logo

పోలీసు తీరు మారలేదు.. అరాచకాలు ఆగలేదు..

పల్నాడులో రౌడీరాజ్యం నడుస్తోంది.. దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలకు అంతేలేకుండా పోతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.

Updated : 16 Apr 2024 06:10 IST

పల్నాడులో అధికార పార్టీ దౌర్జన్యాలు
ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ప్రశాంత ఎన్నికలు

పల్నాడులో రౌడీరాజ్యం నడుస్తోంది.. దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలకు అంతేలేకుండా పోతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చినా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎదురు నిలిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా అధికారులు, పోలీసులు వైకాపాకు వంతపాడుతున్నారు. ఎస్పీ మారినా పల్నాట పోలీసులు తీరు మారలేదు. సత్తెనపల్లి, మాచర్ల నియోజకవర్గంలో నిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులు జరుగుతున్నా కారకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సంఘం అయినా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తే తప్ప సార్వత్రిక ఎన్నికలు సాఫీగా జరిగేలా లేవు.

న్యూస్‌టుడే, కారంపూడి

వైకాపా అంటే ‘ఎస్‌బాస్‌’

కొత్త ఎస్పీ జిల్లాలో బాధ్యతలు తీసుకున్నా పల్నాట పోలీసులు మాత్రం అధికార పార్టీకి దాసోహమంటూనే ఉన్నారు. నరమాలపాడులో ప్రచారాన్ని అడ్డుకొని, తెదేపా కార్యకర్తలపై ట్రాక్టర్‌ను నడిపేందుకు యత్నించిన ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడినా వారిపై నామమాత్రపు కేసులతోపాటు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తూ వారికి వంతపాడుతున్నారు. ఎస్పీ మాచర్ల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులను నియంత్రించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.


ఇటీవల జరిగిన సంఘటనలు..

కారంపూడి

పెదకొదమగుండ్ల పంచాయతీ కాకానివారిపాలెంలో వాలంటీరు వంగల సాగర్‌ వైకాపాకి ‘ఓటు వేయకపోతే చంపేస్తా’నంటూ తెలుగుదేశం పార్టీ అనుకూలురు కడియం నాగరాజు, కడియం వీరయ్య, కడియం సమర్పణరావులపై దాడి చేసి గాయపరచటంతో పాటు వారి ఇళ్లలో సామగ్రి ధ్వంసం చేశాడు. కేసు పెట్టేందుకు వచ్చిన బాధితులను స్టేషన్‌లోకి సైతం పోలీసులు రానీయలేదు. ఈ క్రమంలో సాగర్‌ తనే గాయపరుచుకొని బాధితులపైనే ఫిర్యాదు చేయగా చివరకు వరకట్న వేధింపు కింద పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

మిరియాల

తెదేపా సానుభూతి పరులుగా ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతీయువకులు ప్రేమించుకున్న విషయంలో వైకాపా నాయకులు కలుగజేసుకొని ఆ యువకుడిపై దాడి చేశారు. దీనిని ఆ సామాజిక వర్గ పెద్దలు ప్రశ్నించటంతో వారి ఇళ్లపై వైకాపా కార్యకర్తలు దాడికి ఉపక్రమించారు. విషయం తెలిసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.

మాచర్ల

అచ్చమ్మకుంట తండాకు చెందిన బాణావత్‌ ఛత్రీనాయక్‌ పిడుగురాళ్లలో ముఖ్యమంత్రి సభకు రాలేనన్నందుకు అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు రమేష్‌నాయక్‌, నరేష్‌లు, ఉపాధి క్షేత్ర సహాయకుడు రమావత్‌ శరవణ్‌నాయక్‌లు కర్రలతో దాడి చేసి తలపగుల గొట్టారు.

కారంపూడి

నరమాలపాడులో తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారానికి వెళుతుండగా ట్రాక్టర్‌ను అడ్డుపెట్టడంతో పాటు తెదేపా కార్యకర్తలపై ట్రాక్టర్‌ను నడిపిన వైకాపాకు చెందిన కారసాల రమేష్‌, పైడి వెంకటేష్‌లను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని గ్రామ శివారుకు తీసుకొచ్చారు. ఆపై వారితో మంతనాలు జరిపి బ్రహ్మారెడ్డి వెళ్లే వరకు అక్కడే ఉంచి తిరిగి పంపించారు.

వెల్దుర్తి

మండలంలోని కొత్తపుల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన కేతావత్‌ వెంకటేశ్వర్లునాయక్‌ జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. బ్రహ్మారెడ్డి ప్రచారంలో మరికొందరిని తీసుకెళుతున్నాడు. దీంతో ఆగ్రహించిన వైకాపా నేత, మాజీ సర్పంచి పాండూ నాయక్‌ కుమారుడు రవినాయక్‌, మరికొందరితో కలిసి ఇంటిపై దాడి చేసి అడ్డువచ్చిన తులశీనాయక్‌ తల పగలగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని