logo

కన్నీటి చెమ్మ.. తుడిచేదెవరమ్మా?

ఆహార పదార్థాలు డెలివరీ చేసే యువకుడు.. ఫోన్‌ నెంబరు ఆసరా చేసుకొని యువతులకు అశ్లీల చిత్రాలు పంపి వేధించేవాడు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌లో అసభ్య పదాలతో చాటింగ్‌ చేసేవాడు.

Published : 31 Jul 2023 03:18 IST

మహానగరంలో ఆకతాయిల వేధింపులకు పడని కళ్లెం

ఈనాడు, హైదరాబాద్‌: ఆహార పదార్థాలు డెలివరీ చేసే యువకుడు.. ఫోన్‌ నెంబరు ఆసరా చేసుకొని యువతులకు అశ్లీల చిత్రాలు పంపి వేధించేవాడు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌లో అసభ్య పదాలతో చాటింగ్‌ చేసేవాడు. అంతర్జాలంలో ఫోన్‌ నెంబర్లు ఉంచి వ్యభిచారిణులుగా ముద్ర వేస్తానంటూ బెదిరించేవాడు. రైతుబజార్‌లో కూరగాయలు కొనేందుకు వెళ్లిన మహిళల చేతులు తాకుతూ కొందరి వెకిలిచేష్టలు.. ఇవీ మహానగరంలో మహిళలు/యువతులు ఎదుర్కొంటున్న వేధింపులకు ఉదాహరణలు. అయితే ఇంటా.. బయటా ఎదురయ్యే ఇబ్బందులకు మేమున్నామంటూ ‘షీటీమ్స్‌’ కొండంత భరోసానిచ్చేవి.  కొంతకాలంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో షీటీమ్స్‌ విభాగాలకు ఇన్‌ఛార్జిలే ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు బదిలీలవుతుండటం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొందరు మౌనంగా ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు.

నంబర్‌ దొరికితే నరకమే

ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక సందర్భంలో ఉద్యోగినులు, విద్యార్థినులు, గృహిణులు ఫోన్‌ నంబర్లు ఇస్తుంటారు. నగదు లావాదేవీల్లోనూ ఫోన్‌ నంబర్లే కీలకం. వీటితో కొందరు ఆకతాయిలు వేధింపులకు తెగిస్తున్నారు. యాప్‌ల ద్వారా గొంతు మార్చి నరకం చూపుతున్నారు. షాపింగ్‌మాల్స్‌, థియేటర్లు, మెట్రోస్టేషన్ల వద్ద లక్కీడ్రా పేరిట కొందరి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు, రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో చాటుమాటుగా యువతులు, మహిళలు ఏమరపాటుగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

సూచన: మీకు అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్‌ నంబరు ఇవ్వొద్దు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్‌, ఫోన్లు మాట్లాడటం ఎప్పటికైనా అపాయమే.

మాజీలు.. సామాజిక మాధ్యమాలు

అమీర్‌పేట్‌కు చెందిన ఓ యువతికి ఓ ప్రైవేటు ఉద్యోగి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని ప్రస్తావన తేవడంతో దగ్గరైంది. చివరికి అతనికి ముందే పెళ్లయినట్టు తెలుసుకొని దూరంగా ఉంచటంతో అతడు రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసున్నప్పుడు తీసిన వీడియోను బాధితురాలి తల్లిదండ్రులకు పంపాడు. చదువులు, కొలువుల సమయాల్లో యువతీ యువకుల మధ్య పరిచయాలు పెరుగుతాయి. వీరిలో కొందరు ప్రేమ, సహజీవనం వరకూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య ఉన్నంత వరకూ బాగానే ఉంటారు. పొరపొచ్చాలు వచ్చినప్పుడు విడిపోతారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకర పోస్టింగ్‌లతో యువతులను ఇబ్బంది పెడుతుంటారు.

సూచన: ఎవరైనా పరిచయమైతే వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. బాగున్నప్పుడు అన్నీ చెప్పేస్తే అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు అవే వివరాలు తలనొప్పిగా మారతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని