logo

అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం

Published : 02 May 2024 06:28 IST

వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు
ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశించి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు

సభా వేదికపై ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు, చీరాల అభ్యర్థి కొండయ్య, తెదేపా నాయకులు

ఈనాడు-బాపట్ల, న్యూస్‌టుడే-చీరాల అర్బన్‌: గత సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో తెదేపాపై అభిమానంతో ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. కానీ ఇక్కడి నుంచి గెలుపొందిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పనుల కోసం కక్కుర్తి పడేవాళ్లు రాజకీయాలకు అవసరమా? ఇక్కడ గెలిచి అడ్డదారులు తొక్కారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. నన్ను గెలిపిస్తే ఆ పెద్ద మనిషి పార్టీలోకి వస్తానంటున్నారట, అలాంటి వ్యక్తులకు పార్టీలో స్థానం లేదు. ఆయారాం గయారాంలు మనకు అవసరం లేదు. వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన బ్రతిమిలాడి పార్టీలోకి వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు పొంది తీరా ఎన్నికలకు ముందు పార్టీమారి వెళ్లిపోయారు. ఇలాంటి అవకాశవాదుల్ని ఇక మీదట పార్టీ ఉపేక్షించదు. ఇలాంటి వారు  అవసరం లేదు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావులకు ఇబ్బందులు ఉండవా? వాళ్లు అడ్డదారులు తొక్కలేదే? కష్టమైన, నష్టమైన పార్టీలోనే ఉన్నారు కదా? ఇదీ నిబద్ధత అంటే.. అని వారిని ఉద్దేశించి పేరుపేరున చెప్పటంతో సభికుల నుంచి విశేష స్పందన లభించింది. చీరాలలో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నిక్కచ్చిగా పార్టీలోనే ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంటిపెట్టుకున్నవారిని పార్టీ ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అడ్డదారులు తొక్కి వెళ్లిన వ్యక్తులు మళ్లీ పార్టీలోకి వస్తే చేర్చుకోం. గత ఎన్నికల్లో నలుగురు గెలిచారు. ఈసారి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.

చీరాల నుంచి అమరావతికి గంటన్నరలో..

చరిత్ర కలిగిన చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిపరుస్తానని చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. తన హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. అమరావతి రాజధానిని జగన్‌ సర్వనాశనం చేయకుండా అభివృద్ధి చేసి ఉంటే ఇక్కడి నుంచి అమరావతికి గంటన్నరలోనే వచ్చి ఉద్యోగాలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేవారు. ఆ పరిస్థితిని జగన్‌ చెడగొట్టారు. చీరాల, బాపట్ల వాసులు ఉద్యోగాల కోసం ఏ బెంగళూరో, చెన్నై వెళ్లాల్సి రావడం దురదృష్టకరం. ఉద్యోగ, ఉపాధికి చాలా విస్త్రృత అవకాశాలు ఉన్నాయి. తెదేపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పర్యాటక హబ్‌గా, ఐటీకి చిరునామాగా మారుస్తానని చంద్రబాబు ఇక్కడి వాసులకు భరోసాను ఇచ్చారు. ఇంటి వద్ద బోరుకొడితే కార్యాలయానికి వచ్చి పనులు చేసుకునేలా వర్కింగ్‌ స్టేషన్లు నెలకొల్పుతామని వివరించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతామని సభాముఖంగా హామీనివ్వడంతో స్థానిక యువతలో హర్షం వ్యక్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని