logo

ఎన్ని‘కలలు’.. సుడిగాలి పర్యటనలు

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు

Updated : 07 Mar 2024 07:03 IST

పార్టీలో ఉత్తేజం నింపేందుకు సీఎం కసరత్తు

నాలుగు రోజులపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

 ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో నాలుగు రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే భారీ సభలను ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ తన హవా కొనసాగించినా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం ఘోరంగా దెబ్బతింది. లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలు సాధించి ఆ లోటును భర్తీ చేసుకోవడంపై సీఎం దృష్టిసారించారు.


నగరంపై పట్టు కోసం..

గ్రేటర్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 29 శాసనసభ స్థానాలు ఉంటే కేవలం మూడుచోట్ల మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ప్రస్తుతం బల్దియాలోనూ కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చుట్టుపక్కల ఉన్న నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు భారాస చేతిలోనే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్‌ ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటోంది. నగరంలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా.. సీఎం గురువారం నుంచి నాలుగు రోజులపాటు నగరంలో పర్యటించనున్నారు.


బైరామల్‌గూడ పైవంతెన ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన రెండోస్థాయి పైవంతెన సీఎం ఈ నెల 9న సా.4 గంటలకు ప్రారంభించనున్నారు. శంషాబాద్‌, ఒవైసీ ఆస్పత్రి వైపు నుంచి బీఎన్‌రెడ్డినగర్‌, నాగార్జునసాగర్‌ వైపు వెళ్లే వాహనాలకు., చింతలకుంట చెక్‌పోస్టు అండర్‌పాస్‌ మీదుగా హయత్‌నగర్‌, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగకరం. ఇదే కూడలిలో ప్రస్తుతం రెండు లూప్‌లు నిర్మాణంలో ఉండగా, మొదటి స్థాయి పైవంతెనలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.


పెండింగ్‌ ప్రాజెక్టులకు శ్రీకారం

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. పాతబస్తీ మెట్రోతోపాటు సికింద్రాబాద్‌- రామగుండం, నాగ్‌పూర్‌ జాతీయ రహదారిలోనూ ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని మురుగుశుద్ధి కేంద్రాలనూ ప్రారంభించనున్నారు.


పాతనగరానికి మెట్రోరైలు

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: పాతబస్తీ మెట్రోపనులకు ఈ నెల 8న సా.5 గంటలకు ఫలక్‌నుమాలో రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫరూక్‌నగర్‌ బస్సు డిపో దగ్గర బహిరంగ సభ. అక్కడే డ్వాకా మహిళలతో మాటామంతీ ఉంటుంది. కారిడార్‌-2 జూబ్లీ బస్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కి.మీ.లు మెట్రో మార్గం నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి.. 2011లో పనులు ప్రారంభించింది, జెబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి పాతబస్తీ మెట్రోపై సమీక్షించి, మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఎల్‌బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో లైన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఇవీ రోజు వారీ కార్యక్రమాలు

7-03-2024

  •   ఉదయం 11.30కు హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిలో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అల్వాల్‌ ముత్యాలమ్మ గుడి దగ్గర శంకుస్థాపన.
  •  మధ్యాహ్నం 1.30కు బంజారాహిల్స్‌లోని డాక్టర్‌ బాబూ జగజ్జీవన్‌రామ్‌ భవన్‌ ప్రారంభం.

    8-03-2024

  • సాయంత్రం 4 గంటలకు జూపార్కుకు సమీపంలో మీరాలం మురుగుశుద్ధి కేంద్రం ప్రారంభం.
  •   సాయంత్రం 4.30కు ఇబ్రంహీం గోల్కొండ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూలు భవనాల ప్రారంభోత్సవం.

    9-03-2024

  •  4.30కు నల్ల చెరువు మురుగుశుద్ధి కేంద్రం ప్రారంభం.
  •  సాయంత్రం 5 గంటలకు నాగ్‌పూర్‌ రోడ్డులో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ దగ్గరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన. ఆ తరువాత అక్కడే బహిరంగ సభ.

12-03-2024

  • పరేడ్‌ గ్రౌండ్‌లో స్వయం సహాయక సంఘాలతో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహణ. సమయం నిర్ధారణ కాలేదు.
  •  అదే రోజు అల్వాల్‌ టిమ్స్‌ ఆస్పత్రి ఎదురుగా డాక్టర్‌ సైరస్‌ పుణేవాలా అంటువ్యాధుల సెంటర్‌కు శంకుస్థాపన.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని