logo

నిజమేనండి.. ఈ రోడ్డేసి తొమ్మిది నెలలే...

గ్రామీణులు కొన్నేళ్లుగా గుంతలు పడిన రహదారిలో ప్రయాణానికి నరకయాతన అనుభవించారు..

Published : 22 Jul 2023 05:42 IST

ఏడాది తిరక్కుండానే పెదకూరపాడు-అత్తలూరు రహదారి స్వరూపం మారింది ఇలా..

అత్తలూరు సమీపంలో మోకాలిలోతు గుంత చూపిస్తున్న గ్రామస్థులు

ఈనాడు-నరసరావుపేట, న్యూస్‌టుడే-పెదకూరపాడు: గ్రామీణులు కొన్నేళ్లుగా గుంతలు పడిన రహదారిలో ప్రయాణానికి నరకయాతన అనుభవించారు.. రోడ్డు వేసినందున తమ కష్టాలు తీరాయన్న ఆనందం వారిలో ఏడాది కాలమైన నిలవలేదు. గతానికి కంటే దారుణంగా పైకితేలిన కంకర రాళ్లు.. కొన్నిచోట్ల మోకాలిలోతు గుంతలు.. లోపలకు కుంగి ఎగుడుదిగుడుగా మారి.. రోడ్డంతా పగుళ్లిచ్చి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వైకాపా పాలనలో అధ్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లు వేసేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే ఎలా అని సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెదకూరపాడు-అత్తలూరు రహదారి దుస్థితిపై ‘ఈనాడు-ఈటీవీ’ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా, నాణ్యతా లోపాలు ఎన్నో బహిర్గతమయ్యాయి.  
జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రం నుంచి అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి 9 నెలల కిందట తారురోడ్డు వేశారు. మొత్తం 11 కిలోమీటర్ల దూరం రూ.2.06 కోట్ల నిధులతో నిర్మించారు. బాగా పాడైన రోడ్డు వేసే క్రమంలో భారీ గోతులు పడినచోట లూజు మట్టిని పూర్తిగా తొలగించి పక్కకు వేసి రోడ్డు వేయాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా పాత రోడ్డుపైనే రహదారి వేయడంతో అంతకు ముందు ఎక్కడైతే గోతులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మళ్లీ రోడ్డు పాడైంది. నాసిరకం నిర్మాణ సామగ్రి కూడా రోడ్డు త్వరగా దెబ్బతినడానికి కారణమైంది. దీనిని గుర్తించిన గుత్తేదారు మళ్లీ గుంతలు పూడ్చి పైపైన సరిచేశారు. అయినప్పటికీ మళ్లీ గోతులు పడుతున్నాయి. ఇవి కొన్నిచోట్ల మోకాలిలోతు పైగా ఉండటంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కంకర తేలి కనిపిస్తోంది. రోడ్డు కుంగిపోయి ఎగుడుదిగుడుగా తయారైంది. గోతుల్లో వర్షపు నీరు నిలిచి వాహనాలు తిరగడం వల్ల తొందరగా దెబ్బతింటోంది. ఏళ్ల తరబడి వేచిచూసిన తర్వాత కొత్తగా రోడ్డు వేస్తే నెలల వ్యవధిలోనే పాడైందని స్థానికులు వాపోతున్నారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో గుత్తేదారు తాత్కాలికంగా మరమ్మతు చేస్తున్నా మళ్లీ మళ్లీ పాడవుతోంది. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వారు సైతం రాత్రి వేళ గోతుల్లో పడి ప్రమాదాల బారినపడుతున్నారు.

రామాపురం వద్ద రూపురేఖలు కోల్పోయి ఇలా..


ఇసుక లారీలతో మరింత ధ్వంసం

కృష్ణానది నుంచి పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇసుక తరలించే క్రమంలో పెదకూరపాడు మార్గంలో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. గ్రామీణ రహదారుల్లో 30 నుంచి 50 టన్నుల ఇసుకతో లారీలు రాకపోకలు సాగించడంతో రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమవుతున్నాయి. భారీ లారీలు తిరుగుతుండటంతో రోడ్డు ఎక్కడికక్కడ కుంగిపోయింది. నిర్మాణంలో లోపం ఉన్నచోట భారీ గోతులు పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణాలో భాగస్వాములు కావడంతో స్థానికులు లారీలను అడ్డుకోలేని పరిస్థితి. రోడ్లు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇసుక లారీలు ఆపాలని స్థానికులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీంతో ఎవరికివారు మిన్నకుండిపోతున్నారు.


ఐదేళ్ల వరకు ఇదే దారి..

రహదారుల, భవనాలశాఖ నిబంధనల ప్రకారం ఒకసారి రోడ్డు నిర్మిస్తే ఐదేళ్ల వరకు మళ్లీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయరు. రోడ్డుపై ఒకసారి తారురోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు ఉంటుందని అంచనా. పెదకూరపాడు-అత్తలూరు రహదారి ఇటీవలే వేసినందున ఐదేళ్లపాటు మళ్లీ నిర్మించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నెలల వ్యవధిలోనే పాడైన రహదారిలోనే స్థానికులు నాలుగేళ్లపాటు రాకపోకలు సాగించాల్సి ఉంది. రహదారి నిర్వహణ రెండేళ్లపాటు గుత్తేదారు చేయాల్సి ఉన్నందున మరో ఏడాది తాత్కాలిక మరమ్మతు చేస్తారు. ఇక అప్పటినుంచి మళ్లీ ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గోతుల రోడ్డుతో ప్రమాదాలు

రోడ్డు వేసి 7 నుంచి 8 నెలలు అవుతోంది. పెదకూరపాడు నుంచి అత్తలూరు వరకూ ఇంతే ఉంది. రాత్రివేళ గోతులు, ఎగుడుదిగుడు రోడ్డులో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. దీంతో రాత్రివేళ ఈ మార్గంలో రావాలంటే భయం. ఆటోలు సైతం బోల్తా పడ్డాయి. నాసిరకంగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి. ఇసుక లారీలు ఈ మార్గంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. రోడ్డు తొందరగా పాడవడానికి ఇది మరో కారణం.

హరిబాబు, అత్తలూరు గ్రామం, పల్నాడు జిల్లా


గుత్తేదారుతో మరమ్మతు చేయిస్తాం

పెదకూరపాడు-అత్తలూరు మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తిస్తాం. గోతులు పడినచోట మరమ్మతు చేయిస్తాం. రెండేళ్ల వరకు గుత్తేదారు నిర్వహణ చేపట్టాల్సి ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

కృష్ణారెడ్డి, ఈడీ, రహదారులు, భవనాల శాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని