logo

సీలు వేశాం.. కానీ ఊడిపోయింది..!

Published : 05 May 2024 05:49 IST

‘గృహ ఓటింగ్‌’లో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం
బ్యాలట్‌ బాక్సుకు సీలు వేయని వైనం

తహసీల్దారు శ్రీనివాసులు, సిబ్బందిని నిలదీస్తున్న తెదేపా నాయకులు, గ్రామస్థులు

లేమల్లెపాడు(వట్టిచెరుకూరు), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ‘గృహ ఓటింగ్‌’ ప్రక్రియ నిర్వహణలో ఎన్నికల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడులో శనివారం ‘గృహ ఓటింగ్‌’ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బంది బ్యాలట్‌ బాక్స్‌కు సీలు వేయకపోవడం  విమర్శలకు తావిచ్చింది. గ్రామానికి చెందిన మద్దినేని సింగయ్యతో ఓటు వేయించేందుకు మధ్యాహ్నం  సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో బ్యాలట్‌ బాక్స్‌కు సీలు లేకపోవడాన్ని గమనించిన తెదేపా ఏజెంట్లు అధికారులను నిలదీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలింగ్‌ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. సాయంత్రం ఆర్‌వో శ్రీకర్‌, తహసీల్దారు శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని సీలు వేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. తొలుత సీలు వేశామని.. అది ఊడిపోయిందని వివరణ ఇచ్చారు. అనంతరం బ్యాలట్‌ బాక్స్‌కు సీలు వేసిన తర్వాత   ఓటింగ్‌ మళ్లీ మొదలైంది. మేనల్లుడు బొమ్మినేని భాస్కరరావు సాయంతో సింగయ్య  ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని అనంతవరప్పాడులో ఏడు, లేమల్లెపాడులో ఐదు ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు.

సీలు వేస్తున్న సిబ్బంది

అభ్యర్థుల అభ్యంతరం: ఇంటి నుంచి ఓటరు సేకరణ ప్రక్రియలో అధికారులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ల రామాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌ని శనివారం కలిసి కనీసం ఓట్లను సేకరిస్తున్న బాక్సులకు సీల్‌ వేయలేదని వివరించారు. లేమల్లెపాడు ఘటనపై అధికారులను నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ కోరారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని