logo

మా పోస్టల్‌ బ్యాలట్‌ ఎక్కడ..?

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌్ బ్యాలట్‌ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్‌ వినియోగంలోనూ స్పష్టత లేదు.

Published : 08 May 2024 06:26 IST

జాబితాలో పేరు లేక వెనుదిరిగిన ఉద్యోగులు
గుంటూరు పశ్చిమ కేంద్రంలో తీవ్రమైన జాప్యం
గంటల తరబడి వరుసలో నిలబడి అవస్థలు బ్యాలట్‌

వివరాలను తెలుసుకుంటున్న ఉద్యోగులు

ఈనాడు, అమరావతి, కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌్ బ్యాలట్‌ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్‌ వినియోగంలోనూ స్పష్టత లేదు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఓపీవోల పోస్టల్‌ బ్యాలట్‌ ప్రక్రియలోనూ యంత్రాంగం పని తీరుతో ఉద్యోగులు గంటల పాటు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు గంటలకుపైగా వరుసలో నిలుచుని బ్యాలట్‌ వేసేందుకు లోపలికి వెళ్తే జాబితాలో పేర్లు లేవని వెనక్కి పంపడంతో ఎక్కడికి వెళ్లి ఓటు వేయాలంటూ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో 2గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం కావడం, ఓటింగ్‌ అత్యంత నెమ్మదిగా జరగడంతో ఉద్యోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది.పశ్చిమలో రాత్రి 9గంటలకు ప్రక్రియ ముగిసింది. ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్‌లో ఫెసిలిటేషన్‌ సెంటర్‌, తేదీతో సహా ముద్రించిన పత్రాలతో కేంద్రాల వద్దకు వచ్చిన వారు అక్కడ పేరు లేకపోవడంతో ఎక్కడైతే ఓటు ఉందో అక్కడికి వెళ్లాలని సూచించడంతో ఉద్యోగులు పడిన బాధలు వర్ణనాతీతం.

  • తాడికొండ నియోజకవర్గ పరిధిలో లాంలోని చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన ఉద్యోగులకు సొంత నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసుకోవాలని సూచించారు. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్లినా అక్కడా బ్యాలట్‌ లేదని చెప్పారు.
  • ప్రత్తిపాడు నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రాన్ని నల్లపాడు లయోలా స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన వారికి బ్యాలట్‌లో పేరు లేదని చెప్పడంతో సుమారు 50 మంది వెనుదిరిగారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని బ్యాలట్‌ వేసేందుకు వెళ్లిన వారికి పేరు లేదని చెప్పడంతో వెనుదిరిగారు.

అధికారం అండతో డబ్బుల పంపిణీ

అధికారం అండతో వైకాపా వారు బహిరంగంగానే పోస్టల్‌ బ్యాలట్‌కు డబ్బులు పంపిణీ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ కేంద్రం ఏసీ కళాశాల గేటు వద్దనే అధికార పార్టీ నేతలు తిష్ఠ వేశారు. గుంటూరు తూర్పు వైకాపా అభ్యర్థి అనుచరగణమంతా అక్కడే ఉంటూ స్థానికంగా కారులో కూర్చుని డబ్బుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉదయం నుంచి ఈ తంతు కొనసాగుతుండగా సాయంత్రం పోలీసులు వచ్చి హడావుడి చేసి అక్కడి నుంచి పంపేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఉద్యోగుల వివరాలు సేకరించిన వైకాపా నేతలు వారికి ఫోన్లు చేసి ప్రలోభాలతో వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

పట్టుదలగా ఓటింగ్‌

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంలో అనేక ఇబ్బందులు వచ్చినా ఉద్యోగులు మాత్రం పట్టువదలకుండా రాత్రి 9 గంటలకు వరకు వేచి ఉండి ఓటు వేసిన తర్వాతే కదిలారు. ఒకవైపు బారులు తీరిన ఉద్యోగులు, మండుతున్న ఎండ, సాయంత్రం వాన ఇలా వరుస కష్టాలు ఉన్నా వేచిచూసి ఓటేసి వెళ్లడం గమనార్హం.


గందరగోళంతో ఇబ్బంది

శ్రీదేవి, ఉద్యోగిని

ఏసీ కళాశాలలో 7న పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోవాలని ఆర్డర్‌ కాపీ ఇచ్చారు. ఇక్కడకు వస్తే నా పేరు లేదని చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ ఓటరు కాబట్టి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లమని చెబుతున్నారు. ఆర్డర్‌ కాపీలో సూచించిన విధంగా ఇక్కడకు వస్తే మళ్లీ అక్కడికి వెళ్లమంటే ఎలా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు