logo

పోస్టల్‌ బ్యాలట్‌లో..ప్రలోభాల పర్వం..

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు.

Published : 07 May 2024 06:52 IST

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ (గుంటూరు)

న్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. ఓటు వేసేందుకు వెళ్తున్నవారితో తమకు అవకాశమివ్వాలంటూ పీవో, ఏపీవోలతో మాట్లాడారు. కొందరు ఉద్యోగులు మీరెవరిని నిలదీస్తే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రం వద్దకు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రావడంపై ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పలువురు ఉద్యోగులు బ్యాలట్‌ వినియోగించుకునే క్రమంలో వైకాపాకు చెందిన వారు ఉద్యోగులతో మాట్లాడడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

ఉద్యోగులతో మాట కలిపిన ముస్తఫా

  • గుంటూరు తూర్పు నియోజకవర్గం ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏసీ కళాశాలలో ఎమ్మెల్యే ముస్తఫా అక్కడే ఉండి బ్యాలట్‌ వినియోగించుకుని బయటకు వచ్చిన ఉద్యోగులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వైపు వెళ్లకుండా మరోవైపు నుంచి వెళ్లిపోయారు. కొందరైతే తప్పించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నల్లపాడు లయోలా స్కూల్‌లో నిర్వహించిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పోస్టల్‌ బ్యాలట్‌ను మొదలుపెట్టారు. ఆదివారం రోజున పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోని కొందరు ఉద్యోగులు సోమవారం ఓటు వేశారు.

ఇబ్బందులు పడ్డాక సదుపాయాలు

జిల్లాలో ఆదివారం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పీవో, ఏపీవోలకు రెండో విడత శిక్షణ ఇచ్చి అక్కడే పోస్టల్‌ బ్యాలట్‌ అవకాశం ఇచ్చారు. దీంతో ఆదివారం చాలాచోట్ల ఉద్యోగులు గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సి వచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సోమవారం గుంటూరు నగరంలోని ఏసీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాలలో ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా సదుపాయాలను కల్పించారు. తొలి రోజున ఇరుకు ప్రదేశాల్లో అన్నింటిని ఒకేచోట కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయమే పోస్టల్‌ బ్యాలట్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ప్రక్రియ ప్రారంభమై సాఫీగా కొనసాగింది.
బారులుదీరి.. గుంటూరు పశ్చిమకి సంబంధించి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల ఉద్యోగులు ఎక్కువ మంది ఉండడంతో ఓటు వేసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులు త్వరితగతిన ఓటు వేసి తిరుగు పయనమయ్యారు. తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో రెండోరోజైన సోమవారం సాఫీగా బ్యాలట్‌ ప్రక్రియ కొనసాగింది. పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం పీవో, ఏపీవోలకు శిక్షణ ఒకచోట, బ్యాలెట్‌ మరోచోట నిర్వహించారు. దీనిపై ఉద్యోగులు ఇబ్బందులు తెలియజేయడంతో సోమవారం ఒకే కేంద్రంలో నిర్వహించారు.


నేడు ఓపీవోలు, రేపు పోలీసులు

న్నికల విధుల్లో పాల్గొనే ఓపీవోలకు మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల బాలుర పాఠశాలలో నుంచి లాంలోని చలపతి కళాశాలలోకి మార్పు చేశారు. చివరి నిమిషంలో కేంద్రం మార్చడం, అందరికీ ఓటు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. తాడికొండకు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరిగే ఓపీవోలు, పోలీసు, మైక్రో అబ్జర్వర్ల పోస్టల్‌్ బ్యాలట్‌ ప్రక్రియ కూడా చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలోనే జరపనున్నారు. పొన్నూరులోనూ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను వీఎన్‌ఆర్‌ కళాశాలలో కొనసాగిస్తున్నారు. ఓపీవోలు మంగళవారం వారికి కేటాయించిన కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఏదైనా కారణంతో ఓటుహక్కు వినియోగించుకోకపోతే బుధవారం కూడా అవకాశం ఉంటుంది. పోలీసులు, అత్యవసర సేవల సర్వీసుల వారు బుధవారం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం ఎక్కువ మంది ఉద్యోగులు ఓటింగ్‌కు వస్తారని గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని