logo

భక్తులను బెధరగొట్టారు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఆలయం ఒకటి. సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పేద, మధ్య తరగతి భక్తులకు ఆర్థిక భారం లేకుండా దర్శనభాగ్యం కల్పించాల్సింది పోయి వైకాపా సర్కారు హయాంలో ధరల దోపిడీతో బెదరగొట్టారు.

Updated : 16 Apr 2024 05:32 IST

వైకాపా ఏలుబడిలో ఎన్నెన్ని ఆర్థిక భారాలో
అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చినవారికి చుక్కలు

అన్నవరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఆలయం ఒకటి. సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పేద, మధ్య తరగతి భక్తులకు ఆర్థిక భారం లేకుండా దర్శనభాగ్యం కల్పించాల్సింది పోయి వైకాపా సర్కారు హయాంలో ధరల దోపిడీతో బెదరగొట్టారు. వసతి, దర్శనం, వ్రతం ఇలా ఏవైనా తీసుకోండి.. టికెట్టు ధరలు పెంచేశారు. సీఎం జగన్‌ ఏలుబడిలో తట్టుకోలేని విధంగా రుసుములు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

వసతి.. అయ్య బాబోయ్‌

సత్యగిరిపై నూతనంగా నిర్మించిన 138 గదుల శివసదన్‌ వసతి సముదాయంలో గదులకు భారీగా అద్దెలు నిర్ణయించారు. ఏసీ గది అద్దె రూ. 1,770 (అద్దె రూ.1,500, జీఎస్టీ రూ.270). సూట్‌ రూం అద్దె రూ.2,360 (అద్దె రూ.2వేలు, జీఎస్టీ 360). డబుల్‌ గది రూ.3,540 (అద్దె రూ.3 వేలు, జీఎస్టీ 540) చేశారు. పక్కనే ఉండే హరిహరసదన్‌ ఏసీ గది అద్దె రూ.950 కాగా, శివసదన్‌ అద్దె రూ.1,770 ఉంది. ఏ సముదాయంలోనూ గదులు అందుబాటులో లేకపోతే సామాన్య భక్తులు తప్పని పరిస్థితుల్లో శివ
సదన్‌లో తీసుకోవాల్సి వస్తోంది.

వ్రత టిక్కెట్‌.. భరించలేం

అన్నవరం దేవస్థానంలో రూ. 800 వ్రత టికెట్‌ను రూ.1000కి పెంచి గత ఏడాది నవంబరు నుంచి అమలు చేశారు. ఇక్కడ రూ.300, రూ. 800, రూ.1,500, రూ.2 వేల ధరతో వ్రతాలు నిర్వహిస్తారు. అయితే రూ.800 నుంచి రూ.1000కి పెంచడం వల్ల సామాన్య భక్తులకు భారమవుతోంది. రూ. 300, రూ.100 టికెట్ల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. రద్దీ రోజుల్లో రూ.300 వ్రత మండపాలు సరిపోవడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సామాన్య భక్తులు రూ.వెయ్యి టికెట్టు తీసుకోవాల్సి వస్తోంది.

నీటి సీసా రూ.40

దేవస్థానంలో గత ఏడాది ఆగస్టు నుంచి ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేశారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ స్థానంలో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాల్లో మాత్రమే నీటిని కొండపై దుకాణాల్లో విక్రయించేలా చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్‌లానే ఉండే నాన్‌ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ (ఒక లీటర్‌) ధర రూ. 40 కావడంతో భక్తులు ఈసురోమంటున్నారు.

ప్రదక్షిణ దర్శనం రూ.300

స్వామి శీఘ్రదర్శనం టికెట్‌ను ప్రదక్షిణ దర్శనంగా మార్పు చేసి రూ.300 చేశారు. గతంలో రూ.200 ఉండేది. కొండపై వివాహాలు చేసుకునేవారు ఖాళీ ప్రదేశంలో భోజనాలు తయారు చేసుకుంటే (వంట) రూ. 18 వేలు రుసుము వసూలు చేస్తున్నారు. బస్సుల్లో వచ్చే యాత్రికులు కొండ దిగువన కళాశాల మైదానంలో వాహనాలు పార్కింగ్‌ చేస్తుంటారు. భోజనాలు కూడా అక్కడే సిద్ధం చేసుకుంటారు. దీనికి పారిశుద్ధ్య నిర్వహణ కింద ఆరుచక్రాల వాహనాల నుంచి రూ.100, నాలుగు చక్రాల వాహనాల వద్ద రూ.50 వసూలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని