్యపేట నుంచి నగర పరిధిలోని పేపరుమిల్లు మీదుగా ఉన్న ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిలో రోడ్డు డివైడర్‌ అభివృద్ధికి పనులను ఎంపీ శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా ముందుకు సాగని పనులను ఇప్పుడు చకచకా చేస్తున్నారు. డివైడర్‌కు టైల్‌ అతికించే పనులు హడావుడి చేపడుతుండటం గమనార్హం. ఇది చూసిన పలువురు సీఎం వస్తేనే పనులు చేస్తారా.. నిత్యం సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని