logo

ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మిన్నకుండిపోయారు

Published : 05 May 2024 05:48 IST

ఐతానగర్‌లో అరాచకాలను అడ్డుకోలేకపోయారు
మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
తెనాలి ఎమ్మెల్యేకు న్యాయవాది మాధవరావు బహిరంగ లేఖ

నన్నపనేని మాధవరావు

తెనాలిటౌన్‌, న్యూస్‌టుడే: తెనాలి పట్టణ ఐతానగర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది ‘నన్నపనేని మాధవరావు’ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు బహిరంగ లేఖ రాశారు. దాని ప్రతిని శనివారం విడుదల చేశారు. ‘ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే    మీరు మిన్నకుండిపోయారు. రాజధాని రైతుల పాదయాత్రను మీ ఇల్లు ఉందన్న కారణంగా ఐతానగర్‌ మీదుగా రానివ్వకపోవడాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. రాజధాని మార్చకూడదంటూ మహిళలందరూ కొబ్బరికాయలు కొట్టడానికి స్థానిక పేరంటాళ్లమ్మ గుడి వద్దకు వస్తే పోలీసులు నెట్టివేశారు. ఆ సమయంలోనూ మీ సాయం అందలేదు. ఘన కీర్తి ఉన్న ఐతానగర్‌ రౌడీయిజానికి కేంద్రంగా మారింది. రోడ్ల వెంబడి అక్రమ కట్టడాలు వెలిశాయి. మున్సిపల్‌ స్థలాలనూ ఆక్రమించారు. మహనీయుల విగ్రహాలు కనిపించకుండా రేకుల షెడ్లు వేశారు. పాఠశాల కేంద్రంగా అడ్డగోలు సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అప్పుడప్పుడూ కింది స్థాయి వారిపై కేసులే తప్ప అసలు వారిని గుర్తించనూ లేదు. కొద్ది రోజుల క్రితం ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టారు. ప్రశ్నించిన వారిపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో మా ప్రాంత వాసిగా ఇక్కడి వారంతా మీకు మద్దతు ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మీరు ఈ ప్రాంతంలో కొత్తగా మొదలైన దారుణాలను అడ్డుకోలేకపోయారు. మాకు భరోసా ఇవ్వలేక పోయారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో అరాచక శక్తుల దారుణాలపై త్వరలో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నాం. మీ తండ్రి గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మీరు కూడా ఆ విధంగా మా మనసులో నిలవాలంటే కనీసం ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఈ నెల 13న ఎన్నికల రోజు కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఓటు అనే ఆయుధంతో మార్పును సాధించుకుంటాం.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని