logo

పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు

రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్‌ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు.

Published : 02 May 2024 06:49 IST

గుంటూరు నగరంలో రక్షిత నీటికి గ్యారంటీ లేదు
ఒకే నెలలో వరుసగా డయేరియా ఘటనలు
నలుగురు చనిపోయినా కదలని జగన్‌ సర్కారు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌, గుంటూరు నగరపాలకసంస్థ, పొన్నూరు, ఏటీ అగ్రహారం : రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్‌ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. వారికి కనీసం దిశా నిర్దేశమూ చేయలేదు. గుంటూరు నగరంలో ఈ ఏడాది వరుసగా తాగునీటి కలుషితం కారణంగా వందల మంది అతిసారం బారినపడ్డారు. పలువురు మృత్యువాత పడ్డారు. రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్నట్లు వ్యవహరించారు. వైకాపా ప్రజాప్రతినిధులకూ చీమకుట్టినట్లు అయినా అనిపించలేదు. ప్రాణాలు పోయినవారు గుండెపోటుతో చనిపోయారని పక్కదారి పట్టించారు. నీటి కలుషితానికి కారణమైన పైపులైన్ల బాగును యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన ఉన్నతాధికారులు పానీపూరీ బండ్లపై నిషేధం విధించడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి లో వేర్వేరు చోట్ల అతిసారం ప్రబలిన ఘటనలు అధికార యంత్రాంగం ఘోర వైఫల్యానికి నిదర్శనం.

కలుషిత నీటికి ఇదీ కారణం: ఒకసారి పైపులైన్లు అమర్చిన తర్వాత 30-40 ఏళ్లకు తిరిగి కొత్తవి వేయాలి. కానీ విచిత్రమేమిటంటే ఇప్పటికీ నాలుగైదు దశాబ్దాల నాటి ఇనుప పైపులైన్లే ఇంకా వినియోగంలో ఉన్నాయి. చాలా కాలనీల్లో గత ప్రభుత్వ హయాంలో కొత్త పైపులైన్లు వేసినా కనీసం పాత లైన్లను డమ్మీ చేయలేదు. దీని కారణంగా పాతలైన్ల ద్వారా తాగు నీరు సరఫరా అయి అతిసారం ప్రబలింది.

శారదాకాలనీలో అదే నిర్వాకం.. కలుషిత నీళ్లు తాగి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుంటూరు నగరంలో నలుగురు మృత్యువాత పడ్డారు. వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటికీ మురుగునీరు వస్తోందని జనం మొత్తుకుంటున్నారు. ఆనందపేట, సంగడిగుంట, శ్యామలానగర్‌, భారత్‌పేట, శ్రీనగర్‌, నెహ్రూనగర్‌, శ్రీనివాసరావుతోట ప్రాంతాల్లో తరచూ లీకేజీలు అవుతున్నాయి.

కౌన్సిల్‌కు బాధ్యత లేదా..? ప్రజలకు సరఫరా అవుతున్న నీళ్లు సురక్షితమైనవేనా కావా? అనేది నగర కౌన్సిల్‌ పట్టించుకోలేదు. నీటి నాణ్యత పరీక్షలను అటకెక్కించింది. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సచివాలయాల్లోని  150 మందికి పైగా ఎమినిటీస్‌ సెక్రటరీలు   ఉన్నా పరిశీలన బాధ్యత ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటున్నారు.

సామర్థ్యం 132.. వచ్చేది 90 ఎంఎల్‌డీ..

  • పర్యవేక్షణ లోపంతో గడిచిన మూడు, నాలుగేళ్ల నుంచి పంపుసెట్లు, మోటార్లు పనిచేయకపోయినా పట్టించుకునేవారు లేరు. 132 ఎంఎల్‌డీ నీళ్లు ప్రజలకు ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నా అధికారుల నిర్వాకం, పర్యవేక్షణ లోపంతో 90 ఎంఎల్‌డీకి మించి రావడం లేదు.
  • ప్రకాశం బ్యారేజీ వద్ద ఉండవల్లి నుంచి పైపులైన్ల ద్వారా నీళ్లు చేరేలా అక్కడ పంపుహౌస్‌లు, మోటార్లు అమర్చారు. ఉండవల్లిలో అయిదు పంపులు ఉండగా అవన్నీ సక్రమంగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. తక్కెళ్లపాడులో 42 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మూడు ఫిల్టరేషన్‌ ప్లాంట్లు ఉండగా వాటిల్లో కొన్ని పంపులు, ఫిల్టర్‌బెడ్లు పనిచేయక నీటి నాణ్యత లోపిస్తోంది. నీటి సరఫరా తగ్గుముఖానికి కారణమవుతోంది.

2024 ఫిబ్రవరి 7న...

గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గం ఐపీడీకాలనీ. ఆ కాలనీలో ఉదయం నీళ్లు తాగిన వారిలో సుమారు పది మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వెళ్లారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఐపీడీకాలనీకి చెందిన కొర్రపాటి ఓబులు(65) అదే రోజు రాత్రి మృత్యువాతపడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఇద్దరిని కార్పొరేట్‌ ఆస్పత్రికి బంధువులు తరలించారు. వారు కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.

2024 ఫిబ్రవరి 10న..

తూర్పు నియోజకవర్గంలోని శారదాకాలనీ. ఆ రోజు సుమారు 20 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదారుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మద్దెల పద్మ (16) మృత్యువాత పడింది. వరుసగా రోజూ అతిసార కేసులు పెరిగాయి. 120కి పైగా కేసులు చేరడంతో కలకలం రేగింది. సుమారు 20 మందిని కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించారు.

2024 ఫిబ్రవరి 16న..

రైలుపేటకు చెందిన ఇక్బాల్‌ వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. కలుషిత నీరు తాగడంతో తన భర్త మృతి చెందాడని భార్య మొబినాబేగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమ పోషణ పట్టించుకునేవారు లేకపోవడంతో పిల్లలతో సహా భీమవరంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నామని తెలిపారు.


రంగుమారి వాసన వస్తున్నాయి

- కనకమ్మ, కేవీపీ కాలనీ

రోజూ మంచి నీళ్లు రంగుమారి వస్తున్నాయి. నీటి పైపులైన్లు కాలువలో ఉంటున్నాయి. దీంతో ఎక్కడ లీకైందో తెలియడం లేదు. వాసన భరించలేక బయట నుంచి డబ్బా నీరు కొనుక్కుని తాగుతున్నాం.


ట్యాంకర్‌లో నీరు సరిగ్గా రావట్లేదు

-పుట్టలమ్మ (మృతురాలు పద్మ అమ్మమ్మ)

శారదాకాలనీలో తాగునీటి కలుషితంపై పెద్ద ఎత్తున హడావుడి చేసిన అధికారులు, సిబ్బంది ఇప్పుడు కనిపించడం లేదు. మాకు ట్యాంకర్‌ ద్వారా తాగు నీరు ఇస్తున్నారు. అదీ నాలుగైదు రోజులకోసారి వస్తోంది. ఈ నీటినే కాచి తాగేందుకు వినియోగిస్తున్నాం.


వ్యాధులు వస్తాయని భయంగా ఉంది

- ఒరుగంటి వేణు, నిడుబ్రోలు

చాలా రోజులుగా పురపాలిక అధికారులు సరఫరా చేసే మంచినీరు రంగు మారి వస్తోంది. నీరు తాగితే  వ్యాధుల బారిన పడతామని భయమేస్తోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నీటిని కొనుగోలు చేసి తాగుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని