logo

చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి

‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్‌కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్‌ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

Published : 05 May 2024 06:13 IST

మంగళగిరి నా సొంత ఊరు.. లోకేశ్‌ గెలుపు తథ్యం: బ్రాహ్మణి 

ప్రచార రథం పైనుంచి అభివాదం చేస్తూ..

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్‌కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్‌ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరిలో శనివారం రోడ్‌ షో అనంతరం ఆమె నరసింహస్వామి ఆలయ సవమీపంలోని టిఫిన్‌ బండి వద్ద అల్పాహారం తీసుకన్నారు. బండి నిర్వాహకుడు శేఖర్‌ను ప్రశంసించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన వారికి ఆయన అండగా ఉంటారన్నారు. లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడి వారిని కుటుంబ సభ్యుల్లా భావించి సొంత నిధులతో సేవలందిస్తున్నారని, ప్రత్యేక విజన్‌తో మంగళగిరి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారన్నారు. రోడ్‌షోలో వెల్లువెత్తిన అభిమానం చూస్తోంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా చంద్రబాబును సీఎంని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు లోకేశ్‌ సంకల్పించారని, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అండగా నిలుస్తారన్నారు. ప్రజాప్రభుత్వం రాగానే మంగళగిరి రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

టిఫిన్‌ బండి వద్ద అల్పాహారం తీసుకుంటూ..

రోడ్‌షోకు బ్రహ్మరథం.. తెదేపా యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి బ్రాహ్మణి శనివారం మంగళగిరి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఆమెకు మంగళగిరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టారు.  ‘జై లోకేశ్‌ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. గౌతమ బుద్ధా రోడ్డు నుంచి పాదయాత్రగా కాలినడకన బయలుదేరిన ఆమె మిద్ది సెంటర్‌ నుంచి ప్రధాన వీధికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భవనాలపై నుంచి పూలు చల్లుతూ మహిళలు, యువతులు అభిమానం చాటుకున్నారు. రైతులు రెండెడ్ల బళ్లతో నడవగా.. యువత నృత్యాలు, డీజే సౌండ్లతో సందడి చేశారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మీ, ఊట్ల దుర్గామల్లేశ్వరి, తెదేపా మంగళగిరి పట్టణ, గ్రామీణ అధ్యక్షులు దామర్ల రాజు, తోటా పార్థసారథిÅ, బాలాజీ గుప్తా, గోవాడ దుర్గారావు పాల్గొన్నారు.

ర్యాలీలో జనసందోహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని