logo

పవన్‌ రోడ్‌షో.. 6 గంటలు.. 40 కి.మీ.

భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి..

Updated : 30 Apr 2024 07:51 IST

 పోటెత్తిన జనం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పిఠాపురం: భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. పిల్లలు, యువత, పెద్దలు, మహిళలు అంతా రోడ్లపైకి రావడంతో అభిమానం పోటెత్తి.. దారులు జన జాతరను తలపించాయి.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. మీ బిడ్డను, ఇంట్లో ఒకణ్ని..మీ అన్నను ఆశీర్వదించండి.. అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించండని కోరుతూ ముందుకు సాగారు.

చెందుర్తి వద్ద జాతీయ రహదారిపై పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు, అభిమానులు

అదే ఉత్సాహం..

గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌కల్యాణ్‌ నివాసం నుంచి ప్రారంభమైన రోడ్‌షో కత్తిపూడి మీదుగా చెందుర్తి, తాటిపర్తి- కొడవలి కూడలి.. ప్రత్తిపాడు మండలం ధర్మవరం మీదుగా పిఠాపురం మండలంలోని పి.దొంతమూరు, వెల్దుర్తి, పి.తిమ్మాపురం, బి.కొత్తూరు, జగపతిరాజపురం, గోకివాడ, జమ్ములపల్లి, నరసింగపురం, లక్ష్మీనర్సాపురం, విరవాడ, విరవ, మల్లాం, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కందరాడ, కుమారపురం, జగ్గయ్యచెరువు వరకు సాగింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.20 వరకు ఆరు గంటలపాటు 40 కి.మీ పైగా ర్యాలీ సాగింది. మహిళలు హారతులిస్తూ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

వెల్దుర్తి, దొంతమూరు కూడలిలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌

మీ సమస్యకు పరిష్కారమవుతా..

‘జనసేన, తెదేపా, భాజపా విజయం కోసం.. ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితి.. అందుకే నియోజకవర్గంలో తిరగడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా’నని పవన్‌ తెలిపారు. గెలిచాక నేను ఎక్కడికో వెళ్లిపోను. మీ మధ్యనే ఉంటా.. మీ సమస్యలకు పరిష్కారమవుతానని తెలిపారు. పోలవరం పూర్తయ్యేవరకు ఆగకుండా.. స్థానికంగా ఉన్న చిన్న సాగునీటి వనరులను పునరుద్ధరించి రైతుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఏలేరు ఆధునికీకరణపై దృష్టిసారిస్తామన్నారు.
కొడవలి కొండపై తవ్వకాలు అడ్డుకుంటామని, అధ్వాన రహదారుల రూపు మారుస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని