logo

నోరూరించే మామిడి.. మార్కెట్‌లో సందడి

నోరూరించే మామిడి పండ్ల సీజన్‌ రానేవచ్చింది.. మార్కెట్‌లో మామిడి విక్రయాలు జోరు ఆరంభమైంది. నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో మామిడి క్రయవిక్రయాలతో సందడి నెలకొంది.

Published : 16 Apr 2024 06:01 IST

బాటసింగారంలో క్రయవిక్రయాల జోరు

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: నోరూరించే మామిడి పండ్ల సీజన్‌ రానేవచ్చింది.. మార్కెట్‌లో మామిడి విక్రయాలు జోరు ఆరంభమైంది. నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో మామిడి క్రయవిక్రయాలతో సందడి నెలకొంది. మార్కెట్‌లో మామిడి విక్రయాలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. గతేడాది మామిడి సీజన్‌లో బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌లో రూ.239 కోట్ల వ్యాపారం సాగింది.

వివిధ ప్రాంతాల నుంచి రాక..

తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలనుంచి బాటసింగారం పండ్ల మార్కెట్‌కు మామిడిని రైతులు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20,900 మెట్రిక్‌ టన్నుల మామిడి విక్రయానికి వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో 35,000 మెట్రిక్‌ టన్నులు విక్రయాలు జరిగాయి. గతేడాదిలో పోలిస్తే ఇప్పటివరకు మామిడి రాక కొంచెం తక్కువగానే ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్‌లో మామిడి ధర టన్ను సగటున రూ.38,000 వేల వరకు పలుకుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ధర కొంచెం ఎక్కువనే వినిపిస్తోంది. మేలు రకం హిమాయత్‌ మామిడి 20 కిలోల బాక్స్‌ రూ.4వేలు, బెనిషన్‌ రూ.1,700 వరకు పలుకుతోంది.


 కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

సీజన్‌లో బాటసింగారం మార్కెట్‌కు వచ్చే మామిడి క్రయవిక్రయాలు సాఫీగా సాగేందుకు గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మామిడి క్రయవిక్రయాలకు అనువుగా ప్రత్యేకంగా 12 ఎకరాల ప్రాంగణంలో భారీ షెడ్లు, మరో 7 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మార్కెట్‌ ప్రాంగణంలో మామిడి పండ్లతో వచ్చే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా అంతర్గత రోడ్లు నిర్మించారు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులకు తాగునీరు అందించేందుకు 7 శీతల తాగునీటి యంత్రాలు, మామిడి బిడ్డింగ్‌ తదితరాల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచారు.


బాటసింగారం బాట పట్టిన మామిడి

రాజధాని శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌ మామిడి రాశులతో నిండిపోయింది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మామిడి లోడ్లతో లారీలు, ట్రాలీలు పోటెత్తాయి. ఇప్పటివరకు సుమారు 20 వేల మెట్రిక్‌ టన్నులు మామిడి దిగుమతి అయింది. నాణ్యతనుబట్టి టన్నుకు సగటున రూ.38 వేల ధర పలుకుతోంది. ఈ సీజన్‌ ముగిసే వరకు లక్ష మెట్రిక్‌ టన్నుల మామిడి మార్కెట్‌కు రానుందని అధికారులు తెలిపారు. సోమవారం మార్కెట్లో కనువిందు చేసిన మామిడి రాశులివి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని