logo

ఆన్‌లైన్‌లోనే హాజరు

విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రెండూ ఒకేదానిలో నమోదు చేసుకునేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను రూపొందించింది. ఈనెల 16 నుంచి కచ్చితంగా ఆ యాప్‌లో మాత్రమే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ

Published : 15 Aug 2022 06:39 IST

ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్‌ యాప్‌
16 నుంచి అమలుకు ఆదేశం

ఈనాడు, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రెండూ ఒకేదానిలో నమోదు చేసుకునేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను రూపొందించింది. ఈనెల 16 నుంచి కచ్చితంగా ఆ యాప్‌లో మాత్రమే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్‌ కాంప్లెక్సుల ప్రధానోపాధ్యాయులు ఆ యాప్‌లో తమ పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలి. వారి ఐడీ ఆధారంగా ఆ కాంప్లెక్సు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకునేలా దానికి రూపకల్పన చేశారు. దీంతో సోమవారం ఉదయం కాంప్లెక్సు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండా వందనం కార్యక్రమం ముగియగానే తమ పేర్లతో అటెండెన్స్‌ యాప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే తప్ప మంగళవారం నుంచి అందరూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి పి.శైలజ జిల్లాలోని అన్ని కాంప్లెక్సుల హెచ్‌ఎంలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సోమవారం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని మిగిలిన ఉపాధ్యాయులు దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాప్‌ ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి సీఆర్‌పీలను అందుబాటులో ఉండాలని, వారి సేవలను వినియోగించుకోవాలని విద్యా శాఖ వర్గాలు సూచించాయి.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 3600 పాఠశాలలు, 4 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. 13వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరి వివరాలు మొత్తం యాప్‌లో ఎక్కించడానికి ఉపాధ్యాయులు అంతా సమన్వయంతో పనిచేయాలని, ఇది ఏ ఒక్కరో చేస్తే అయ్యేది కాదని, అందరూ భాగస్వాములు కావాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు మాత్రమే హాజరు నమోదు చేసుకోవాలి. దీంతో అటెండెన్స్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని 16 నుంచి కచ్చితంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే హాజరు వేయాలని సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు స్పష్టం చేశారు. అమ్మ ఒడికి 75 శాతం హాజరును యాప్‌ అటెండెన్స్‌ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని