logo

సీఎం ఇలాకాలో పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు

సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివసించే ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు.

Published : 16 Apr 2024 05:14 IST

వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు

తాడేపల్లిలో కార్మికుల నిరసన

తాడేపల్లి, న్యూస్‌టుడే: సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివసించే ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. అప్పులు చేసి బతుకుబండి నడిపిస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలో సుమారు 900 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  అర్బన్‌ పరిధిలో పనిచేసే వారికి గత నెల వేతనాలు నేటికీ జమ కాలేదు. కార్పొరేషన్‌ విలీన గ్రామాల్లో పనిచేసే వారికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని కార్పొరేషన్‌ జోనల్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

సమ్మె కాలం వేతనం నేటికీ లేదు.. పారిశుద్ధ్య కార్మికులు గత ఏడాది డిసెంబర్‌ 26 నుంచి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు 16 రోజులపాటు సమ్మె నిర్వహించారు. ఇందుకు సంబంధించి కార్మికులకు రూ.21 వేల వేతనం, డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు రూ.24,500 చొప్పున వేతనమిస్తామని జీవో నంబర్‌ 36 ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలకు గానూ కేవలం 11 చోట్ల మాత్రమే వేతనాలు ఇచ్చారు. ఏప్రిల్‌ 15వ తేదీ వచ్చినా మార్చి నెల జీతం నేటి వరకు ఇవ్వలేదు. సంక్రాంతికి ప్రతి కార్మికుడికి రూ.1000 కానుకగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.


పస్తులతో నెట్టుకొస్తున్నాం.. : నాగమణి, కార్మికురాలు

జీతాలు లేక పస్తులతో కాలం నెట్టుకొస్తున్నాం. రోజులో ఒకపూట మాత్రమే భోజనం చేస్తున్నాం. రోజువారీ వడ్డీలకు అప్పులు చేస్తున్నాం. పనిచేస్తున్నా జీతం ఇవ్వకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నా జీతాలు ఇవ్వడం లేదు. ఇంక ఎవరు న్యాయం చేస్తారు.


ఎలా బతకాలి..?

మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించకపోతే సమ్మె చేస్తాం. అధికారులు నిర్లక్ష్యం వల్ల కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. నెలాపదిహేను రోజులు గడిచినా వేతనం ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? తక్షణం విలీన గ్రామాల్లోని కార్మికులకు బకాయిలు చెల్లించాలి. అర్బన్‌ ప్రాంతంలో మార్చి నెల జీతాలివ్వాలి. సమ్మె కాలంలో ఇస్తామన్న వేతనం వెంటనే విడుదల చేయాలి. పండగ కానుక నగదు కూడా అందించాలి.  

కె.ఉమామహేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని