logo

పెంచినట్లు పెంచి.. పారితోషికంలో మెలిక!

పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్‌ సిబ్బంది రుసరుసలాడుతున్నారు.

Published : 18 May 2024 03:04 IST

అధికారుల తీరుపై పోలింగ్‌ సిబ్బంది అసహనం

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: పారితోషికం పెంపు విషయంలో అధికారుల తీరుపై కొందరు పోలింగ్‌ సిబ్బంది రుసరుసలాడుతున్నారు. పెంచిన పారితోషికం తీసుకునేందుకు అధికారులు పెట్టిన మెలిక చూసి అవాక్కవుతున్నారు. ఎక్కడ పోలింగ్‌ విధులు నిర్వహించారో అక్కడికే వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతుండటంతో ఆ ఇచ్చేది రవాణా ఖర్చులకే సరిపోతాయని వాపోతున్నారు.

జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 13న ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి పోలింగ్‌ ముగిసిన అనంతరం పీవోలు, ఏపీవోలకు రూ.1,400 చొప్పున, ఓపీవోలకు రూ.750 చొప్పున పారితోషికం చెల్లించారు. పక్క జిల్లాల్లో పోలింగ్‌ సిబ్బందికి చెల్లించిన దానికంటే తక్కువగా ఇచ్చారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు కూడా పారితోషికం చెల్లింపులో వ్యత్యాసాలు సవరించాలంటూ ఈ నెల 15న కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. దీంతో పీవో, ఏపీవోలకు రూ.350 చొప్పున, ఓపీవోలకు రూ.250 చొప్పున అదనంగా పారితోషికం చెల్లించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు జిల్లా పరిధిలోని ఏడు నియోజవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు తెలిపారు.

ఆనందం అంతలోనే ఆవిరి

పారితోషికం పెంపుపై సిబ్బంది ఆనందం గంటల్లోనే ఆవిరైంది. అదనంగా ఇచ్చే పారితోషికాన్ని ఎక్కడ విధులు నిర్వర్తించారో అక్కడి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలని జిల్లా అధికారులు మెలిక పెట్టారు. ఇది పలువురు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. కొందరు సొంత నియోజకవర్గంలో కాకుండా వేరేచోట  పోలింగ్‌ విధులు నిర్వర్తించారు. మరికొందరు పక్క జిల్లాల సిబ్బంది ఇక్కడ పోలింగ్‌ విధులు చేపట్టారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం నియోజక వర్గాలకు చెందిన వందల సంఖ్యలో ఉద్యోగులు గోపాలపురం నియోజకవర్గంలో పోలింగ్‌ విధులు నిర్వర్తించారు. వీరంతా ఇప్పుడు పెంచిన రూ.250, రూ.350 పారితోషికం కోసం అక్కడి వెళ్లాలంటే ఆ డబ్బులు రవాణా ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. మొత్తం పారితోషికం ఏదో అప్పుడే ఇచ్చేసి ఉంటే ఇబ్బంది ఉండేదికాదని, ఇప్పుడు రవాణా ఛార్జీలు పెట్టుకుని ఈ మాత్రం డబ్బులకు అంతంతదూరం వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన పారితోషికాన్ని ఎక్కడి సిబ్బందికి అక్కడే అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని