logo

ఎన్ని విచిత్రాలో..

ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి.

Published : 28 Jun 2023 04:05 IST

ఓటర్ల జాబితా అస్తవ్యస్తం
మాచవరం, న్యూస్‌టుడే

ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తి పేరు

ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో వార్డు, ఇంటి నెంబరు ఆధారంగా జాబితాలో పేర్లు కనిపించేవి. ప్రస్తుతం వరుస క్రమం తప్పడంతో ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జాబితా మొత్తం పరిశీలిస్తే తప్ప.. ఓటు ఉన్న విషయం తెలియని దుస్థితి. ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు.

ఇంటి నంబరు, చిరునామాలు లేవు

మాచవరానికి చెందిన ఓటర్ల జాబితాలోని 161 పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తే.. తొలిపేరుకు డోర్‌ నంబరే లేదు. అలా వరుసగా 28 పేర్లకు అడ్రసు లేదు. తరువాత 1-1 డోర్‌ నంబరుతో 11 మంది పేర్లు నమోదయ్యాయి. వీరందరూ వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. ఓటర్ల జాబితాలోని వరుస క్రమాన్ని పరిశీలిసే ఎన్నో విచిత్రాలు కనిపించాయి. 2-104 ఇంటి నంబరు తర్వాత 2-105 వరుస క్రమం రావాలి. కానీ 2-156 డోర్‌ నంబరులోని ఓటర్లు కనిపిస్తున్నారు. అదే విధంగా 3-15 తరువాత 3-101 ప్రచురితమైంది. ఈ ఒక్క పోలింగ్‌ కేంద్రమే కాకుండా, మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఓట్లు ఒకచోట ఉంటే, పిల్లలవి మరో చోట ఉన్నాయి. గ్రామ ఓటర్ల జాబితా అంతా పరిశీలిస్తే కానీ, అసలు ఓటు ఉందో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉంది.

* మాచవరానికి చెందిన ఓ యువకుడికి 18 ఏళ్లు నిండటంతో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నాడు. బీఎల్‌వో, తహసీల్దారు కార్యాలయం      చుట్టూ పలుమార్లు తిరగడంతో ఓటు హక్కు లభించింది. తీరా చూస్తే వేరొక చోట నమోదై ఉంది. ఈ విధంగా వచ్చిన చేర్పులన్నీ ఏదో ఒక పోలింగ్‌ కేంద్రంలోని చివరి పేజీలో ప్రచురిస్తున్నారు. ఇంట్లోని కుటుంబ సభ్యులతోపాటు కాకుండా  విడిగా నమోదవుతున్నాయి.

మరణాల సంగతి దేవుడెరుగు..

సాధారణంగా ప్రతి గ్రామంలో ఏటా కొంతమంది వివిధ కారణాలతో చనిపోతూ ఉంటారు. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి. ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా సవరణ చేసిన ప్రతిసారీ అవే పేర్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మాచవరంలో దాదాపు 254 మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఇందులో పదేళ్ల కిందట చనిపోయిన వారి పేర్లు ఉండటం గమనార్హం. ఓ గ్రామంలోనే ఇన్ని ఓట్లు ఉంటే, నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయలోపం ఉందనడానికి ఇదో ఉదాహరణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని