logo

8 వరకు పోస్టల్‌ బ్యాలట్‌కు అవకాశం

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.

Published : 06 May 2024 04:57 IST

వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, పక్కన ఎస్పీ తుషార్‌ డూడీ

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. 5, 6 తేదీల్లో పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చి పోస్టల్‌ బ్యాలట్‌ వేసేందుకు అవకాశమిస్తామన్నారు. ఓపీవో, ఇతర పోలింగ్‌ అధికారులు, పోలీసులు అంతా 7, 8 తేదీల్లో వినియోగించుకోవచ్చన్నారు. 5, 6 తేదీల్లో వినియోగించుకోలేని వారు 8న వేయొచ్చన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు ఉండి.. సరైన సమయంలో బ్యాలట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేని వారు కూడా ఓటు ఉన్న నియోజకవర్గానికి వెళ్లి ఫారం 12 సమర్పించి వేయొచ్చన్నారు. జిల్లా నుంచి వేర్వేరు జిల్లాలకు 5,868 మంది, ఇతర జిల్లాల నుంచి గుంటూరు జిల్లాలో ఓటు వేసేందుకు 5,092 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందవద్దన్నారు. పార్లమెంట్‌తో పాటు మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలకు అవసరమైన ఈవీఎంలను సీఈవో ఆదేశాలతో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి పరిశీలించి ర్యాండమైజేషన్‌ ద్వారా ఆయా నియోజకవర్గాలకు పంపామన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లుండగా.. ఇప్పటి వరకు 9.50 లక్షల మందికి ఓటరు స్లిప్పులు అందించామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కమిషనింగ్‌ పూర్తయిందని, పార్లమెంట్‌కు సంబంధించి ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. వీటిని 12న పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల విధుల్లో ఉండే వారికి అప్పగిస్తామని చెప్పారు. వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, షామియానాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గానికి స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ సెంటర్లను ఏఎన్‌యూలో ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ అనంతరం రిసెప్షన్‌ సెంటర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయం కంటే మూడింతలు ఎక్కువగా మద్యం, నగదు జప్తు చేశామన్నారు. సాయుధ పోలీసు కవాతు, నైట్‌ పెట్రోలింగ్‌, నాకాబందీ వంటి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని