logo

వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

Published : 04 May 2024 05:06 IST

6న ప్రధాని మోదీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు

దేవీచౌక్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కార్యక్రమ బాధ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ, సమన్వయకర్త కాశీవిశ్వనాథరాజు వెల్లడించారు. ‘విజయ శంఖారావం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల మంది జనం హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని సోమవారం మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారని, అక్కడి నుంచి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని 4.30 గంటలకు అనకాపల్లి వెళ్తారన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఆరు ఎంపీ సీట్లు వస్తాయని, కూటమి 135 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈ అయిదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇటీవల ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న కార్యక్రమ సమన్వయకర్త కాశీ విశ్వనాథరాజు, నేతలు దత్తు, లక్ష్మీనారాయణ తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని