logo

పోరాట బాట.. గెలుపు బాసట

చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు..

Published : 07 May 2024 06:30 IST

ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. వెరవక..
ప్రజా సమస్యలపై ఐదేళ్లుగా నిత్యం ప్రజలతో మమేకం
ప్రత్యేకత చాటుతున్న రేపల్లె, పర్చూరు, అద్దంకి ఎమ్మెల్యేలు
ఈనాడు, బాపట్ల

చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. అధికార పార్టీ నేతలు వీరిని ఆర్థికంగా ఎంతో దెబ్బతీశారు.. ప్రజల తరఫున ఎంతో పోరాటం చేశారని ఇటీవల చీరాలలో జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెదేపా ఎమ్మెల్యేలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.. సభావేదికపై చంద్రబాబు ప్రస్తావించడంతో ఈ ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పోరుబాటపై ఆయా నియోజకవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఐదేళ్లుగా వారు ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు, బాధల్లో వెన్నంటి ఉండటంతో వారికి మంచి సానుకూలత వ్యక్తమవుతోంది. అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల మధ్యనే గడపటంతో మళ్లీ వీరు గెలవడం నల్లేరు మీద నడకేనన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో వైకాపా నుంచి పెద్దఎత్తున తెదేపాలో చేరారు. రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం.

అక్రమాలు అడ్డుకొని..

-జైత్రయాత్ర వైపు ఏలూరి

ర్చూరు బరిలో ఉన్న ఏలూరి సాంబశివరావు విపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 75 రోజుల పాదయాత్ర చేశారు. అప్పట్లో పోటీగా వైకాపా వాళ్లు పాదయాత్ర ప్రారంభించి వెంటనే ఆపేశారు. ప్రభుత్వం తరచూ గ్రానైట్‌ వ్యాపారులపై దాడులు చేస్తోంది. అది ప్రశ్నించినందుకు ఎమ్మెల్యేపై కేసులు పెట్టారు. అయినా వ్యాపారులకు ఆయన అండగా నిలిచి దాడులు లేకుండా గట్టిగా యంత్రాంగాన్ని నిలదీయటంతో గ్రానైట్‌ రంగంపై ఉపాధి పొందుతున్న వారు ఆయన వైపు సానుకూలత చూపుతున్నారు. నియోజకవర్గంలో అడ్డదారులు తొక్కి వైకాపా విజయం సాధించాలని కుట్రపూరితంగా 20 వేల ఓట్లు తొలగించాలని పన్నాగం పన్నగా దానిపై ఆయన గట్టి పోరాటం చేసి ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించకుండా అడ్డుకున్నారు. ఇది కూడా తెదేపాతో పాటు సాధారణ ఓటర్లలో బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇవన్నీ ఆయన గెలుపులో క్రియాశీలకం కాబోతున్నాయి.


అద్దంకిలో మళ్లీ పాగా

-దిశగా గొట్టిపాటి

ద్దంకి బరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఐదోసారి పోటీ చేస్తున్నారు. పార్టీ మారలేదనే ఉద్దేశంతో వైకాపా అధికారంలోకి రాగానే ఆయనకు చెందిన గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీల్ని కక్షపూరితంగా మూసివేయించి ఆర్థిక మూలాలను బాగా దెబ్బతీసింది. అలా చేస్తే తిరిగి పార్టీలోకి వస్తారని వైకాపా అగ్రనాయకత్వం భావించింది. వ్యాపార సంస్థలకు రూ.వందల కోట్ల పెనాల్టీలు విధించి ఆయన్ని ఆర్థికంగా నష్టపరిచింది. గడిచిన ఐదేళ్లలో ఆయన క్వారీలు, గ్రానైట్‌ పరిశ్రమలు మూతబడ్డాయి. రూ.కోట్ల విలువైన యంత్రాలు పాడైనా ఆయన మాత్రం బెదిరింపులకు తలొగ్గలేదు. ఎన్నుకున్న ప్రజలకు మోసం చేయలేనని ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని వీడకుండా కొనసాగడం తెదేపా శ్రేణుల్లో ఆయన పట్ల మంచి సానుకూలతకు కారణమవుతోంది. ప్రధానంగా అనారోగ్యంతో బాధపడేవారికి ఆసుపత్రిలో ప్రవేశం కల్పన నుంచి వారికి సీఎం సహాయ నిధి అందే వరకు వెన్నంటి నిలుస్తారు. దీంతో పేదలు ఎవరైనా అరోగ్య సేవలు అవసరరమైతే ఆయన్ని ఆశ్రయిస్తారు. గతంలో ఒంగోలులో మహానాడు నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించారు.


హ్యాట్రిక్కే లక్ష్యంగా అనగాని

రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్‌ వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెదేపా హయాంలో నియోజకవర్గానికి రూ.1650 కోట్లతో అభివృద్ధి చేశారు. ఒక్క రేపల్లె పట్టణంలోనే రూ.100 కోట్లకుపైగా నిధులు వెచ్చించి సిమెంటు రోడ్డు, మురుగు కాల్వలు నిర్మించి పట్టణంలో ప్రజలను పీడిస్తున్న పారిశుద్ధ్యం సమస్యకు పరిష్కారం చూపారు. వివాదరహితుడిగా పేరుంది. పిలిస్తే పలికే వ్యక్తిగా ఆపదలో ఉండి ఆయన వద్దకు సాయంకోరి వెళితే చేతనైన మేర ఆర్థిక సాయం చేసి పంపుతారు. ఇది ఆయనకు ప్రజల్లో బాగా మైలేజ్‌ తెచ్చిపెడుతోంది.  గతేడాది జరిగిన అమరనాథ్‌ గౌడ్‌ హత్యోదంతంలో నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే వరకు తాను ఆందోళన విరమించేది లేదని, అమరనాథ్‌ అంత్యక్రియలు జరగనీయనని స్పష్టం చేసి చెరుకుపల్లి సెంటర్‌లో ఐదారుగంటలకుపైగా ఆందోళన చేయటంతో ప్రజల్లో ఆయన పట్ల  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి అమరనాథ్‌గౌడ్‌ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, నివేశన స్థలం, అమరనాథ్‌ తల్లికి అంగన్‌వాడీ కొలువు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని