logo

స్ఫూర్తిదాయకం సోమేపల్లి కవిత్వం

ఓ యువకుడు తన రచనల ద్వారా తెలుగు సాహిత్య లోకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వర్తమాన సాహితీవేత్తకుల స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అన్నారు.

Published : 14 Nov 2022 05:17 IST

మాట్లాడుతున్న పాపినేని శివశంకర్‌

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఓ యువకుడు తన రచనల ద్వారా తెలుగు సాహిత్య లోకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వర్తమాన సాహితీవేత్తకుల స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అన్నారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వశిష్ట సోమేపల్లి రాసిన ‘ఆకు రాలిన చప్పుడు’ పుస్తకావిష్కరణ సభ స్థానిక లక్ష్మీపురం కాటన్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించి వశిష్ట అమ్మమ్మ సౌభాగ్యమ్మకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి, రైతుల ఆక్రందన, అబలలపై అత్యాచారాలు, విధ్వంసం, వలసకూలీలు వంటి కవితలతో తన మొదటి ప్రచురణతోనే తనలోని సామాజిక దృక్కోణాన్ని ఆవిష్కరించిన వశిష్ట స్ఫూర్తిదాయక విశిష్ట కవి అని ప్రశంసించారు. తెలుగు సాహిత్య చరిత్రలో తన సంతకాన్ని సుస్థిరం చేసుకోవాలని, కేంద్ర సాహిత్య యువ పురస్కారం కూడా అందుకోవాలని ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఒక కంటిలో అగ్ని, మరొక కంటిలో అశ్రువులు కవికి ఉండాల్సిన లక్షణాలన్నారు. సాహిత్య శిల్పి వెంకటసుబ్బయ్య వారసునిగా వశిష్ట ఉన్నత సాహిత్య పీఠం అధిరోహించాలన్నారు. సాహితీవేత్తలు చలపాక ప్రకాష్‌, అనిల్‌ డ్యాని, మందరపు హైమావతి పుస్తకాన్ని సమీక్షించారు. సభలో జిల్లా రచయితల సంఘం కార్యదర్శి ఎస్‌.ఎం.సుభాని, సాహితీవేత్తలు రావెల సాంబశివరావు, డాక్టర్‌ విజయ్‌ కోగంటి, డాక్టర్‌ వి.నాగరాజ్యలక్ష్మి, నానా, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని