logo

తెలుసుకో.. ఓటు సద్వినియోగం చేసుకో

ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటింది. అలాంటి ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకుని వినియోగించుకోవాలి. అందుకోసం ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది.

Updated : 16 Apr 2024 06:34 IST

కరపత్రాలు, గోడ పత్రికలు, గైడ్‌తో అవగాహన
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి

ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటింది. అలాంటి ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకుని వినియోగించుకోవాలి. అందుకోసం ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. ఓటరు మార్గదర్శి (గైడ్‌) కరపత్రాలు, గోడ పత్రికలు, తదితరాలు ముద్రించి విస్తృత ప్రచారం చేస్తోంది. శత శాతం లక్ష్యంగా యంత్రాంగం ముందడుగు వేస్తోంది.  

ఎన్నికల్లో చేయాల్సినవి- చేయకూడనివి

లోక్‌సభ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఎన్నికలు మే 13న జరుగుతాయి. ఈ ప్రక్రియలో తప్పులు జరగకుండా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటరు కీలకం కావడంతో నమోదు మొదలు, ఓటు వేసే విధానం అవసరమైన పత్రాలు, పోలింగ్‌ ప్రక్రియ, చేయాల్సినవి, చేయకూడనివి తదితర వాటిపై అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేస్తున్నారు.  

ప్రతి పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఏర్పాటు

ఓటు వేసే విధానం, పోలింగ్‌ కేంద్రంలో గుర్తింపునకు ఉపయోగపడే పత్రాలు తెలిసేలా గోడ పత్రికలను ముద్రించారు. వీటిని ప్రతి పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. ఓటు వేసేందుకు అవసరమయ్యే పత్రాల వివరాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్య కూడళ్లలో ప్రదర్శిస్తారు. దివ్యాంగులు, బధిరులు, దృష్టి లోపం, కలిగిన వారితో సిబ్బంది ఎలా వ్యవహరించాలనే అంశాలపై గోడ పత్రికను ముద్రించారు.  

ఇంటింటికీ పంపిణీ: ఓటర్లకు ఎన్నికల ప్రక్రియలో వివరాలను తెలియజేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి ఓటరు గైడ్‌ పుస్తకాన్ని ముద్రించింది. ఇందులో నమోదు పోలింగ్‌ ప్రక్రియ ఓటు వేసే విధానం, అందుబాటులో ఉన్న యాప్‌లు, కల్పించనున్న కనీస సౌకర్యాలు ఓటర్లు ప్రతిజ్ఞ అంశాలను పొందుపర్చారు. వీటిని బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటరుకు అందజేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని