logo

నిమ్స్‌లో తల్లీబిడ్డల ఆస్పత్రి

దేశంలోనే అత్యున్నత వైద్య కేంద్రంగా హైదరాబాద్‌ను మార్చాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోనే మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తాజాగా నిమ్స్‌లో పడకల సంఖ్య పెంచడంతోపాటు

Published : 21 May 2022 06:00 IST

అదనంగా రెండు వేల పడకలతో విస్తరణ

దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రణాళిక విస్తరణ ఇలా

ఈనాడు- సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: దేశంలోనే అత్యున్నత వైద్య కేంద్రంగా హైదరాబాద్‌ను మార్చాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోనే మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తాజాగా నిమ్స్‌లో పడకల సంఖ్య పెంచడంతోపాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలోనే తల్లీబిడ్డల కోసం 250 పడకలతో ప్రత్యేకమైన ఆస్పత్రిని నిర్మించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వైద్య కేంద్రం దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతోపాటు అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఉన్నవాటిపై అంతస్తులు

నిమ్స్‌లో ఉన్న ఓపీ బ్లాక్‌ అతి పురాతనమైంది. దాన్ని తొలగించి విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం మీద ఆస్పత్రిలో దాదాపు 18 అంతస్తుల ఎత్తైన భవనాన్ని నిర్మించనున్నారు. వాటికి తోడుగా ఇప్పుడున్న భవనాలపైనా అదనపు అంతస్తులను నిర్మిస్తారు. వీటి నిర్మాణాల అనంతరం ఓపీ విభాగం కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఒక టవర్‌ను కేటాయిస్తారు. సూపర్‌ స్పెషాలిటీ విభాగాన్ని మరో టవర్‌లో ఏర్పాటు చేస్తారు. అత్యవసర విభాగాన్ని ఇంకో భవనంలో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 31 వైద్య విభాగాలకు తోడుగా మరో నాలుగైదు కొత్తవి ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ప్రత్యేకంగా మాతాశిశు విభాగం

మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో భాగంగా తల్లీబిడ్డల విభాగాలను అందులో కలిపే ఏర్పాటు చేస్తున్నారు. నిమ్స్‌లో కొత్తగా రెండు వేల పడకలు వస్తున్న దృష్ట్యా అందులోనే తల్లీబిడ్డల విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదని సమాచారం. దేశంలోనే అత్యున్నత సౌకర్యాలతో తల్లీబిడ్డల వైద్యం కోసం నిమ్స్‌ ఆవరణలోనే ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ఒక టవర్‌ నిర్మాణాన్ని ప్రత్యేకంగా చేపట్టబోతున్నారు. నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ, తల్లీబిడ్డల ఆస్పత్రి నిర్మాణం మీద ప్రణాళిక రూపొందుతోందని రోడ్లు భవనాల శాఖ ముఖ్య ఇంజినీర్‌ గణపతిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.


● కొత్త భవనాలు నిర్మించే స్థలం 18 ఎకరాలు

● అంచనా వ్యయం రూ.1,500 కోట్లు

● అందుబాటులోకి వచ్చే అదనపు పడకలు: 2 వేలు

● తల్లీబిడ్డల ఆస్పత్రి పడకలు: 250

● ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి: 1,600

● ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న విభాగాలు: 31

ప్రస్తుతం సిబ్బంది  పీజీలు: 300

● హెచ్‌ఎంవోడీలు: 30

● ఇతర వైద్యులు: 100

● నర్సింగ్‌ సిబ్బంది: 800 మంది

● రోజూ చికిత్సకు వచ్చే రోగులు: 2 వేల నుంచి 3 వేలు

● ఇన్‌పేషెంట్లు: 200 మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని