logo

తెదేపా కార్యకర్తలపై వైకాపా రాళ్ల దాడి

మాచర్లలో వైకాపా మూక మరోసారి రెచ్చిపోయింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగింది.

Published : 06 May 2024 04:52 IST

గాయపడిన తెదేపా సానుభూతిపరులు

మాచర్ల గ్రామీణ: మాచర్లలో వైకాపా మూక మరోసారి రెచ్చిపోయింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగింది. ఆదివారం ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న తెదేపా కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాళ్లతో దాడులకు తెగబడ్డారు. మాచర్ల పట్టణం 13వ వార్డులో కూటమి తరఫున స్థానిక తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. అదే వార్డులో కొందరు వైకాపా నాయకులు జెండాలు పట్టుకుని పార్టీ నినాదాలు చేస్తూ తెదేపా ప్రచారానికి అడ్డొస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తెదేపా నేతలు పోలీసులకు సమాచారం అందించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని చెప్పినా పోలీసులు ఘటనాస్థలికి చేరుకోలేదు. అంతలో తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ వైకాపా కార్యకర్తలు నలుగురు రాళ్లతో తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో కేశవ్‌, వెంకటరమణ గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తెదేపా కార్యకర్తలు ర్యాలీగా దాడి చేసిన వైకాపా నాయకుల ఇళ్ల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ పల్లపురాజు సర్దిచెప్పి పంపించేశారు.  


మరో ఘటనలో కానిస్టేబుల్‌పై..

గాయపడిన సాంబనాయక్‌

మాచర్లగ్రామీణ, న్యూస్‌టుడే: వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసి గాయపర్చిన ఘటన మాచర్ల మండలం అలుగురాజుపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. అలుగురాజుపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వివాదం జరుగుతుందని సమాచారం రావడంతో విజయపురిసౌత్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సాంబనాయక్‌ అక్కడికి వెళ్లాడు. వివాదం సద్దుమణిగిన తర్వాత తిరిగివస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేసి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని