logo

ర్యాంకుల్లో పడిపోతున్నాం

సమాజాభివృద్ధికి ఉపకరించే పరిశోధనలు... విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే విద్యను అందిస్తున్నామంటూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు.. పరిపాలనా యంత్రాంగం చేస్తున్న ప్రకటనలు నీటిమూటలవుతున్నాయి.

Updated : 10 Mar 2024 05:37 IST

జాతీయస్థాయిలో ప్రభావం చూపించని విశ్వవిద్యాలయాలు 

ఈనాడు, హైదరాబాద్‌: సమాజాభివృద్ధికి ఉపకరించే పరిశోధనలు... విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే విద్యను అందిస్తున్నామంటూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు.. పరిపాలనా యంత్రాంగం చేస్తున్న ప్రకటనలు నీటిమూటలవుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు, పరిశోధన అంశాలపై నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) గతేడాది జూన్‌లో ప్రకటించిన ర్యాంకుల్లో తొలి పదిస్థానాల్లో  రాష్ట్రంలోని ఒక్క విశ్వవిద్యాలయం పేరు కనిపించలేదు. పరిశోధనల్లో పెద్దగా  పుôోగతి లేదు. తొలి పది స్థానాల్లో ఉండాలంటే బోధన, పరిశోధన పద్ధతులను భిన్నంగా రూపొందించాలి.

ఆచార్యులు... పరిశోధనల్లేవ్‌.. ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. వీరు చేస్తున్న వాటిలో కొన్ని దేశంలోని వివిధ వర్సిటీలతో పోటీపడుతున్నాయి. సాంకేతిక విద్యను బోధించడంలో పేరున్న జేఎన్‌టీయూ...ఐఐటీ హైదరాబాద్‌,  నిట్‌, ట్రిపుల్‌ఐటీలతో పోటీపడుతూ ముందుకు వెళ్తుండేది. ఇది నాణేనికి ఒకవైపు కాగా... మరోవైపు పరిశీలిస్తే  పదేళ్లలో పెద్దసంఖ్యలో ఆచార్యులు ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ తీరుతో ప్రైవేటు, కార్పొరేట్‌, ప్రభుత్వరంగ సంస్థలు వర్సిటీలతో పరిశోధనలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదు. కొద్దినెలల క్రితం ఓ సంస్థ రూ.100 కోట్ల విలువైన పరిశోధనలకు సంబంధించి ఉస్మానియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. శాశ్వత ప్రొఫెసర్లు లేకపోవడంతో వెనకడుగు వేసింది.

వేగంగా కిందకు వెళ్తూ...

  • పదేళ్ల పనితీరు, పరిశోధనల ప్రభావాలను చూస్తే. ఓవరాల్‌ ర్యాంకుల్లో 15లోపు ర్యాంకు తెచ్చుకున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం... మూడేళ్ల నుంచి పదిహేనుకంటే ఎక్కువ ర్యాంకుల్లో నిలుస్తోంది.
  • ఉస్మానియా దేశవ్యాప్తంగా ఓవరాల్‌ ర్యాంకుల్లో రెండేళ్ల క్రితం యాభైలోపు సాధించినా... గతేడాది 64కు పడిపోయింది.
  • జేఎన్‌టీయూ హైదరాబాద్‌ మూడేళ్లుగా ర్యాంకుల్లో కిందికి వెళ్తూనే ఉంది. తొలి 20 స్థానాల్లో నిలుస్తామంటూ జేఎన్‌టీయూ అధికారులు గతేడాది ప్రకటించినా... 83వ ర్యాంకు దక్కింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని