logo

అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా

ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి.

Updated : 01 May 2024 06:43 IST

  మండే ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పించడమా?
  పింఛన్ల అందజేతలో జగన్‌ కుట్రలపై ఆగ్రహం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, ప్రత్తిపాడు, గోపాలపురం, ముమ్మిడివరం : ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. అభాగ్యులను
సమిధలుగా మార్చి ఓట్ల వేటకు తెరలేపింది. ఒకటో తేదీన ఇంటికొచ్చి ఇవ్వాల్సిన పింఛను సొమ్ము అందజేతలో వీలైనంత ఎక్కువ జాప్యం చేసి.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా అన్ని కేటగిరీల వారినీ మండుటెండల్లో కి.మీ కొద్దీ తిప్పి.. ఆపసోపాలకు గురిచేసి.. ఆ తప్పు ప్రతిపక్షాలపై నెట్టేయాలన్న వ్యూహాన్ని అమలుచేస్తోంది. గత నెలలో అందరినీ సచివాలయాలకు రప్పించి.. పలువురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన జగన్‌ సర్కారు... ఈసారి బ్యాంకు ఖాతాల్లోకి పింఛను సొమ్ము జమచేస్తామని ప్రకటించింది..దీనిని అన్ని వర్గాలూ తప్పుపడుతున్నా వైకాపా పెద్దలకు చీమకుట్టినట్లయినా లేదు.

ఈ ప్రశ్నలకు సమాధానమేదీ?

  •  పెరుగుతున్న నిత్యావసరాలు, మందుల ఖర్చులకు పింఛను సొమ్ముతో బతుకీడ్చడం కష్టంగా మారింది. ఆటోలు, బస్సు ఛార్జీలు పెట్టుకుని ఎండలో కి.మీ కొద్దీ వెళ్లి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.. ఏమిటిలా?
  • బ్యాంకు ఖాతాలన్నీ నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)తో ఆధార్‌ అనుసంధానం (లింక్‌) తప్పనిసరి. ఒకరికి ఒకటికి మించి ఖాతాలుంటే.. ఏ బ్యాంకు ఖాతాతో తాజాగా అప్‌డేట్‌ అయ్యిందో అక్కడే లింక్‌ అవుతుంది. ఆ బ్యాంకు ఖాతాలోకే పింఛను సొమ్ము జమ అవుతుంది. అవగాహన లేకపోతే నగదు పడిన బ్యాంకు వెతుకోవాల్సిందే.
  • పింఛనుదారు ఆపసోపాలు పడి బ్యాంకుకు వెళ్లినా.. ఖాతా యాక్టివ్‌గా లేకపోతే కేవైసీ చేయాలి. దానికి ఆధార్‌ కార్డుతోపాటు.. రేషన్‌కార్డు/ డ్రైవింగ్‌ లైసెన్సు/ గ్యాస్‌ కనెక్షన్‌ ఇతరత్రా ఏదైనా గుర్తింపు ధ్రువీకరణ సమర్పించాలి. వేలిముద్రలు సేకరించి.. రీజనల్‌, జోనల్‌ కార్యాలయంలోని అధీకృత అధికారి అనుమతికోసం మెయిల్‌ చేయాలి. వారి అనుమతి వచ్చిన తర్వాత.. ఖాతా జీవం పోసుకోవడానికి కనీసం 24 గంటల సమయం పడుతుంది. అంటే మరోసారి బ్యాంకుకు రావాలి.
  •  ఖాతాలో కనీస నిల్వలేకపోయినా.. ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీల పేరుతో కోతపడి నిల్వ మైనస్‌లోకి వెళ్లిపోయినా.. తాజా పింఛన్ల డబ్బులో కోతపెట్టేస్తారు. మిగిలిన సొమ్ము అందివ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వ- బ్యాంకర్స్‌ కమిటీ కోత లేకుండా పింఛను సొమ్ము ఇచ్చేయాలని ఆదేశించిందని చెబుతున్నా.. ఇది ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధమని..సాధ్యపడదని వినిపిస్తోంది.
  •  వడగాడ్పులు, ఎండ తీవ్రతకు ఉదయం 10 తర్వాత బయటకు రావద్దని ఓవైపు ప్రభుత్వమే హెచ్చరికలు జారీచేస్తోంది. అలాంటప్పుడు వృద్ధులను ఆ సమయంలో బయటకు రప్పించే పరిస్థితులు సృష్టించడంలో ఆంతర్యమేమిటి?
  •  ఏ బ్యాంకులోనైనా సాధారణ ఖాతాదారులే నగదు తీసుకోడానికి కాసేపు లైనులో నిలబడాలి. మరి లబ్ధిదారులు బారులు తీరితే ఎన్ని ఇబ్బందులో ఊహించుకోవచ్చు.
  •  ఉమ్మడి జిల్లాలో ఉన్న 7.68 లక్షల మంది పింఛనుదారుల్లో.. తాజా నిర్ణయం ప్రకారం ఇంటివద్ద అందుకునేవారు కేవలం 1.94 లక్షల మంది మాత్రమే.. మిగిలినవారంతా బ్యాంకులను ఆశ్రయించక తప్పదు. ఏటీఎం కార్డులు ఉండి నగదు తీసుకునే అవగాహన, సౌకర్యం ఉంటే సరే.. లేదంటే గంటల తరబడి నిరీక్షిణే.

 

బస్సు సౌకర్యం లేదు.. వెళ్లేదెలా..?

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సగ్గొండ పంచాయతీ పరిధిలోని గోపవరంలో 379 మంది పింఛనుదారులు ఉన్నారు. వీటిలో ఇంటికి నేరుగా చేరవేసే పింఛన్లు 91 వరకు ఉంటే.. మిగిలినవారంతా బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలి. గోపవరం నుంచి జొన్నపూడిలోని బ్యాంకుకు వెళ్లాలంటే 8 కి.మీ దూరం.. ఇక్కడ్నుంచి బస్సు సౌకర్యం ఉదయం, సాయంత్రం వేళల్లోనే. ఆటోకు వెళ్లాలంటే రూ.40 చొప్పున చెల్లించాలి. అదే చిట్యాలలోని బ్యాంకుకు వెళ్లాలంటే 7 కి.మీ దూరం.. ఇక్కడికి బస్సు లేదు. ఆటో రానుపోను రూ.60 వెచ్చించాలి. నిరీక్షించి, బ్యాంకుకు చేరేసరికి గంట పడుతుంది. అక్కడికి వెళ్లి పింఛను తీసుకోవాలంటే మధ్యాహ్నం దాటిపోతుంది. అయినా ఇస్తారో లేదో అనుమానమే.

జగనూ.. నీ ఎత్తుగడ తెలిసింది..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 1,647 ఉన్నాయి. 7.68 లక్షల మందికి రూ.226.54 కోట్ల నగదు పంపిణీచేయాలి. ఇన్నాళ్లూ.. ‘ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందిస్తున్నా’మని ఊదరగొట్టిన సీఎం జగన్‌ ఇప్పుడు చేతులెత్తేయడం అనుమానాలకు తావిస్తోంది. సచివాలయాల సిబ్బందితో ఒక్కరోజులో ఇంటివద్దకే పింఛన్లు ఇచ్చేయవచ్చు. కానీ ఎండలో ఇబ్బందిపెట్టాలని, సొమ్మసిల్లి పడినా, ప్రాణాలు వదిలినా ప్రతిపక్షాల వల్లేనని విష ప్రచారం చేసేందుకు పన్నాగం పన్నారు. అధికారపక్షం ఎత్తుగడ అర్థంకావడంతో ఇదేం ప్రభుత్వమంటూ ఇప్పుడు జనం ఆగ్రహిస్తున్నారు.

బ్యాంకులు లేని గ్రామాలే అధికం

అల్లవరం: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖలు 51, యూబీఐ శాఖలు 53 వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛను దారుల్లో అధిక శాతం మందికి ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి ఒక్కో శాఖా కార్యాలయం పరిధిలో రెండు సర్వీస్‌ సెంటర్లు మాత్రమే ఇచ్చారు. ఈలెక్కన ఒక మండలానికి రెండు బ్రాంచిలు, 4 సర్వీస్‌ కేంద్రాలు ఉన్నాయి. కాని ప్రతీ మండలం పరిధిలో సరాసరి 10వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ఒక్కో శాఖ పరిధిలో 2వేల మందికి పింఛను అందించాలి. రోజుకు కనీసం వందమందికి నగదు ఇచ్చే వెసులుబాటు ఉంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల మే నెల అంతా లబ్ధిదారులకు కష్టాలే.


మిర్తిపాడు వెళ్లి తెచ్చుకోవాలి

సీతానగరం: ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లమనడం సరికాదు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్తిపాడుకు వెళ్లి బ్యాంకులో డబ్బులు తెచ్చుకోవాలి. రూ.100లు ఖర్చుతో పాటు రోజువారీ కూటి పనులకు వెళ్తే వచ్చే డబ్బులు పోతున్నాయి. ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఉద్యోగులతో ఇంటికే సొమ్ము అందించాలి.

 గొర్రెల చంద్రమ్మ, సుబ్బారావుపేట


రానూపోనూ 14 కి.మీ..

రాజానగరం: మా గ్రామం నామవరంలో బ్యాంకు లేదు. పింఛన్‌ సొమ్ము ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు హుకుంపేట వెళ్లాలి. రానూపోనూ 14 కి.మీ. ప్రయాణించాలి. ఓ వైపు నిప్పులు చెరుగుతున్నాయి. సర్వీసు ఆటోలుండవు. ప్రత్యేకించి బ్యాంకుకు ఆటో కట్టించుకుంటే రూ.200 తీసుకుంటారు. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం తగదు.

 బాలిన సుబ్బాయమ్మ, నామవరం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని