logo

సూపర్‌-6తో అపూర్వ ప్రగతి

వైకాపా అయిదేళ్ల పాలనలో అన్నిరంగాలు, వర్గాల ప్రజలు దగా పడ్డారు. దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, హత్యలు, అరాచకాలు అడ్డులేకుండా పోయాయి. ప్రగతి కనుచూపు మేరలో కానరాలేదు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

Published : 05 May 2024 05:45 IST

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ ఏప్రిల్‌ నుంచే రూ.4 వేలు పింఛను
ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు
యువతకు 20 లక్షల ఉద్యోగాలు
‘న్యూస్‌టుడే’తో కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌
న్యూస్‌టుడే, పొన్నూరు

వైకాపా అయిదేళ్ల పాలనలో అన్నిరంగాలు, వర్గాల ప్రజలు దగా పడ్డారు. దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, హత్యలు, అరాచకాలు అడ్డులేకుండా పోయాయి. ప్రగతి కనుచూపు మేరలో కానరాలేదు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తాం’అని కూటమి పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ పేద ప్రజలపై మోయలేని భారాన్ని మోపారన్నారు. వైకాపా పాలనలో పట్టించుకోని ప్రతి సమస్యకు పరిష్కరం చూపుతామని వెల్లడించారు. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. సూపర్‌-6 పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ.. వారి అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల ద్వారా రూ.56 కోట్ల లబ్ధి

మేము డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణ సౌకర్యం కల్పించి స్వయం ఉపాధికి ప్రోత్సాహకాలు అందించి వారి అభివృద్ధికి బాటలు వేస్తాం.

  • బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 అందజేస్తాం. ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అందుతాయి.
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
  • నియోజకవర్గంలో 74,500 కుటుంబాలు ఉన్నాయి. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వల్ల రూ.56 కోట్లు లబ్ధి చేకురుతుంది.
  • 19-59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తాం. నియోజకవర్గంలో 19 ఏళ్ల వయసున్న మహిళలు 1,18,116 మంది ఉన్నారు. ప్రతి నెలకు రూ.17.71 లక్షలు మహిళల ఖాతాలో జమవుతాయి.

విద్యుత్తు ఛార్జీలు పెంచం

వైకాపా పాలనలో సామాన్య, మధ్య, పేద ప్రజలపై దేశంలో ఎక్కడ లేని విధంగా పన్నుల భారం మోపారు. కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు ధరలను తగ్గించకపోవడంతో రవాణా ఖర్చుల భారం కావడంతో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి.

  • తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అయిదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్తు ఛార్జులు పెంచలేదు. జగన్‌ పాలలో ఏడు సార్లు విద్యుత్తు ఛార్జీల పెంచారు.
  • కూటమి అధికారంలోకి రాగానే వైకాపా పాలనలో అవకతవకలు జరిగిన విద్యుత్తు ప్రాజెక్టులపై విచారణ చేయించి వాస్తవాలను వెలుగులోకి తెస్తాం.
  • పొన్నూరు నియోజకవర్గంలో 55 వేల విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. 2019-24 వరకు వైకాపా ప్రభుత్వ కాలంలో పెరిగిన ఛార్జిల వల్ల నియోజకవర్గ ప్రజలపై రూ.33 కోట్లు అదనపు భారం పడింది. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకుంటా.

రూ. 60 కోట్లు రైతుల ఖాతాలో జమవుతాయి

వైకాపా ఐదేళ్ల పాలనలో రాయితీపై ఒక్క వ్యవసాయ పరికరం  పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల చట్టం-2022 ప్రజల పాలిట యమపాశంగా మారింది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ చట్టా న్ని మొదటి నుంచి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. కూటమి అధికారంలోకి రాగానే భూమి హక్కుల చట్టాన్ని రద్దు చేసి రైతులకు అండగా ఉంటాం. బీ నియోజకవర్గంలో 30 వేల మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. అందుకు గాను రూ.60 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తాం. బీ రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కష్ట కాలంలో ఉన్న అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.

రూ.1.5 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌

సీఎం జగన్‌ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని బడాయి మాటలు చెప్పాడు. కానీ వారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు చేసి వారి అవసరాలను తీర్చే ప్రక్రియలో క్రియశీలక పాత్ర పొషించింది. ఆయా సామాజిక వర్గాలను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అణిచివేశారు. బీ 2014-19లో మా నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్సీ కాలనీల్లో రూ.6 కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులు చేశా. కూటమి అధికారంలోకి రాగానే బీసీ సబ్‌ప్లాన్‌ కింద అయిదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల రాష్ట్రంలో ఖర్చు చేస్తాం. బీ బీసీలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ చేస్తాం. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం కేటాయిస్తాం.

ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు

జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరవాత ఉద్యోగులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రతి నెల 1వ తేదీకి జీతాలు అందక పింఛనుదారులు, ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని సీఎం అమలు చేయడంలో విఫలం చెందారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాం. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచాం. బీ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.

చివర భూములకు సాగు నీరు అందిస్తా

పొన్నూరు నియోజకవర్గంలో ములుకుదురు-1 ములుకుదురు-2, నండూరు, నిడుబ్రోలు, మన్నవ, వడ్డిముక్కల ప్రాంతాల్లో ఎత్తిపోతల పథక నిర్మాణ పనులకు గతంలో రూ.72 కోట్లు నిధులు కేటాయించి చాలా పనులు చేశాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత వాటిని పట్టించుకోకపోవడంతో చివర భూములకు సాగు నీరు అందక రైతులు ఈ ఏడాది రూ.10 కోట్లుకు పైగా నష్టపోయారు. వైకాపా ప్రభుత్వం రైతులను మోసం చేసింది. మే అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి చివర భూములకు సాగు నీరు అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటా.

ప్రజలకు అందుబాటులో ఉంటా

నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండి.. ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా తగు ప్రణాళిక రూపొందించా. మంచినీటి సమస్యను పరిష్కరిస్తా. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎక్కువ నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలో ప్రతి సమస్యకు పరిష్కరం చూపుతా. అభివృద్ధి పనులను వేగవంతం చేసే విధంగా చూస్తా. వైకాపా పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదు. వైకాపా నేతలు కక్ష కట్టి కావాలని కొంత మంది సంక్షేమ పథకాలను తొలగించారు. రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడతా.

నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. విశాఖలో పలు బహుళజాతి కంపెనీలను ఖాళీ చేయించారు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందించలేదు. గతంలో స్పిన్నింగ్‌ మిల్లు హబ్‌గా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం మిల్లులు మూతపడ్డాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీలపై దాడులు చేయించి అనేక ఇబ్బందులు పెట్టారు.

  • కూటమి అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తగు ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి అందజేస్తాం.
  • నియోజకవర్గంలో 20 వేలు మందికి పైగా ఉన్న నిరుద్యోగులకు రూ.6 కోట్ల వారి ఖాతాలో జమ అవుతుంది.

31,173 పింఛనుదారులకు మేలు

తెదేపాకు అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్లు లాంటివి. నియోజకవర్గంలో 2014-19 కాలంలో రూ.2,500 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టా. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు రూ.200 నుంచి ఒక్కసారిగా రూ. 2 వేలకు సామాజక పింఛను పెంచారు.

  • సామాన్యుడి జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4వేలు చొప్పున పింఛను ఇస్తాం. నియోజకవర్గంలో 31,173 మంది పింఛనుదారులకు నెలకు రూ.3.11 కోట్లు జమ చేస్తారు. నియోజకవర్గంలో 5 వేలు మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి రూ.3 వేలు నుంచి రూ.6 వేలు పెంచారు. నియోజకవర్గంలో ప్రతినెల రూ.1.50 కోట్లు అదనంగా వారి ఖాతాలో జమ అవుతాయి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే, కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10 వేలు పింఛను ఇస్తాం.

50 మసీదుల్లోని ఇమామ్‌, మౌజన్‌లకు సాయం

తెదేపా హయాంలో ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టి రాజకీయాలకు అతీతంగా పంపిణీ చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వారికి తగిన ప్రాధాన్యం కల్పించలేదు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. బీ మైనార్టీల కార్పొరేషన్‌ ద్వారా ముస్లింలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ. లక్ష సాయం చేస్తాం.

నియోజకవర్గంలో 50కు పైగా మసీదులు ఉన్నాయి. ప్రతి నెల ఇమామ్‌లకు రూ.10 వేలు చొప్పున రూ.5 లక్షలు అందిస్తాం. మౌజన్‌లకు ప్రతి నెల రూ. 5వేలు చొప్పున రూ.2.50 లక్షలు వారి ఖాతాలో జమ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని