logo

Hyderabad: పాలసీ కడితే ‘రిటర్న్‌ గిఫ్ట్‌’.. రూ.1.6కోట్లు టోకరా!

బీమా పాలసీ పేరుతో విశ్రాంత ఉద్యోగి(72) నుంచి రూ.1.6 కోట్లు దోచేసిన నకిలీ ఏజెంట్ల ముఠాను రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 17 Feb 2023 07:32 IST

నిందితులు అన్సారీ, వికాస్‌సింగ్‌, తరుణ్‌శర్మ, మనీష్‌, లలిత్‌

ఈనాడు,హైదరాబాద్‌: బీమా పాలసీ పేరుతో విశ్రాంత ఉద్యోగి(72) నుంచి రూ.1.6 కోట్లు దోచేసిన నకిలీ ఏజెంట్ల ముఠాను రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తమ దగ్గర పాలసీలు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో రిటర్నులు ఇప్పిస్తామంటూ డబ్బు కాజేస్తున్న ముఠాలోని అయిదుగుర్ని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి ఏడు ఫోన్లు, రూ.1.5 లక్షల నగదు, ఎనిమిది డెబిట్‌కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ డీసీపీ బి.అనురాధ, ఏసీపీ జి.వెంకటేశం, ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌ జిల్లాకు చెందిన ముర్షీద్‌ అన్సారీ(32), వికాస్‌సింగ్‌(28) నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి స్థానికులైన తరుణ్‌శర్మ(35), మనీష్‌ తండర్‌(34), లలిత్‌కుమార్‌(27)ను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. డేటా ప్రొవైడర్ల నుంచి బీమా పాలసీదారుల వివరాలు సేకరించి ఏజెంట్ల పేరిట ఫోన్లు చేస్తారు. పాలసీలపై అధిక మొత్తంలో రిటర్నులు ఇస్తామని, పాలసీ బదలాయించుకోవాలని నమ్మించి డబ్బు వసూలు చేస్తారు. ఎల్బీనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగికి నిందితులు 2016లో ఫోన్‌ చేశారు. ఎక్కువ మందితో పాలసీలు చేయిస్తే రిటర్నులు ఎక్కువగా వస్తాయని ఆశ పెట్టారు. బాధితుడు 12 మందిని చేర్పించాడు. ఆరేళ్లలో దఫదఫాలుగా రూ.1.6 కోట్లు నిందితుల ఖాతాల్లో జమ చేశాడు. ఇన్నేళ్లు కట్టినా డబ్బు తిరిగిరాకపోవడంతో బాధితుడి కుమారుడికి అనుమానం వచ్చింది. తెలిసిన వారిని సంప్రదించగా మోసమని తేలడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని