logo

సీపీఎస్‌ రద్దని నమ్మించి ఉద్యోగులను మోసం చేసి..

2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్‌ ఉద్యోగులతో ఊరూరా దండలు వేయించుకుని వారికి ముద్దులుపెట్టి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పింఛను స్కీంను (ఓపీఎస్‌) తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

Updated : 06 May 2024 06:39 IST

అన్ని విధాలా నష్టపరిచిన జగన్‌
జీపీఎస్‌ బలవంతంగా అమలుతో ఆగ్రహం

పింఛను లేకపోతే ఉద్యోగులు ఎలా బతుకుతారు. మేం   అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాం. ఓపీఎస్‌ను అమలు పరుస్తాం.

విపక్షనేతగా పాదయాత్రలో జగన్‌ సీపీఎస్‌ ఉద్యోగులకిచ్చిన హామీ ఇదీ.

ఈనాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, క్రోసూరు

2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్‌ ఉద్యోగులతో ఊరూరా దండలు వేయించుకుని వారికి ముద్దులుపెట్టి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పింఛను స్కీంను (ఓపీఎస్‌) తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లేసి అందలమెక్కించారు. తర్వాత ఆయన స్వరూపం ఏంటో చూపించారు. అయిదేళ్లయినా సీపీఎస్‌ను రద్దు చేయలేదు. ఉద్యోగులు మరింత నష్టపోయేలా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా గ్యారెంటీ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) ఒకటి తెచ్చి బలవంతంగా వారినెత్తిన పెట్టారు. హామీ అమలు చేయని సీఎంకు తమ ప్రతాపం ఏంటో ఓటు ద్వారా చూపిస్తామని బాధ్యులైన ఉద్యోగులు అంటున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్లలో కలిపి సీపీఎస్‌ పరిధిలోకి ఉద్యోగ, ఉపాధ్యాయులు 30 వేల పైచిలుకు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ ఎందుకు రద్దు చేయలేదని ఉద్యోగ వర్గాలు జగన్‌ను ప్రశ్నిస్తున్నాయి.

నాడు తండ్రి.. నేడు తనయుడి చేతిలో..

2004 సెప్టెంబరు ఒకటి నుంచి కేంద్రం దీన్ని అమలు చేయటం ప్రారంభించింది. 2005లో రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దీనికి బీజం పడింది. 2004 సెప్టెంబరుకు ముందు నియామకమైన వారికే పాత పింఛన్‌ విధానం వర్తిస్తుందని ఆ తర్వాత నియమితులైన వారంతా సీపీఎస్‌ పరిధిలోకి వస్తారని నాడు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్‌ వద్దని వ్యతిరేకించినా నాడు రాజశేఖర్‌రెడ్డి మొండిగా ఉద్యోగుల అభిప్రాయానికి బిన్నంగా అమలుపరిచారు. ఈ రకమైన స్కీంను లాటిన్‌ అమెరికాలాంటి దేశాలు అమలు పరిచి నష్టపోయాయని రాష్ట్రంలో ఉద్యోగులు మొత్తుకున్నా వైఎస్‌ అమలుపరిచారు. అనంతర కాలంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగుల డిమాండ్లను గౌరవించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని వారికి ఊరట కలిగించారు. నాడు తండ్రి హయాంలో మోసపోతే కొంత చంద్రబాబు తమకు ఊరట కలిగించారన్నారు. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన వై.ఎస్‌ తనయుడు జగన్‌ చేతిలో పూర్తిగా మోసపోయామని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి ఆ తర్వాత దానిపై అవగాహన లేదని మాయమాటలతో మభ్యపెట్టి ఎన్నికలకు ముందు గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌) తీసుకొచ్చారు. దీనిలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువ ఉందని జిల్లా ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఉద్యోగులకు గ్యారెంటీ లేకపోయినా ప్రభుత్వానికి మాత్రం గ్యారెంటీ ఉంది. ఉద్యోగి చెల్లించే నిర్ధిష్టమైన వాటాకు ప్రభుత్వ వాటా జమ చేసినా చేయకపోయినా అడిగేపరిస్థితి లేదు. దాన్ని ప్రభుత్వం ఏ సంస్థలో పెట్టుబడి పెడుతుందో, సొంతానికి ఉపయోగించుకున్నా అడిగే పరిస్ధితి లేకుండా ఈ జీపీఎస్‌ విధివిధానాలు ఉన్నాయి. అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఏడాదిన్నర నుంచి ప్రభుత్వం తన వాటా జమ చేయటం లేదు. ఉద్యోగుల నుంచి మినహాయించుకున్నది ఇతర అవసరాలకు దారి మళ్లించుకుని ఉద్యోగులకు రిక్తహస్తం చూపిందని వాపోతున్నారు.

ముఖ ఆధారిత హాజరుతో..

తెదేపా హయాంలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు అమల్లోకి తెచ్చారు. క్షేత్ర ఉద్యోగులకు హాజరులో మినహాయింపు ఇచ్చారు. బయోమెట్రిక్‌ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని తెదేపా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతుందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాజరులో ఇబ్బందులు తొలగిస్తామని జగన్‌ పదేపదే చెప్పారు. నిజమని నమ్మిన ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ఈ అయిదేళ్లలో ప్రత్యక్ష నరకం చూపింది. బయోమెట్రిక్‌ కంటే కఠినతరమైన ముఖ ఆధారిత హాజరును అమల్లోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. 2022 ప్రారంభం నుంచే ముఖ ఆధారిత హాజరును ఉపాధ్యాయులకు వర్తింపజేశారు. మారుమూల గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులు అంతర్జాల సౌకర్యంలేక ఇబ్బందిపడుతున్నామనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా హాజరు ఉంటేనే వేతనం అనే హెచ్చరికలు చేశారు. 2022 నవంబరు నుంచి వైద్యఆరోగ్యశాఖతోపాటు అన్ని ప్రభుత్వశాఖల్లో ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేశారు. రోజుకు మూడుసార్లు ముఖ ఆధారిత హాజరు నమోదుచేస్తేనే ఆ రోజు విధులకు హాజరైనట్లుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు (పాత చిత్రం)

పింఛను, గ్రాట్యుటీ పొందలేక ఇబ్బందులు

జగన్‌ అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ను రద్దు చేయకపోగా దాని స్థానంలో జీపీఎస్‌ను తెరపైకి తీసుకురావడంతో రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు పింఛను, గ్రాట్యుటీని పొందలేక ఇబ్బంది పడుతున్నారు.  

గార్లపాటి సునీల్‌బాబు, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర కౌన్సిలర్‌


ఉద్యోగులకు తీరని అన్యాయం

ప్రతిఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఓపీఎస్‌ ఇస్తారని చివరిక్షణం వరకు ఎదురుచూశాం. కానీ మా  ఆశలు అడియాశలయ్యాయి. దీనిస్థానంలో తీసుకువచ్చిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌)తో ఉద్యోగులకు గ్యారెంటీ ఉండదని, ఓపీఎస్‌ తప్ప మరొకటి ఉద్యోగులు కోరుకోవటం లేదు.

పోలూరి పిచ్చియ్య, ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని