logo

వానలు.. వ్యాధులు.. లక్షణాలు.. జాగ్రత్తలు..

వానలతో వ్యాధులు ముప్పు పొంచి ఉంది. దోమలు, ఈగల బెడదతోపాటు కలుషిత నీళ్ల కారణంగా రోగాలు ప్రబలుతాయి.

Published : 21 Jul 2023 02:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: వానలతో వ్యాధులు ముప్పు పొంచి ఉంది. దోమలు, ఈగల బెడదతోపాటు కలుషిత నీళ్ల కారణంగా రోగాలు ప్రబలుతాయి. వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచించిన వివరాలివీ..

మలేరియా

ఈ సీజన్‌లో వచ్చే జబ్బుల్లో అత్యంత సమస్యాత్మకమైనది. ఈ జ్వరానికి కారణమయ్యే ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ఆడ అనాఫిలస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇది మురుగు నీటిలో పెరుగుతుంది. మలేరియాలో రెండు రకాలున్నాయి.. ప్లాస్మోడియం వైవాక్స్‌ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్‌). వీటిలో పీఎఫ్‌ అత్యంత ప్రమాదకరం.

డెంగీ

డెంగీకి కారణమయ్యే ఈడిన్‌ ఈజిప్టై దోమ వాన నీటిలో వృద్ధి చెందుతుంది. ఈ దోమ కుట్టిన 7-8 రోజుల్లో జ్వరం వస్తుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి దుద్దర్లు, వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన తదితర లక్షణాలుంటాయి. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయి షాక్‌ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఫ్లూ

ఈ సీజన్‌లో ఫ్లూ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిపై దాడి చేస్తుంది. ముక్కు కారటం, జలుబు, దగ్గు, ఆయాసం ప్రధాన లక్షణాలు.

డయేరియా.. టైఫాయిడ్‌

కలుషిత నీళ్లు, ఆహారం ద్వారా డయేరియా, కలరా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు ప్రబలుతాయి. సాల్మనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సోకుతుంది.

పాము కాట్లు

చిత్తడి కారణంగా పాములు బయట తిరుగుతాయి. పాత భవంతులు, నాలాలకు దగ్గరగా ఉన్న మురికి వాడలు ఇతరత్రా జనసంచార ప్రాంతాలు వీటికి ఆవాసం.


సెలవులు రద్దు.. 24 గంటలూ అప్రమత్తం

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

అందరి సెలవులు రద్దు చేశాం. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, న్యూరోసర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 2 వేల మంది రోగులు వస్తున్నారు. నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితికి వెళ్లిన వాళ్లు కూడా వస్తుంటారు.


కలుషిత నీరు.. ఆహారంతో జాగ్రత్త

డాక్టర్‌ శంకర్‌, సూపరింటెండెంట్‌, ఫీవర్‌ ఆసుపత్రి, నల్లకుంట

పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వానలో తడవకూడదు. రెయిన్‌ డ్రస్‌, గొడుగులు వాడాలి. కాచి, చల్లార్చి వడబోసిన నీళ్లు తాగాలి. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. ఇంట్లోనే వేడివేడిగా చేసుకొని తినాలి. తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి. పూలకుండీలు, కూలర్లు, డ్రమ్ముల్లో నీటి నిల్వ ఉండకూడదు. వాంతులు, విరేచనాలు, జ్వరాలు వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని