logo

‘పేదకు నరకం’.. లేదే కనికరం..

రాజేష్‌, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం.

Published : 04 May 2024 05:31 IST

సీటీ స్కాన్‌కు ఫీట్లు తప్పవా
స్ట్రెచర్‌పై 400 మీటర్లు తోసుకెళ్లాల్సిందేనా..

ఎండలో తీసుకొస్తున్నాం: రాజేష్‌, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. ఆయనకు సీటీ స్కాన్‌ కోసం వార్డు నుంచిదూరంగా ఉన్న నాట్కోలోని సీటీ స్కానింగ్‌ కేంద్రానికి స్ట్రెచర్‌పై ఎండలో తరలించాల్సి వచ్చింది. ఎండకు తాళలేక ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడే స్కానింగ్‌ యంత్రం ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఇంత దూరం ఎండలో తరలించడం కష్టంగా ఉంది. రోగులు కూడా నలిగిపోతున్నారు.

జగన్‌ జమానాలో...

‘జగన్‌ ప్రభుత్వం వచ్చాక పేదల ఆరోగ్యం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆసుపత్రుల్లో వైద్య సేవలన్నీ మెరుగుపర్చాం. సర్వజనాసుపత్రిలో వైద్య సేవలకు కావాల్సివన్నీ కల్పించాం. అవసరమైన పరికరాలన్నీ సమకూర్చాం. సిబ్బందిని నియమిస్తున్నాం. ఇంకా కావాలంటే మరింత మందిని ఏర్పాటు చేస్తాం’.. ఇదీ వైద్యారోగ్య శాఖ మంత్రి రజిని ప్రసంగాల్లో ఊదరగొట్టే మాటలు. ఇప్పుడు ఈమె సర్వజనాసుపత్రి ఉన్న గుంటూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈసారి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

వాస్తవం ఇదీ...

ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి గుంటూరు సర్వజనాసుపత్రిలో సీటీ స్కాన్‌ చేయించాలంటే ఫీట్లు చేయక తప్పడంలేదు. ట్రామాకేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ పరికరం మరమ్మతులకు గురైంది. అది ఎప్పుడు బాగు చేయిస్తారో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. దీంతో స్కాన్‌ కోసం రోగులందరినీ నాట్కో క్యాన్సర్‌ కేంద్రం వద్ద చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అత్యవసర విభాగం నుంచి సుదూరంగా ఉన్న నాట్కో క్యాన్సర్‌ కేంద్రం వద్దకు రోగులను సహాయకులే తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ఎండ తీవ్రత ఉన్నా గతుకుల రహదారిపై అటూఇటూ తిప్పుతున్నారు.

8 నెలల్లో 23,381 మందికి పాట్లు

సర్వజనాసుపత్రికి అత్యవసర విభాగానికి నిత్యం వేలల్లో వస్తుంటారు. స్కానింగ్‌ అవసరమయ్యే వారు నిత్యం 80 నుంచి 150 మంది వరకు ఉంటారు. ట్రామ్‌కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ పరికరం మరమ్మతులకు గురవడంతో వీరంతా సీటీ సిమ్యులేటర్‌ యంత్రం వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇది నాట్కో క్యాన్సర్‌ కేంద్రంలో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి సుమారు 400 మీటర్లు దూరం ఉంటుంది. ప్రతి రోగిని అక్కడి నుంచి స్ట్రెచర్‌పై అంత దూరం ఎండలో తరలించాల్సి రావడమే ఇక్కడ పెద్ద సమస్య. ప్రతి నెలా స్కానింగ్‌ చేయించుకుంటున్న రోగులు సుమారు 3 వేల మంది ఉంటున్నారు. గత 8 నెలల్లో 23,381 మంది రోగులు స్కానింగ్‌కు తిరిగారు.

కొత్త పరికరం వచ్చేదెప్పుడో?

నాలుగేళ్ల నుంచి పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం రెండు నెలల కిందట సీటీస్కాన్‌ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పరికరం బిగించేందుకు అవసరమైన సివిల్‌ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తవగానే మరో నెల రోజుల్లో కొత్త పరికరం వస్తుందని అధికారులు తెలుపుతున్నారు. పాత పరికరం మరమ్మతులకు నిధులు విడుదల చేసినందున, ఇది కూడా త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

సీటీ సిమ్యూలేటర్‌తో స్కానింగ్‌

క్యాన్సర్‌ గడ్డ పరిమాణం ఎంత? ఏ మేరకు రేడియోథెరపీ ఇవ్వాలి తదితర పరీక్షలు చేసేందుకు సీటీ సిమ్యూలేటర్‌ యంత్రాన్ని వినియోగిస్తారు. ఈ పరికరం సాయంతోనే ప్రస్తుతం క్షతగాత్రులకు, ఇతర అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి స్కాన్లు తీస్తున్నారు. దీని ఆధారంగా వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేమని వైద్యులు తెలుపుతున్నారు. ఈ పరికరాన్ని ఒకేరోజు ఎక్కువ మందికి వినియోగిస్తే అది కూడా పాడైపోతుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరుగు రోగుల విభాగానికి వస్తున్న వారికి సీటీ స్కాన్‌ చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నప్పటికీ వారికి అవకాశం రావడానికి చాలా రోజుల గడువు పడుతోంది. రోగులకు ఆ పరీక్ష పూర్తయితేనే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించడానికి వీలవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో కొంతమంది తమ సొంత ఖర్చులతో బయట ఆ పరీక్ష చేయించుకుని తిరిగి సర్వజనాసుపత్రికి వచ్చి వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు.

సకాలంలో చెల్లించనందునే..

సీటీ స్కాన్‌ పరికరం తయారీదారుడితో నిర్వహణ కోసం ఏటా ముందస్తుగానే ఒప్పందం చేసుకుని అందుకు అవసరమయ్యే మొత్తం చెల్లించాలి. ఆ ఏడాదిలో ఎన్నిసార్లు ఆ పరికరం పాడైనా ఆ కంపెనీ నిపుణులే బాగు చేస్తారు. అంతేగాకుండా ఏదైనా ఉప పరికరాలు అవసరమైనా పైసా చెల్లించకుండా బిగిస్తారు. ఆ గడువు ముగిసినప్పటికీ నిర్వహణ ఛార్జీలు చెల్లించనందునే ఆ పరికరం బాగు చేసేందుకు తయారీదారు కార్యాలయం నుంచి ఎవరూ రావడంలేదని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని