logo

సారొస్తేనే... గుర్తొస్తాయ్‌..!

నగరంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లోని పలు రోడ్ల ముస్తాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 2న ముఖ్యమంత్రి రైతులకు వాహనమిత్ర పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.

Published : 02 Jun 2023 05:16 IST

యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్డు
యంత్రాంగం హడావుడితో చిక్కులు

బీటీ రోడ్డు వేస్తున్న సిబ్బంది

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే: నగరంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లోని పలు రోడ్ల ముస్తాబు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 2న ముఖ్యమంత్రి రైతులకు వాహనమిత్ర పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చుట్టుగుంట వద్ద ఆయన జెండా ఊపి ట్రాక్టర్ల పంపిణీ చేయనున్నారు. ఆ కూడలికి చుట్టుపక్కలా గురువారం బీటీ రోడ్డు నిర్మించారు. రోడ్డుకిరువైపులా దుమ్ము, ధూళి, మట్టికుప్పలు తొలగించారు. గుంటూరు కన్వెన్షన్‌ హాల్‌ కూడలి నుంచి పీకలవాగు మీదుగా చుట్టుగుంట వరకు భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రితో గంటల్లోనే రోడ్డు నిర్మించడం విశేషం. ఉదయం ఈ మార్గంలో వెళ్లిన వారు, సాయంత్రానికి కొత్తగా నిగనిగలాడుతూ రోడ్డు కనిపించడంతో నివ్వెరపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లోని పలు రోడ్లు గుంతలమయమై అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నా పట్టించుకోని అధికారులు, సీఎం పర్యటనతో ఒక్కసారిగా నిర్మాణానికి పూనుకోడం చూసి నగరవాసులు ‘సారొస్తున్నారు.. రహదారులు బాగు చేస్తున్నారంటూ’ చెవులు కొరుక్కున్నారు. రెండు గంటల సీఎం పర్యటన కోసం కొత్తగా రోడ్డు వేయడం హర్షణీయమే అయినా, నగరంలోని ఇతర ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రహదారులపై శీతకన్ను ఎందుకు వేస్తున్నారని పెదవి విరిచారు. అధికారులు అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో రోడ్లను బాగు చేస్తే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108 అంబులెన్స్‌

రాడ్లు పాతి.. దారి మూసి..

గుంటూరు చుట్టుగుంట కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కార్యక్రమానికి హడావుడిగా రహదారి పనులు మొదలుపెట్టారు. జాతీయ రహదారి నుంచి వాహనాలు నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం కావడంతో వాహనాల రద్దీ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 108 అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నా పట్టించుకునేవారు లేక రద్దీ తగ్గేవరకు ఆగాల్సి వచ్చింది. వారం రోజుల క్రితమే సీఎం కార్యక్రమ వివరాలు తెలిసిన అధికారులు చేస్తున్న హడావుడి పనులతో ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు వాపోయారు. షాపులు, ఇళ్లకు దారి లేకుండా బారికేడ్లతో దిగ్బంధం చేసేలా రాడ్లు పాతారు. రహదారుల వెంట ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు నిలబెట్టారు.

షాపులు, ఇళ్లకు దారి లేకుండా బారికేడ్లు  

శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం పంపిణీ చేసే యంత్ర పరికరాల కార్యక్రమానికి ముందుగానే పిలవడంతో గురువారం రాత్రంతా ట్రాక్టర్లపైనే నిద్రిస్తున్న రైతులు

ఈనాడు గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని