logo

వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు

వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్‌ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు.

Updated : 04 May 2024 06:12 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు

వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్‌ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్వహణ పట్టించుకోక ఖర్చు పెరుగుతుందే తప్ప  వెలుగులు కనిపించడం లేదు.  గుత్తేదారు సంస్థ గడువు తీరిపోవడంతో ఆ భారం పురపాలికలపై పడుతోంది.

గతంలో ఇలా..

వీధి దీపాల నిర్వహణకు ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) సంస్థతో ఏడేళ్ల పాటు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేవలం విద్యుత్తు వినియోగం 40 శాతం ఆదా చేయవచ్చనే విధానంలో ఎల్‌ఈడీ బల్బులకు అవకాశం కల్పించారు. వీధి దీపాల నిర్వహణ మొత్తం సంబంధిత సంస్థ చేపట్టాలి.  విద్యుత్తు దీపాల నిర్వహణ, పాడైన స్థానంలో కొత్తవి మార్చడం, సిబ్బంది నియామకం అన్నీ కంపెనీ భరించాల్సి ఉంటుంది. అందుకు గాను పురపాలికలు ప్రతినెలా ఒప్పందం ప్రకారం ధనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం ఈఈఎస్‌ఎల్‌ సంస్థ నిర్వహించగా.. మరికొన్ని దీపాల నిర్వహణ పురపాలికల ఆధీనంలోనే ఉండేది. పురపాలికల్లో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.

కారుచీకట్లు కమ్ముకున్న నిడదవోలు బస్టాండ్‌ నుంచి గాంధీనగర్‌కు వెళ్లు రహదారి

ప్రస్తుత పరిస్థితి..

ఒప్పందం పూర్తికావడంతో పురపాలికల్లోని వీధి దీపాల విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పైగా ఎల్‌ఈడీ దీపాల మరమ్మతు అనేది సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. దీంతో సాధారణ ఎలక్ట్రీషియన్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. ఆ స్థాయిలో నిపుణులైన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

ఒప్పందం ముగిసి..

సుమారు రెండు, మూడేళ్ల పాటు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. ఆ తర్వాత నిర్వహణ ఖర్చును చెల్లించేందుకు పురపాలికలు వెనుకాడడంతో ఒప్పంద సంస్థ వెనక్కి తగ్గింది. మెల్లగా సిబ్బందిని తొలగించింది. దీంతో జిల్లాలో వీధుల్లో వెలుగులు మాయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 20, 40 వాట్స్‌ బల్బులతో సరిపెట్టేశారు. దీంతో బల్బు కాంతి పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా రాత్రిపూట
రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కంపెనీ ఒప్పందం కూడా ముగిసిపోవడంతో సిబ్బందిని వెనక్కి తీసుకొంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మొత్తం వీధి దీపాల భారం
పురపాలికలపై పడింది.

కొవ్వూరు మున్సిపల్‌ పార్కు నుంచి థియేటర్ల కూడలికి వెళ్లే దారి..

ఫిర్యాదులు వస్తున్నా..

సాధారణ రోజుల్లో విద్యుత్తు దీపాల విభాగానికి జిల్లావ్యాప్తంగా 300లకు పైగా ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని పరిష్కరించడంలో అశ్రద్ధ ఉంటోంది. ప్రధాన ప్రాంతాల్లో దీపాల మరమ్మతు కోసం క్రేన్లు వినియోగించాలి. వాటి కోసం వారం, పది రోజులు ఆగాల్సి వస్తోంది. వీధి దీపాల సమస్యల కోసం టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినా పలుచోట్ల సకాలంలో స్పందించడం లేదు. ఎల్‌ఈడీ దీపాలు మార్చేందుకు తగిన బడ్జెటు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది.


సిబ్బందికి చెప్పినా స్పందన కరవు

ఒక్కోసారి  సిబ్బంది  సకాలంలో స్పందించకపోవడం  వల్ల వీధుల్లో అంధకారం ఏర్పడుతోంది. న్యూకాలనీ, వాసవీనగర్‌, సంగం కాలనీ, ఆనంద్‌ నగర్‌ వంటి ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్తు దీపాలు సరిగా పనిచేయటం లేదు. గొల్లపుంత వంటి కొన్ని ప్రాంతాల్లో పగటి పూట కూడా ఆరకుండా వెలుగుతున్నాయి. అంధకారం నెలకొన్న ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది.

కొవ్వాడ అప్పన్నబాబు, మండపేట


అంతటా అంధకారమే..

రైల్వేస్టేషన్‌ నుంచి సత్యవతినగర్‌ శివారు వరకు, అనుసంధాన వీధుల్లో సగం కూడా వీధి దీపాలు వెలగడం లేదు. ఏదొక కారణం చెబుతున్నారు తప్ప ప్రయోజనం లేదు. రాత్రి 7 దాటితే వాహనాలకు ఉన్న, ఇళ్ల ముందు దీపాలే వెలుగుకు ఆధారం. ప్రమాదాలు జరగడంతో పాటు చోరీల బెడదతో భయపడుతున్నాం. అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.

ఎం.రామచంద్రరావు, కొవ్వూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని