logo

కార్మికలోకం కకావికలం

అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను.

Published : 01 May 2024 06:06 IST

అయిదేళ్ల జగనన్న రాజ్యంలో అష్టకష్టాలు
మూడుముక్కలాటతో కుదేలైన నిర్మాణరంగం
పనుల్లేక రోడ్డునపడ్డ భవన నిర్మాణ కూలీలు
నిధులు లాగేసుకుని సంక్షేమంలోనూ కోత
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌, మేడికొండూరు, తుళ్లూరు, తెనాలిటౌన్‌, పొన్నూరు

అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను.

ఇదీ ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన మాట.

అధికార పీఠం ఎక్కగానే జగన్‌ అసలు రంగు బయటపడింది. మూడు రాజధానులు అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అమరావతి పనులు నిలిపేశారు. కోర్‌ క్యాపిటల్‌లో రాత్రీపగలు జరిగే పనులు నిలిచిపోయాయి. నిర్మాణ రంగం కుదేలైంది. ఇక్కడ పనులు చేసే వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్‌ కార్మికులకు కొట్టిన మొదటిదెబ్బ ఇది.. ఇసుక విధానం మార్చి రెండో దెబ్బ కొట్టారు. ఇసుకరీచ్‌లను గుత్తేసంస్థలకు అప్పగించి గుత్తాధిపత్యం చెలాయించారు. కిలోమీటర్ల దూరం లారీలతో క్యూలో నిల్చుంటే కానీ ఇసుక దొరకని పరిస్థితి తెచ్చారు. పాలకుడి స్వార్థానికి ఓ రంగం ఎలా కుదేలయ్యిందో, జీవితాలెలా తలకిందులయ్యాయో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం.

ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారు.. వారంతా కష్టాన్నే నమ్ముకున్న బడుగుజీవులు. వైకాపా పాలనలో ఇసుక కొరతతో చేద్దామంటే పనిలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలు. తోటి కార్మికుల వద్ద అప్పు తీసుకుందామంటే వారికీ పూటగడవని పరిస్థితి. పని లేక కుటుంబాలను పోషించుకోలేక ద్విచక్ర వాహనాలు, ఇంట్లో సామగ్రి తాకట్టు పెట్టి రోజువారీగా జీవనం సాగించాల్సి వచ్చింది. ఒకప్పుడు నెలకు ఎంతో కొంత పొదుపు చేసుకుని పిల్లలను చదివించుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకున్న భవన నిర్మాణ కార్మికులు వైకాపా పాలనలో పస్తులతో పూట గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

గుంటూరు: పని కోసం అడ్డా కూలీల ఎదురుచూపులు

ఉమ్మడి గుంటూరులో భవన నిర్మాణ కార్మికులు: 2,27,530
అసంఘటిత రంగంలో పనిచేసేవారు.. 1.8లక్షలు

పథకాల్లో కోత..

తెదేపా హయాంలో ఉన్న సంక్షేమ పథకాలకు మంగళం పాడిన వైకాపా సర్కారు ఆదుకోకపోగా ఆపదలోకి నెట్టేసింది. గత ప్రభుత్వంలో కార్మికశాఖ రూ.3వేలు విలువచేసే పరికరాలు కార్మికులకు ఉచితంగా ఇచ్చింది.
వైకాపా సర్కారు కార్మిక శాఖ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ.2100కోట్లు తీసుకుని కార్మికుల పొట్ట కొట్టింది.

తెనాలి: పని కోసం ఆశగా అడుగుతూ..


పనుల్లేక వలసపోతే ప్రాణాలే పోయాయి

జొన్నకూటి విశ్వనాథం, దేవతోటి దేవదానం (పాతచిత్రాలు)

మేడికొండూరు మండలం డోకిపర్రు అంబేడ్కర్‌నగర్‌ కాలనీకి చెందిన రోజు వారి కూలీలు స్థానికంగా పనులు లేకపోవడంతో ఏడాది కిందట ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం సుకుమ జిల్లా వెళ్లారు. అక్కడ జల్‌జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా పైపులైను పనులు చేశారు. కొద్ది రోజులకు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవడంతో తిరిగి స్వస్థలాలకు వచ్చారు. ఏడుగురు కూలీలు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వారిలో ముగ్గురు దేవతోటి దేవదానం (35), జొన్నకూటి విశ్వనాథం(25), గంటెల ఏడుకొండలు (40) వారం రోజుల వ్యవధిలో వరుసగా మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. వైద్య సిబ్బంది కాలనీలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేశారు.


సంక్షేమానికి పాతర

చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణం అయితే రూ.2లక్షలు, గాయపడితే తీవ్రతను అనుసరించి రూ.62,500 నుంచి గరిష్ఠంగా రూ.5లక్షల వరకు కార్మికులకు లభించేది.
జగన్‌ పాలనలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణిస్తే వైఎస్సార్‌ బీమా కింద రూ.5లక్షలు ఇంట్లో ఒక్కరికే వర్తించేలా మెలిక పెట్టారు. 50 ఏళ్లు దాటిన కార్మికుడుది సాధారణ మరణమైతే ఎలాంటి సాయం అందదు. 


వారంలో రెండు రోజులే పని

- శ్రీనివాసరావు, తెనాలి శివయ్య, కూచిపూడి

కూలి పనులే ఆధారం. గత అయిదేళ్లుగా పనుల్లేవు. వారంలో రెండు రోజులు దొరికితే చాలా ఎక్కువ. ఇలా అయితే ఎలా బతుకుతాం? అప్పుల పాలయ్యాం. రోజూ రాకపోకలకు రూ.50 ఖర్చవుతోంది.


బిక్షమెత్తి తోటి కార్మికులకు సాయం చేశాం

- దీవెనరావు

అయిదేళ్ల కిందట రాజధాని నిర్మాణ పనులతో పగలు, రాత్రి కార్మికులకు పని ఉండేది. ఆదివారం కూడా పని ఉండేది. ప్రస్తుతం వారంలో రెండు రోజులు పనులు దొరకడం గగనంగా మారింది. కొవిడ్‌ వేళ భిక్షమెత్తి తోటి కార్మికులకు బియ్యం, పప్పు సాయం చేశాం.


కార్మికులకు పైసా కేటాయించలేదు

- ఆరేటి రామారావు, కార్మిక సంఘ నాయకుడు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి పైసా కేటాయించలేదు. కార్మిక శాఖ నుంచి నూతన భవన నిర్మాణ కార్మికుడి గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసినా ఒక్క కార్డు కూడా అందించలేదు.


గత ప్రభుత్వంలో కార్మికులకు ఇలా....

  • కార్మికుడి సభ్యత్వం రుసుం రూ.50, అయిదేళ్లపాటు నెలకు రూ.1 చొప్పున రూ.60 కలిపి రూ.110 చెల్లిస్తే గుర్తింపు కార్డు ఇచ్చేవారు. అనేక ప్రయోజనాలు కల్పించారు.
  • కార్మికురాలు, కార్మికుడి కుమార్తెకు వివాహ కానుక రూ.30వేలు
  • కార్మికుల కుటుంబంలో రెండు కాన్పుల వరకు ప్రసూతి సాయం రూ.30వేలు
  • కార్మికుడి సాధారణ మరణానికి రూ.60వేలు
  • దహన సంస్కారాలకు రూ.20వేలు
  • ప్రమాదభృతి కింద రోజుకు రూ.200 చొప్పున నెలలో 15 రోజులకు రూ.3వేలు సాయం 3 నెలల పాటు ఇచ్చేవారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని