logo

రండి బాబూ రండి.. ఇళ్ల స్థలాలు చూపిస్తాం

Published : 16 Apr 2024 04:13 IST

ఓట్ల కోసం వైకాపా నేతల బరితెగింపు
అధికారుల రాకతో శిబిరం ఎత్తివేసి పలాయనం

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి వైకాపా నాయకులు ప్రజలను తెగ మభ్యపెడుతున్నారు. అయిదేళ్లుగా వారి అవస్థల వైపు కన్నెత్తి చూడనివారు ఇప్పుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఇళ్ల స్థలాలు చూపిస్తామంటూ లబ్ధిదారులను మాయ చేసేందుకు ప్రయత్నించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో సోమవారం ఈ ఘటన జరిగింది.

రావులపాలెం మండలం దేవరపల్లిలో గతంలో 58 ఎకరాలు సేకరించి జగనన్న లేఔట్‌ వేశారు. అప్పట్లో వివిధ గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల మందికి పట్టాలిచ్చి స్థలాలు చూపించారు. ఊబలంకకు చెందిన 400 మందికి పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదు. దీంతో వారి ఓట్లు రాబట్టుకునేందుకు పన్నాగం పన్నారు. కొత్తపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి అనుకూలంగా ఆ గ్రామ నాయకులు కోడ్‌తో పనేముందంటూ బరితెగించారు. ఇళ్ల స్థలాలు చూపిస్తామని, సోమవారం దేవరపల్లిలో లేఔట్‌ వద్దకు రావాలంటూ లబ్ధిదారులకు సమాచారం పంపి ఏర్పాట్లు చేశారు. విషయం అధికారులకు తెలిసింది. వారు చేరుకునేసరికి టెంట్లు, కుర్చీలను సర్దేసి నేతలు పలాయనం చిత్తగించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఈ సమావేశం గురించి తెలిసి స్థానిక అధికారులను అప్రమత్తం చేశామన్నారు. తామంతా అక్కడికి వెళ్లేసరికి వారు లేరని చెప్పారు. ఎన్నికల వేళ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని