logo

సర్కారు జాగా.. ప్రైవేటు పాగా..!

ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది.

Updated : 30 Apr 2024 07:04 IST

ఈదరపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ స్థలంలో ఇసుక గుట్టలు

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది. ఈ గ్రామంలోని సచివాలయం-2 ఎదురుగా సుమారు ఎకరా స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలం ప్రైవేటు వ్యక్తుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఇక్కడ ఇసుక, ఇటుక వ్యాపారాలకు కేంద్రంగా మారిపోయింది. ఈ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. దీంతో రూ.కోట్ల విలువచేసే స్థలం అన్యాక్రాంతమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

శాఖల మధ్య సమన్వయం లేకనే..

గ్రామ పంచాయతీ, మత్స్య, రెవెన్యూశాఖల అధికారుల మధ్య సమన్వయలోపం ఉండటంతో ఈదరపల్లి సచివాలయం-2 పరిధిలోని స్థలం ప్రైవేటు వ్యాపారాలకు కేంద్రంగా మారింది. సచివాలయం ఎదురుగా ఈ వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం, దానికితోడు కూతవేటు దూరంలో ఉండే మత్స్యశాఖ అధికారులు ఆ స్థలం మాది కాదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు పెత్తనం సాగుతోంది.

మంత్రివర్యా.. శంకుస్థాపనతో సరి..!

ఈదరపల్లి సచివాలయం-2 ఎదురుగా ఉండే స్థలంలో కొంతభాగం మత్స్యశాఖకు చెందినదే. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన చేపల పెంపకం తొట్టెలుకూడా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దీంతో ఆ స్థలంలోనే 2020లో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆక్వా రైతుల శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత దాని ధ్యాసే మరిచారు. ప్రస్తుతం ఆ శిక్షణ కేంద్రానికి సంబంధించి శిలాఫలకం మాత్రం ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. శిక్షణ కేంద్రం మాత్రం వేరే ప్రాంతంలో నిర్మించినా పరిస్థితి కనిపిస్తోంది. ఏదిఏమైనా రూ.కోట్లు విలువచేసే స్థలాన్ని పరిరక్షించాల్సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి స్థలాన్ని ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపాల్సిఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని