logo

బాధ్యత మరిచారు.. భ్రష్టు పట్టించారు!

పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్‌ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్‌ పక్కనే గంజాయి బ్యాచ్‌లు చెలరేగుతున్నా జగన్‌ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు.

Updated : 05 May 2024 06:45 IST

గంజాయి బ్యాచ్‌ల అరాచకాలు
రోడ్డెక్కుతున్న జనం
తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కిమ్మనని సీఎం జగన్‌
గంజాయి @ గుంటూరు జిల్లా
న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు

గంజాయి, హుక్కా తయారీ సామగ్రి

పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్‌ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్‌ పక్కనే గంజాయి బ్యాచ్‌లు చెలరేగుతున్నా జగన్‌ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు. సాక్షాత్తూ సీఎం ఇంటి వద్దే గంజాయితో తిరుగుతుంటే జనాలే ఇద్దరు యువకులను పట్టుకుని తాళ్లతో కట్టేసి అప్పగించాల్సి వచ్చింది. వైకాపా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే వీటి అమ్మకాలు సాగుతుంటే కడుపు రగిలిపోయిన మహిళలు గుంటూరులో పిల్లాపాపలతో కలిసి వచ్చి నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. మాజీ హోంమంత్రి ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో గంజాయి ఆగడాలు పెచ్చుమీరడంపై ఆందోళనతో ఓ మహిళ ఏకంగా తన బొటన వేలునే తెగనరుక్కుని నిరసన తెలపడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.

ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేల కంటే అధికంగా తీసుకెళ్తున్నవారి నగదు జప్తు చేస్తున్నారు. అలాంటిది వేల కిలోల గంజాయి గుంటూరుకు రవాణా జరిగిందంటే ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా జిల్లాలోకి ప్రవేశించదనే అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరుకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పటి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఓ గంజాయి, మత్తుపదార్థాల ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కొద్ది నెలల కిందట లాలాపేట పోలీసులు ఓ గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ ముఠాలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ప్రధాన సూత్రదారుడిగా తేలడంతో కేసు మాఫీకి ప్రయత్నించి రూ.లక్షలు ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణతో ఓ సీఐను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో గంజాయి పట్టుబడిన సందర్భాల్లో సదరు ప్రజాప్రతినిధి తనయుడి ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

ఇలా చిన్నపొట్లాలుగా చేసి అమ్మకాలు

ఎక్కడెక్కడ సమస్య...

గుంటూరు నగరంలోని మణిపురం బ్రిడ్జి సమీపంలో, నగరంపాలెం, నెహ్రూనగర్‌, శారదాకాలనీ, సంజీవనగర్‌, న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ వద్ద, ఏటుకూరురోడ్డు, ఎస్‌వీఎన్‌కాలనీ, పట్టాభిపురం, శ్రీనివాసరావుపేట, అరండల్‌పేట, బృందావన్‌ గార్డెన్స్‌ ఇలా అనేక ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు కొనసాగుతున్నాయి.

ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం

జిల్లాలోని గుంటూరు నగరం సహా అనేక ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానిక మహిళలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు. తమ ప్రాంతంలో గంజాయి తాగి రౌడీయిజం చేస్తున్నారని, మహిళలను వేధిస్తున్నారంటూ వెంగళాయపాలెంకు చెందిన పలువురు మహిళలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట పడకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

మూడేళ్ల గణాంకాలు...

గంజాయి రవాణా కేసులు 322
అరెస్టయిన నిందితులు 727
సీజ్‌ చేసిన గంజాయి 4577 కిలోలు

గంజాయి బ్యాచ్‌ ఆగడాలపై పోలీసులను ప్రశ్నిస్తున్న స్థానిక మహిళలు (పాతచిత్రం)


2024 ఏప్రిల్‌ 21..

ప్రత్తిపాడు

చికిత్స పొందుతున్న లక్ష్మి

గుంటూరు నగరం స్వర్ణభారతినగర్‌లో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అనుచరుల భూకబ్జాలు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో లక్ష్మి అనే మహిళ విసిగిపోయింది. మహిళా సంఘం సభ్యులతో కలిసి మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ పట్టించుకుంటారో లేదోనని ఏకంగా ఆమె తన బొటన వేలును నరుక్కుని దేశం దృష్టికి సమస్యను తెచ్చారు.

ఎమ్మెల్యే ఏం చేశారు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గతంలో రెండేళ్లు హోంమంత్రిగా పని చేశారు. పోలీసుశాఖ తన గుప్పిట్లో ఉన్నా స్థానికంగా గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు అరికట్టలేకపోయారు. పైపెచ్చు ఆమె అనుచరులపైనే ఆరోపణలతో ఓ మహిళ నిరశన దీక్షకు దిగడం గమనార్హం.


మంగళగిరి

2024 ఏప్రిల్‌ 21... తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోని నవోదయకాలనీలో ఇద్దరు యువకులు గంజాయితో అనుమానాస్పదంగా సంచరించారు. దీంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి తాళ్లతో కట్టేశారు.అనంతరం పోలీసులను పిలిచి అప్పగించారు. యువకుల వద్ద 900 గ్రాముల గంజాయి లభించింది.ఏకంగా సీఎం నివాసం వద్దే గంజాయితో తిరుగుతున్నా పట్టించుకోలేదంటే పోలీసులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ ఆళ్ల తీరు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంజాయి స్థానికంగా గుప్పుమంటున్నా అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.తరచూ తాడేపల్లి పరిసరాల్లో గంజాయి దొరుకుతోంది.


తెనాలి

ఆంధ్రా ప్యారిస్‌ తెనాలిలో గంజాయి విక్రయాలు, వినియోగం ఆందోళన కలిగించే పరిణామం. గతంలో పట్టణ రైల్వేస్టేషన్‌ రోడ్డులో గంజాయి బ్యాచ్‌ ఉంటారన్న ప్రచారం మాత్రమే ఉండేది. ఇప్పుడు పట్టణంలోని అన్ని ప్రాంతాలు, మండలంలోని గ్రామాల్లోనూ ఇది దొరుకుతోంది. కొత్తగా యువత, విద్యార్థులు సైతం అలవాటు పడుతుండడం తల్లిదండ్రుల్లో కలవరం రేపుతోంది. తెనాలి పట్టణంలోని ఐతానగర్‌, చినరావూరు, ముత్తంశెట్టివారిపాలెం, కబేళారోడ్డు, చెంచెపేట, మారీసుపేట, ఆర్‌ఆర్‌నగర్‌, సుల్తానాబాద్‌, బుర్రిపాలెంరోడ్డు, స్టేషన్‌రోడ్డు, బస్టాండు రోడ్డులో విక్రయాలు సాగుతున్నాయి.

పేరులో అన్నా.. తీరులో సున్నా: తెనాలిలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఎప్పుడూ స్పందించలేదు. గంజాయి విక్రయాల కట్టడికి పోలీసులపై ఒత్తిడి చేయలేదు.


2024 ఏప్రిల్‌ 26..

గుంటూరు తూర్పు

రాజీవ్‌గాంధీనగర్‌ పదో వీధిలో పగలు, రాత్రి తేడా లేకుండా గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. గంజాయి తాగి వచ్చి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అదేమని ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్నారు. చీకటి పడితే మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. తమ గోడును ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరిఫాతిమా వద్ద వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహంతో పిల్లలు, పెద్దలు, మహిళలు రోడ్లపైకి వచ్చి రాత్రివేళ ఆందోళన చేశారు. అక్కడ పరిస్థితి తీవ్రతకు వారి ఆగ్రహం అద్దం పడుతోంది.

తీరే వేరు: గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా తీరు ఆరోపణలు వస్తున్నా ఉలకరు, పలకరు.


పొన్నూరు

చేబ్రోలులోని కొమ్మమూరు కాలువ వద్ద మూడు నెలల కిందట ఓ మైనర్‌ బాలుడు, ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 2కిలోల గంజాయి పట్టుకున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలే లక్ష్యంగా వీటిని విక్రయిస్తున్నారు. గంజాయి సిగరెట్‌ రూ.50కి అమ్ముతున్నారు. ఓ బాధిత యువకుడి తల్లి గంజాయి విక్రయించే వైకాపా నేతపై ఏకంగా దుమ్మెత్తిపోసి శాపనార్థాలు పెట్టింది. ఆరు నెలల కిందట ఆరేళ్ల బాలుడిపై వైకాపా కార్యకర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కనిపించలేదా కిలారి: పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఏనాడూ ఈ అరాచకాలపై స్పందించలేదు.


గుంటూరు పశ్చిమ

2023 మార్చి 1... ఇద్దరు యువకులు గంజాయి మత్తులో అర్ధరాత్రి వేళ నగరంలో చెలరేగిపోయారు. డబ్బుల కోసం కనిపించిన వారిపై దాడి చేశారు. అరండల్‌పేట, అమరావతి రోడ్‌లో దుకాణాల వద్ద కాపలాదారులైన ఇద్దరు వృద్ధులను తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. పశ్చిమలో ఇప్పటికీ గంజాయి విక్రయాలు ఆగలే.

అరాచకాలు మరిచిన మద్దాళి: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దాళి గిరిధర్‌ ఉన్నారు. అభివృద్ధి పేరుచెప్పి తెదేపా నుంచి వైకాపాలో చేరారు. తన నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతున్నా కిమ్మనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని