logo

పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా తెదేపాకు ఉంది

తెదేపా ఏ పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా, దమ్ము ఉందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 27 Jun 2022 13:39 IST

వైకాపా మూడేళ్ల పాలన విధ్వంసాలు, అరాచకాలే నీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : తెదేపా ఏ పొత్తు లేకుండా 165 సీట్లు గెలిచే సత్తా, దమ్ము ఉందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలోని తన ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి చేతకాని పనులకు, పరిపాలనకు మూడేళ్లకే ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ఆయన మూడేళ్ల పాలనలో ఎక్కడన్నా కట్టడం నిర్మించారా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చి మూడేళ్లయిన సందర్భంగా దుర్మార్గాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఒప్పంద ప్రకారం అభివృద్ధి చేసి వారి ప్లాట్లు వారికి ఇవ్వకుండా అమ్ముకునే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులు దీనిపై కోర్టుకు వెళతారని, సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రైతులకు జరగాల్సిన న్యాయం పొందేవరకు అమ్ముకునే హక్కు లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ఓ ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చిందని, నాసిరకం మద్యం అమ్మి ఖజానా నింపాలన్న దురాలోచన ఇప్పటికైనా మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భూసేకరణలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలసని, ఇప్పటికీ తెదేపా ప్రభుత్వంలో కట్టించిన టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వకపోగా ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని